తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'పునాదిరాళ్ల'తో బలమైన పునాది వేసిన మెగాస్టార్​

'పునాదిరాళ్లు' చిత్రంతో తెలుగుతెరకు పరిచయమయ్యారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమాతో శివ శంకర వరప్రసాద్​ నుంచి చిరుగా మారారు. ఈ చిత్రం విడుదలైన నేటికి 40 ఏళ్లు పూర్తి చేసుకుంది.

చిరంజీవి

By

Published : Jun 21, 2019, 12:52 PM IST

Updated : Jun 25, 2019, 10:15 AM IST

చిరంజీవి.. ఈ పేరు వింటే ప్రతీ తెలుగువాడు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆయన డ్యాన్సులకు ఫిదా అయిపోతారు. నటనకు దాసోహం అంటారు. 'పునాదిరాళ్లు'తో తెలుగు సినీ పరిశ్రమలో బలమైన పునాది వేసి అప్రతిహతంగా 40 ఏళ్లు పూర్తి చేసుకున్నారు మన మెగాస్టార్. ఆయన తొలి చిత్రం పునాదిరాళ్లు 1979 జూన్ 21న విడుదలైంది. మరి ఆ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు!

పునాదిరాళ్లకు 40 ఏళ్లు

పునాదిరాళ్లులో అవకాశం..

ఈ సినిమాలో చిరంజీవి కీలకపాత్రలో నటించారు. వాస్తవానికి ఆ పాత్రకు కమెడియన్ సుధాకర్​ను అనుకున్నారంట దర్శకుడు రాజ్​కుమార్​. అయితే అప్పటికే హీరోగా సినిమాల్లో నిలదొక్కుకుంటున్న సుధాకర్​కు భారతీరాజా రూపొందిస్తున్న ఓ తమిళ సినిమాలో అవకాశం వచ్చింది. ఈ కారణంగా సుధాకర్ స్థానంలో చిరంజీవిని తీసుకున్నాడు దర్శకుడు. పునాదిరాళ్లు చిత్రంలో హీరో నరసింహరాజు.

ప్రాణంఖరీదుతో ప్రేక్షకులకు పరిచయం..

పునాదిరాళ్లుతో తెలుగుతెరకు పరిచయమైనా.. ప్రాణంఖరీదు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు చిరంజీవి. ప్రాణం ఖరీదు 1978 సెప్టెంబరులో విడుదలైంది. తొలి సినిమా కంటే ముందుగా తర్వాత నటించిన ప్రాణంఖరీదు విడుదలైంది.

చిరంజీవికి ఆ పేరు ఎలా వచ్చింది..
చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్. అయితే పునాదిరాళ్లు సమయంలో స్క్రీన్​ నేమ్​ను చిరంజీవిగా మార్చుకున్నారు. కలలో ఎవరో చిరంజీవి అని పిలిచినట్టు.. దేవుని ఆశీస్సులతో తనకు పేరు లభించినట్టు చాలా ఇంటర్వ్యూల్లో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు.

ఆమె వందో సినిమా చిరుకు మొదటి చిత్రం..

ప్రముఖ నటి రోజారమణి(హీరో తరుణ్ తల్లి) వందో చిత్రం.. చిరంజీవి మొదటి సినిమా పునాదిరాళ్లే కావడం విశేషం. ఈ విషయాన్ని ఆవిడే చెప్పింది. భక్తప్రహ్లాద లాంటి ఎన్నో సినిమాల్లో బాలనటిగా మెప్పించిన రోజారమణి.. తెలుగు, తమిళ భాషల్లో చాలా సినిమాల్లో నటించారు.

పునాదిరాళ్లుతో మొదలైన మెగాస్టార్ ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఖైదీ, స్వయంకృషి, వేట, అడవి దొంగ, రుద్రవీణ, చంటబ్బాయి, కొండవీటి దొంగ, జగదేకవీరుడు అతిలోకసుందరి, ఆపద్భాందవుడు,హిట్లర్, స్నేహం కోసం లాంటి విభిన్నతరహా చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

చూడాలని ఉంది, బావగారూ బాగున్నారా, ఇంద్ర, ఠాగుర్, జైచిరంజీవ, స్టాలిన్, శంకర్ దాదా సిరీస్​ చిత్రాలతో మాస్​లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నారు. తర్వాత రాజకీయ ప్రవేశం చేసిన చిరంజీవి సినిమాలకు కొద్దిగా గ్యాప్ తీసుకున్నారు. అనంతరం 2017లో ఖైదీ నెంబర్ 150తో బాస్​ ఈజ్ బ్యాక్ అంటూ రీ ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టారు. త్వరలో సైరా నరసింహారెడ్డితో మనముందుకు రాబోతున్నారు మెగాస్టార్.

Last Updated : Jun 25, 2019, 10:15 AM IST

ABOUT THE AUTHOR

...view details