తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రముఖుల మనసు గెలిచిన 'సైరా'- ఎవరేమన్నారంటే?

మెగాస్టార్​ చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు టాలీవుడ్​ సినీ ప్రముఖులు. చిరు కెరీర్​లో ఇదో మరుపురాని చిత్రంగా అభివర్ణిస్తున్నారు.​ ఈ సినిమాను చిరు తనయుడు రామ్​చరణ్​ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించగా... సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ సినిమా రికార్డు కలెక్షన్ల వైపు దూసుకెళ్తోంది.

ఘరానామొగుడు మళ్లీ వేట మొదలెట్టేశాడు...!

By

Published : Oct 3, 2019, 1:16 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి నటన 'సైరా' సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లిందని అభిప్రాయపడ్డాడు టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేశ్‌బాబు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. రామ్‌చరణ్‌ నిర్మించిన ఈ చిత్రానికి సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించాడు. అక్టోబర్‌ 2న చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ప్రతిఒక్కరూ తప్పక చూడాల్సిన చిత్రం 'సైరా'. ఈ సినిమాలో విజువల్స్‌, నిర్మాణ విలువలు ఒక ఎత్తయితే చిరంజీవి నటన సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లింది. రామ్‌చరణ్‌, సురేందర్‌రెడ్డికి కంగ్రాట్స్‌. 'సైరా'ని చాలా అద్భుతంగా చిత్రీకరించిన... సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలుకి ప్రత్యేక అభినందనలు. ఇటీవల కాలంలో నేను చూసిన అద్భుతమైన విజువల్స్‌ ఇవి.
- మహేశ్‌ బాబు, సినీ హీరో

"నేను దక్షిణ కొరియాలో ఉన్నాను. అందుకే 'సైరా' చిత్రం చూడటం కుదరలేదు. కానీ టాక్‌ నా వరకు వచ్చింది. ఇండియాలో బాక్సాఫీస్‌ ఘరానా మొగుడు మళ్లీ వచ్చేశాడని అంటున్నారు. ఇక్కడ నుంచే చిరంజీవి సర్‌కు నా హగ్​."
- నాని, సినీ హీరో

'మెగాస్టార్‌' ఈ ఒక్కపేరు నేను పెద్దవాడిని అనే విషయాన్ని మర్చిపోయేలా చేసింది.. నన్ను చిన్నపిల్లాడిని చేసేసింది. సంతోషంతో కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. నన్ను నేను మర్చిపోయేలా చేసినందుకు థాంక్యూ మెగాస్టార్‌. 'సైరా నరసింహారెడ్డి' ఇచ్చిన కొణిదెల ప్రొడక్షన్​కు థాంక్యూ అనేది చాలా చిన్న పదం.
- సాయిధరమ్‌ తేజ్‌, సినీ హీరో

"నేను చిరంజీవి అభిమానిని అయినందుకు చాలా సంతోషిస్తున్నాను. సైరాలో ప్రతి సన్నివేశం చాలా బాగుంది. స్వాతంత్య్ర సమరయోధుడి జీవితాన్ని చాలా అద్భుతంగా చిత్రీకరించారు. సినిమాలోని ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారు."
- వరుణ్‌ తేజ్‌, సినీ హీరో

ఎమోషన్స్, అనుభవానికి సైరా నర్సింహారెడ్డి పెద్ద పీట వేశారు. మెగాస్టార్ ఫెర్ఫార్మెన్స్ అద్భుతం. సురేందర్ రెడ్డి చరిత్రను వెండితెర మీద అద్భుతంగా ఆవిష్కరించారు. నటీనటుల ప్రదర్శన ఎంత రిచ్‌గా ఉందో రాంచరణ్ ప్రొడక్షన్ విలువలు అంతే రిచ్‌గా ఉన్నాయి.
- సుధీర్ బాబు, సినీ హీరో

"మెగాస్టార్‌ అద్భుత నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాడు. సైరా చిత్రబృందానికి నా అభినందనలు. దర్శకుడు సురేందర్‌ రెడ్డి సినిమా కోసం పడిన కష్టం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. ప్రీ క్లైమాక్స్​లో వచ్చే సన్నివేశాల్లో తమన్నా నటన, డ్యాన్స్​ చాలా బాగుంది. నిర్మాత రామ్‌చరణ్‌ ఈ చారిత్రక చిత్రంతో తండ్రికి అసలైన గిఫ్ట్‌ ఇచ్చాడు."
- దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు

'ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి' జీవితానికి చిరంజీవి జీవం పోశారు. కాలగర్భంలో కలిసిపోయిన చరిత్రను మళ్లీ వెలుగులోకి తెచ్చారు. జగపతిబాబు, సుధీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా తమ పాత్రలను అద్భుతంగా పోషించారు. సినిమాకు వీరంతా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
- దర్శకధీరుడు, ఎస్ఎస్ రాజమౌళి

నర్సింహారెడ్డిగా తెర మీద మెగాస్టార్ గర్జించారు. ప్రాజెక్టును బలంగా నమ్మి.. అద్భుతంగా తెర మీద ఆవిష్కరించిన రామ్‌చరణ్‌కు హ్యాట్సాఫ్. సురేందర్ రెడ్డి దర్శకత్వం అద్భుతం. రత్నవేలు విజువల్స్ మైండ్ బ్లోయింగ్. తమన్నా అద్భుతంగా నటించింది’
- అనిల్ రావిపూడి, దర్శకుడు

సినిమా పట్ల ఉన్న అంకితభావం, ప్రేమకు... మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌కు కంగ్రాట్స్. స్వాతంత్య్ర సమరయోధుడి కథను అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు సురేందర్ రెడ్డికి ధన్యవాదాలు. నయనతార, తమన్నాలు తమ పాత్రలతో వెండితెరపై మెరిశారు.
- శ్రీను వైట్ల, దర్శకుడు

"చిరంజీవి సర్‌ని ఇటువంటి చారిత్రక చిత్రాల్లో చూడాలనే నా కల నెరవేరింది. అత్యద్భుతమైన విజువల్స్‌. అద్భుతమైన సన్నివేశాలు. ఉత్కంఠభరితమైన నటన. చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, తమన్నాతోపాటు సురేందర్‌ రెడ్డికి నా హృదయపూర్వక అభినందనలు".
- సంపత్‌ నంది, దర్శకుడు

ఈ రోజు చరిత్ర మళ్లీ పుట్టింది.. చిరంజీవి అయ్యింది.. చిత్ర యూనిట్‌కు హ్యాట్సాఫ్‌.
- హరీష్ శంకర్, దర్శకుడు

ABOUT THE AUTHOR

...view details