'చంద్రయాన్-2'.. భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ప్రాజెక్ట్. ఇస్రో శాస్త్రవేత్తలు దృఢ సంకల్పంతో చేసిన ఈ ప్రయోగ ల్యాండింగ్ సమయంలో ఇబ్బంది తలెత్తింది. కీలకమైన ల్యాండర్, రోవర్‌తో సంబంధాలు తెగిపోయాయి. అయినా.. శాస్త్రవేత్తలకు మద్దతు తెలుపుతూ పలువురు సినీ ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు. కేవలం కమ్యూనికేషన్ మాత్రమే కోల్పోయామని, నమ్మకాన్ని కాదంటూ వారిలో మనో ధైర్యం నింపుతున్నారు.
"దేశం మొత్తం ఒక్కటిగా నిలిచి, గర్వపడేలా చేసిన ఇస్రోకు ధన్యవాదాలు" -అజయ్ దేవగణ్, హీరో
"ప్రతి ప్రయాణంలోనూ అడ్డంకులు ఉండటం సహజం. అవే ఉన్నత లక్ష్యాలను చేరేందుకు సహాయపడతాయి. ఇస్రో శాస్త్రవేత్తలు.. తమ విధుల్ని అద్భుతంగా నిర్వర్తించి చంద్రుని దగ్గరకు వెళ్లగలిగారు. మీరు నిజంగా మా మనసులు గెలిచారు. మీ కృషికి వందనాలు" -ఎస్.ఎస్.రాజమౌళి, దర్శకుడు
"శాస్త్రవేత్త లేకుండా ప్రయోగం లేదు. కొన్నిసార్లు విజయం సాధిస్తాం. మరికొన్ని సార్లు ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటాం. ఇస్రో కృషికి సెల్యూట్ చేస్తున్నా. చంద్రయాన్-2తో ఎంతో గర్విస్తున్నాం. త్వరలో చంద్రయాన్-3 వస్తుందని ఆశిస్తున్నాం". -అక్షయ్ కుమార్, బాలీవుడ్ హీరో
"మనం కేవలం కమ్యూనికేషన్ మాత్రమే కోల్పోయాం. నమ్మకాన్ని కాదు. ఇస్రోను చూసి మేం గర్విస్తున్నాం...#చంద్రయాన్2" -సన్నీ దేఓల్, నటుడు,ఎంపీ