సార్వత్రిక సంగ్రామానికి తారాలోకం తరలివచ్చింది. ఓటు తమ హక్కు అని.. భవిష్యత్తు నిర్ణయించే బాధ్యతని చాటిచెప్పింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నా.. నచ్చిన నేతలను ఎన్నుకోవాలన్నా ఐదేళ్లకోసారి వచ్చే అవకాశమని చాటిచెప్పింది. 'మేము ఓటేశాం.. మీరూ వేయండి' అంటూ తమ వేలికి వేసిన సిరా గుర్తులు చూపుతూ ప్రజలకు దిశానిర్దేశం చేశారు. కొందరు తారలు సామాన్యులతో క్యూలో నిల్చొని ఓట్లు వేసి ఆదర్శంగా నిలిచారు. ఈ ఎన్నికల్లో నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజలు సైతం ఓటును వినియోగించుకోవాలని సామాజిక మాధ్యమాల వేదికగా కోరారు.
చిరంజీవి, రామ్ చరణ్ దంపతులు జూబ్లీహిల్స్ క్లబ్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్టీఆర్ కుటుంబం, నాగచైతన్య దంపతులు కూడా ఓటేశారు. అల్లు అర్జున్, రాఘవేంద్రరావు, రాజమౌళి, బ్రహ్మానందం, వరుణ్ తేజ్, రానా జూబ్లీహిల్స్, ఫిలింనగర్ లోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.