Bangarraju press meet: తాను నటించిన 'బంగార్రాజు' చిత్ర విడుదల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని హీరో అక్కినేని నాగార్జున అన్నారు. నాగచైతన్యతో కలిసి ఆయన నటించిన చిత్రమిది. రమ్యకృష్ణ, కృతిశెట్టి కథానాయికలు. కల్యాణ్‌కృష్ణ దర్శకుడు. ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసేందుకు చిత్ర బృందం ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
"ఆర్‌ఆర్‌ఆర్' చిత్రం వాయిదా పడటం బాధగా ఉంది. నాలుగేళ్లుగా ఆ టీమ్ ఎంత కష్టపడిందో నాకు తెలుసు. పాన్ ఇండియా చిత్రం కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో విడుదలవటం కరెక్ట్ కాదు. 'రాధేశ్యామ్' చిత్ర విషయంలోనూ అంతే. ఎన్నో ఏళ్లుగా ఆ చిత్ర బృందం శ్రమించింది. ఈ రెండు సినిమాల వాయిదా వల్ల 'బంగార్రాజు'కి కలిసొచ్చిందా అనే విషయాన్ని సినిమా విడుదల తర్వాత చూద్దాం. ఇప్పుడేం చెప్పలేను" అని అన్నారు. "సినిమా వేడుకకు సంబంధించిన వేదికపై రాజకీయ విషయాల గురించి మాట్లాడకూడదు. నేను మాట్లాడను" అని ఆంధ్రప్రదేశ్‌లోని సినిమా టికెట్ ధరల అంశానికి సమాధానమిచ్చారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టికెట్ ధరల్లో వ్యత్యాసం ఉంది కదా. మీకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుందేమో?
నాగార్జున: ఈ విషయంలో నాకెలాంటి ఇబ్బంది లేదు. టికెట్ ధరలు ఎక్కువగా ఉంటే మాకు ఎక్కువ డబ్బులొస్తాయి అంతే. నా సినిమా విడుదలకు ఇబ్బంది లేదు.
మీరు రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరాలనేది మీ అభిమానుల కోరిక. ఈ సినిమాతో అది సాధ్యపడుతుందా?
నాగార్జున: 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్ర విజయం 'బంగార్రాజు'పై భారీ అంచనాలు పెంచింది. వాటిని అందుకునేలా ఈ సినిమాను రూపొందించాం. అభిమానులు ఆశిస్తున్నట్టు ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లో నిలుస్తుందనే నమ్మకం ఉంది.