తొలి చిత్రం 'రబ్ నే బనాది జోడీ'తోనే స్టార్ హీరో షారుఖ్ సరసన అవకాశం కొట్టేసింది అనుష్క శర్మ. తర్వాత రణ్‌వీర్‌సింగ్, ఇమ్రాన్‌ఖాన్ లాంటి యువ కథానాయకుల నుంచి ఆమిర్‌ఖాన్‌లాంటి సీనియర్ల వరకు అందరితోనూ కలిసి నటించింది. అల్లరి పిల్ల, చూడచక్కని నవ్వు, చూస్తూ ఉండాలనిపించే రూపం.. అందుకే ఆ తార ర్యాంపు నుంచి ప్రేక్షకుల మనసుల్లోకి దూసుకెళ్లింది.
స్టార్ హీరోలతో అనుష్కశర్మ అనుష్క శర్మ 1988 మే 1న జన్మించింది. పుట్టి పెరిగిందంతా బెంగళూరులోనే. తండ్రి అజయ్‌కుమార్ శర్మ. సైన్యంలో అధికారి. తల్లి అషిమా శర్మ. గృహిణి. అనుష్కకు కర్ణేష్ అనే ఓ సోదరుడు ఉన్నాడు. అతడు రాష్ట్రస్థాయి క్రికెటర్. ప్రస్తుతం నౌకాదళంలో ఉద్యోగం చేస్తున్నాడు.
15 ఏళ్లకే ర్యాంపుపై వయ్యారం...
బెంగళూరులోని సైనిక పాఠశాలలో అనుష్క విద్యాభ్యాసం సాగింది. మౌంట్ కార్మెల్ కళాశాలలో ఆర్ట్స్‌లో డిగ్రీ పట్టా పుచ్చుకొంది. పాఠశాలలో చదువుతున్నప్పుడే ఫ్యాషన్ రంగంపై దృష్టిపెట్టింది. పదిహేనేళ్లకే ర్యాంప్‌పై హొయలుపోయింది. ఫ్యాషన్ డిజైనర్ వెండెల్ రాడ్రిక్స్‌తో కలిసి పలు ఉత్పత్తులకు మోడల్‌గా ప్రచారం చేసింది.
బెంగళూరు టూ ముంబయి...
బెంగళూరు నుంచి ముంబయికి మకాం మార్చాక అనుష్క శర్మకు మోడల్‌గా మరింత పేరొచ్చింది. ఏడాది కాలంలోనే నెంబర్‌వన్ మోడల్‌గా గుర్తింపు తెచ్చుకొంది. లాక్మే ఫ్యాషన్ వీక్‌లో మెరుపులు మెరిపించింది. అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైంది. అప్పుడే యశ్‌రాజ్ ఫిల్మ్స్ దృష్టిలో పడటం... వాళ్లు మూడు సినిమాలకు అనుష్కతో ఒప్పందం కుదుర్చుకోవడం చకచకా జరిగిపోయాయి. వాళ్లు నిర్మించిన ‘రబ్ నే బనాది జోడి’, ‘బద్మాష్ కంపెనీ’, ‘బ్యాండ్ బాజా బారాత్’ సూపర్హిట్లుగా నిలవడం అనుష్కకు మరింత పేరు తెచ్చింది.
కలెక్షన్ క్వీన్...
ప్రస్తుతం బాలీవుడ్‌లో వసూళ్ల కథానాయికగా పేరు తెచ్చుకుంది. ఆమిర్ ఖాన్‌తో చేసిన ‘పీకే’, సల్మాన్ ఖాన్‌తో ‘సుల్తాన్’ చిత్రాలు ఘన విజయాలు సాధించాయి. ఈ రెండు సినిమాలు రూ.500 కోట్ల మార్కును దాటేశాయి. తర్వాత ఆమె చేసిన ‘ఏ దిల్ హై ముష్కిల్’ చిత్రం రూ.200 కోట్ల వసూళ్లు సాధించింది.
నిర్మాతగా సక్సెస్...
అనుష్క నటిస్తూ, నిర్మాతగా తెరకెక్కిన ‘పిల్హౌరీ’ చిత్రం... రూ.20కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తే రూ.50కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ‘పరీ’ చిత్రంతో మరోసారి నటిగా, నిర్మాతగా ప్రతిభ నిరూపించుకుంది.
విరుష్క ప్రేమ పరిణయం...
వ్యక్తిగత విషయాలను పంచుకోవడానికి ఏమాత్రం ఇష్టపడదు అనుష్కశర్మ. తన గురించి ఎలాంటి పుకార్లు వచ్చినా వెంటనే స్పందిస్తుంటుంది. భారతీయ స్టార్ క్రికెటర్ విరాట్‌తో ప్రేమ... వివాహం వరకు వెళ్లింది. ఓ యాడ్ షూటింగ్ సందర్భంగా తొలిసారి కలుసుకున్న వీరిద్దరూ...తొలిచూపులోనే ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు సాగిన వీరి ప్రేమాయణం... 2017 డిసెంబరు 11న పెళ్లిపీటలెక్కింది.
విరాట్కోహ్లీతో ప్రేమ, పెళ్లి నచ్చేవి- నచ్చనివి...
- డ్యాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. ఖాళీ సమయాల్లో సంగీతం వినడం, బుక్స్ చదవడంలాంటివి చేస్తుంటుంది.
- 2015 నుంచి పూర్తిగా శాకాహారిగా మారిపోయింది. మోస్ట్ హాటెస్ట్ వెజిటేరియన్ సెలబ్రిటీల్లో ఈమె ఒకరు.
- అనుష్కకు ఇష్టమైన పానీయం యాపిల్ జ్యూస్.
- కేరళ అంటే చాలా ఇష్టం. అక్కడి పచ్చటి అందాలు బాగా నచ్చుతాయి. కేరళ తర్వాత లండన్ ఇష్టమైన ప్రాంతం.
- ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంది. గాయకుల్లో హరిహరన్ అంటే ఇష్టం.
- షారుఖ్‌ఖాన్, ఆమిర్‌ఖాన్ ఇష్టమైన నటులు. శ్రీదేవి, రేఖ నచ్చిన కథానాయికలు.
- ఇష్టమైన చిత్రం ‘దిల్‌వాలే దుల్హానియా లే జాయేంగే’. ఈ చిత్రాన్ని చాలాసార్లు చూసింది.
- ఎదుటివాళ్లలో నచ్చేది అమాయకత్వం, కష్టపడేతత్వం. నచ్బనివి బద్ధకంగా వ్యవహరించడం, అపరిశుభ్రంగా ఉండటం.