టాలీవుడ్లో మోస్ట్ బ్యాచిలర్ హీరోయిన్ అంటే టక్కున గుర్తొచ్చేది అనుష్క. అందం, చక్కటి ఆహార్యం, మెప్పించే అభినయంతో సినీ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. అలాంటి ఈ భామ పెళ్లిపై అందరికీ ఆసక్తి ఎక్కువే. తను హీరో ప్రభాస్‌తో డేటింగ్లో ఉన్నట్లు, ఇద్దరూ పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు ఎంతో కాలం నుంచి చక్కర్లు కొడుతున్నాయి. ప్రభాస్ మాత్రమే కాదు ఓ టీమిండియా క్రికెటర్, ప్రముఖ దర్శకుడి కుమారుడితో పెళ్లి అని అనేక వదంతులు హల్చల్ చేశాయి. ఈ వార్తలను పలుసార్లు ఖండించి అనుష్క... తాజాగా తనకు హీరో ప్రభాస్‌కు మధ్య ఉన్న బంధంపై స్పష్టత ఇచ్చింది.
"గత పదిహేనేళ్లుగా ప్రభాస్ నాకు తెలుసు. మేమిద్దరం కలిసి 2009లో తొలిసారి 'బిల్లా' చిత్రం కోసం పనిచేశాము. తర్వాత 'మిర్చి', 'బాహుబలి' సినిమాలతో వెండితెర సూపర్‌హిట్ జోడి అనిపించుకున్నాము. ఈ క్రమంలో మా మధ్య మంచి స్నేహం ఏర్పడింది. నా 3 ఏఎమ్ స్నేహితులలో అతడు ఒకడు (ఆ సమయంలోనైనా మాట్లాడగలిగేంత చనువు ఉందని అర్థం). మా ఇద్దరికీ ఇంకా పెళ్లి కాలేదు కనుక, స్క్రీన్‌పై మా జంట అద్భుతంగా ఉంటుంది. అందుకే మా మధ్య ప్రేమ ఉందని వదంతులు సృష్టించారు కొంతమంది. ఇద్దరి మధ్య ఏమైనా ఉండుంటే ఎప్పుడో చెప్పేవాళ్లం. మా ఇద్దరి వ్యక్తిత్వాలు ఒక్కటే. భావోద్వేగాల్ని దాచుకోలేం"
-అనుష్క, కథానాయిక.