ఈ మధ్య కాలంలో సోషల్‌మీడియాలో బాలీవుడ్‌కు సంబంధించిన వివాదాలు చెలరేగుతున్నాయి. తాజాగా దర్శకుడు అనుభవ్ సిన్హా హిందీ చిత్రసీమకు గుడ్‌బై చెప్పేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సమాచారాన్ని రాసిన ఓ వెబ్సైట్... 'తప్పాడ్' డైరెక్టర్ అంటూ ప్రస్తావించడంపై అనుభవ్ విచారం వ్యక్తం చేశారు. ఆ సినిమా డైరెక్టర్‌గా తప్ప తనకంటూ గుర్తింపు లేదా అని సోషల్‌మీడియాలో వాపోయారు.
'బాలీవుడ్‌ను వదిలేస్తున్నా.. ఎవరేమనుకున్నా పర్లేదు' - బాలీవుడ్‌కు రాజీనామా చేస్తున్న దర్శకుడు అనుభవ్ సిన్హా
బాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు ప్రముఖ దర్శకుడు అనుభవ్ సిన్హా. తాజాగా ఈ విషయాన్ని తన సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. అంతేకాకుండా తనపై ఓ వెబ్ పోర్టల్ రాసిన వార్తపైనా అసహనం వ్యక్తం చేశారు. తనను 'తప్పాడ్' సినిమా దర్శకుడిగా కాకుండా మరే విధంగా గుర్తించడం లేదని విచారాన్ని వ్యక్తం చేశారు.
'ముల్క్', 'ఆర్టికల్ 15', 'తప్పాడ్' చిత్రాలను తెరకెక్కించి బాలీవుడ్లో మంచి గుర్తింపు దక్కించుకున్నారు అనుభవ్ సిన్హా. సోషల్‌మీడియాలో సూటిగా తన అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తారు. ఇటీవలె తాను బాలీవుడ్‌ను విడిచిపెడుతున్నట్లు సోషల్‌మీడియాలో తెలిపారు. "చాలు.. నేను బాలీవుడ్‌కు రాజీనామా చేస్తున్నాను. ఎవ్వరు ఏమనుకున్నా పర్వాలేదు" అని ట్వీట్ చేశారు అనుభవ్ సిన్హా. అతని ట్విట్టర్ ఖాతా పేరును 'అనుభవ్ సిన్హా' నుంచి 'అనుభవ్ సిన్హా (నాట్ బాలీవుడ్)' అని మార్చుకున్నారు.
'తప్పాడ్' దర్శకుడు అనుభవ్ సిన్హా బాలీవుడ్‌కు రాజీనామా చేస్తున్నారనే ఓ వెబ్‌పోర్టల్ రాసిన వార్తను తాజాగా షేర్ చేశారు. దీనిపై స్పందిస్తూ.. "నాకు హెడ్లైన్ తెలుసు. తాప్సీ నటించిన 'తప్పాడ్' దర్శకుడిగానే తప్ప మీకింకో విధంగా ప్రస్తావించడం తెలియదా?" అని సోషల్‌మీడియాలో ప్రశ్నించాడు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. అనుభవ్‌ను బాలీవుడ్ వెలుపల నుంచైనా సినిమాలు తీయమని కోరుతున్నారు.