తెలంగాణ

telangana

ETV Bharat / sitara

థియేటర్లు మూసేస్తాం.. షరతులు వద్దు! - theatres reopening in telugu states

తెలుగు సినీ పరిశ్రమ మరో కొత్త వివాదంలో చిక్కుకుంది. సినిమా థియేటర్ల నిర్వహణ విషయంలో 60 శాతం వాటాలు కావాలని నిర్మాతలు పట్టుబడుతుండగా.. షరతులతో వ్యాపారం చేయలేమని థియేటర్ల యజమాన్య సంఘాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో క్రిస్మస్​, సంక్రాంతికి విడుదల కావల్సిన సినిమాల పరిస్థితి సందిగ్ధంలో పడింది. నిర్మాతలు సినిమాలు ఇవ్వకపోతే థియేటర్లు శాశ్వతంగా మూసివేసి వాణిజ్య కేంద్రాలుగా మార్చుకుంటామని యజమానులు హెచ్చరిస్తున్నారు.

an issue between tollywood producer and theatre owners
థియేటర్లు మూసేస్తాం.. షరతులు వద్దు!

By

Published : Dec 14, 2020, 5:45 PM IST

Updated : Dec 14, 2020, 6:51 PM IST

కరోనా వైరస్.. టాలీవుడ్​ను గందరగోళంలోకి తోసేసింది. 9 నెలలుగా సినీ పరిశ్రమ స్తంభించడం వల్ల వేలాది మంది సినీ కార్మికులు ఉపాధికి దూరమయ్యారు. థియేటర్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. దీంతో ఇండస్ట్రీకి కోట్లలో నష్టం వచ్చింది. కోలుకోవాలంటే కనీసం మూడేళ్లు పట్టొచ్చని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ చొరవతో పరిశ్రమ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించిన దర్శక నిర్మాతలు.. 2021పైనే ఆశలు పెట్టుకున్నారు. వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుడ్ని థియేటర్​కు రప్పించడానికి సన్నాహాలు మొదలుపెట్టారు.

థియేటర్ యజమానులు vs నిర్మాతలు

థియేటర్లకు నోటీసులు

కానీ థియేటర్లు తిరిగి తెరిచే విషయంలో నిర్మాతలు, యజమానులకు మధ్య కొత్త వివాదం మొదలైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు 50 శాతం ప్రేక్షకులతోనే ప్రదర్శనలు నిర్వహిస్తే తీవ్రంగా నష్టపోతామని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో థియేటర్ల నిర్వహణపై నిర్మాతల మండలి షరతులు పెడుతూ అన్ని మల్టీఫ్లెక్స్ లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లకు నోటీసులు జారీ చేసింది.

తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్లలో నిర్మాతల ఎంపిక ప్రకారమే టికెట్ ధరలు ఉండాలని, సాయంత్రం 4 గంటలు, 7 గంటలు, రాత్రి 10 గంటలకు తప్పనిసరిగా చిన్న సినిమాలను ప్రదర్శించాలని నిబంధనలు పెట్టారు. అలాగే థియేటర్ల నిర్వహణ ఛార్జీలను నిర్మాతలకు విధించవద్దని, ఆన్​లైన్ టికెట్ బుకింగ్​పై వచ్చే ఆదాయంతో పాటు ప్రదర్శన మొత్తంపై 60 శాతం వాటా ఇకపై నిరంతరం నిర్మాతలకు చెల్లించాలని కోరారు. తమిళనాడు తరహాలో థియేటర్లన్నీ తెలుగు సినిమాలను 60 శాతం, ఇతర భాషా చిత్రాలను 40 శాతం మాత్రమే ప్రదర్శించాలని సూచించారు. ఇలా మొత్తం 11 నిబంధనలు పేర్కొంటూ అన్ని మల్టీప్లెక్స్, సింగిల్ థియేటర్లకు నోటీసులు జారీ చేశారు.

ఓటీటీ మధ్య థియేటర్​కు మధ్య తీవ్రమైన పోటీ

థియేటర్ల వ్యతిరేకత

నిర్మాతల మండలి నిర్ణయాన్ని మల్టీఫ్లెక్స్ యజమానులు, సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు వ్యతిరేకిస్తున్నారు. థియేటర్ల ఆదాయంలో 60 శాతం వాటా కావాలని కోరడం సమంజసం కాదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాతలు పెట్టిన నిబంధనలు పాటించడం తమ వల్ల కాదని ఖరాఖండిగా చెబుతున్నారు. అవసరమైతే థియేటర్లు పూర్తిగా మూసేసి వాణిజ్య సముదాయాలుగా మార్చుకుంటామని హెచ్చరిస్తున్నారు. కరోనా కారణంగా ఇప్పటికే కోట్లలో నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తోన్న మల్టీఫ్లెక్స్ యజమానులు.. నిర్మాతలు పెట్టిన షరతులు సినీ పరిశ్రమకు మరింత నష్టాన్ని చేకూరుస్తాయని పేర్కొంటున్నారు. ఇప్పటికే నగరంలో 15 నుంచి 20 థియేటర్లు మూతపడగా.. ఇప్పుడు నిర్మాతల నిర్ణయం వల్ల వచ్చే మూడు నెలల్లో 100 థియేటర్లకుపైగా మూతపడతాయని యజమానులు వాపోతున్నారు.

బీవీకే మల్టీఫ్లెక్స్ యజమాని

కొత్త సినిమాల విడుదలపై సందిగ్ధత

ఈ విషయంలో నిర్మాతల మండలి.. మల్టీఫ్లెక్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరుగుతున్నాయి. వర్చువల్ ప్రింట్ ఫీజుతోపాటు ఆదాయంలో వాటాల విషయంలో యజమానులు దిగిరాకపోవడం వల్ల నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ మాట వినకపోతే కొత్త సినిమాలను విడుదల చేయమని తెగేసి చెబుతున్నట్లుగా సమాచారం. దీంతో అటు నిర్మాతలు, థియేటర్ యజమానుల మధ్య నెలకొన్న వివాదం సినీ పరిశ్రమను మరోసారి గందరగోళంలో పడేసింది. ఈ క్రిస్మస్ పండగతోపాటు వచ్చే సంక్రాంతికి విడుదల కావల్సిన సినిమాలపై సందిగ్ధత నెలకొంది.


నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్

ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు డిసెంబర్ 4న పలు మల్టీఫ్లెక్స్​లు, సింగిల్ థియేటర్లను తెరిచారు. మొదటి వారం ప్రేక్షకుల రాక పెద్దగా లేకపోవడం వల్ల మల్టీఫ్లెక్స్​లు తిరిగి తలుపులు మూసుకున్నాయి. కొన్ని సింగిల్ థియేటర్లు మాత్రం ప్రదర్శనలు కొనసాగిస్తున్నాయి. ఓటీటీలకు అలవాటుపడిన ప్రేక్షకుడ్ని థియేటర్​కు రప్పించాలంటే పెద్ద సినిమాల రాకే శరణ్యమంటోన్న థియేటర్ యజమాన్యాలు.. పాత పద్ధతిలోనే సినిమాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని 50 శాతం ప్రేక్షకులతో నడిచిన రోజులన్నింటికి జీఎస్టీ రద్దు చేయాలని, విద్యుత్ ఛార్జీల నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

Last Updated : Dec 14, 2020, 6:51 PM IST

ABOUT THE AUTHOR

...view details