'అల్లరి', 'కితకితలు', 'అహనా పెళ్లంట' వంటి హాస్య ప్రధాన చిత్రాలతో పాటు 'గమ్యం', 'శంభో శివ శంభో', 'నేను' వంటి సినిమాల్లో అద్భుత నటనతో మెప్పించిన నటుడు అల్లరి నరేశ్. ఈ హీరో సినీ పరిశ్రమలోకి వచ్చి నేటికి 17 ఏళ్లు. ఈ సందర్భంగా అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్విట్టర్లో ఓ పోస్ట్ షేర్ చేశాడు.
'అల్లరి' రవి నుంచి 'మహర్షి' రవి వరకు.... - allari naresh
టాలీవుడ్ నటుడు అల్లరి నరేశ్ సినీ అరంగేట్రం చేసి నేటికి 17 ఏళ్లు. ఈ సందర్భంగా ఓ సందేశాన్ని పోస్ట్ చేశాడీ హీరో.
"సినీ పరిశ్రమలో అడుగుపెడతానని అనుకోలేదు. మొండి పట్టుదలతో అవకాశం సాధించా. 2002 మే 10న 'అల్లరి' సినిమా నాకు మరో జన్మనిచ్చింది. సన్నగా, పొడవుగా, ఇబ్బందికరంగా, ఎన్నెన్నో కలలతో కూడిన నాలాంటి వ్యక్తికి అవకాశం ఇచ్చినందుకు చిత్ర యూనిట్‌కు ధన్యవాదాలు. 'అల్లరి' సినిమాలో రవి నుంచి 'మహర్షి'లో రవి పాత్ర వరకు నేను చేసిన 55 సినిమాలు జీవితంలో మర్చిపోలేనివి. 17 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నాతో కలిసి పనిచేసిన దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులతో పాటు అన్ని వేళలా ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు." --అల్లరి నరేశ్ పోస్ట్ సారాంశం
తాజాగా 'మహర్షి'లో రవి పాత్రలో కనిపించాడు అల్లరి నరేశ్. మరోసారి తన నటన కౌశల్యంతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు.