తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రేలంగి విజిలేస్తే రౌడీలు వచ్చేవారట!

ఎన్నో మంచి సినిమాలు తీసి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ రేలంగి నరసింహారావు.. ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' షోలో సందడి చేశారు. తన పాత జ్ఞాపకాలను ఆద్యంతం నవ్వుతూ వెల్లడించారు.

relangi
రేలంగి

By

Published : Aug 12, 2021, 2:32 PM IST

హాస్య చిత్ర ప్రపంచంలో ఆయనో చక్రవర్తి.. నవ్వులతో నలు దిశలా వ్యాపించింది ఆయన కీర్తి.. వినూత్న కథలతో వినోదాన్ని పండించాలన్నా, విలక్షణ పాత్రలతో కథలను రక్తికట్టించాలన్నా ఆయనకే సాధ్యం. పలు భాషల్లో 75 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించిన క్లాసిక్‌ కామెడీ డైరెక్టర్‌ రేలంగి నరిసింహారావు. అలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సరదా సంగతులు చెప్పారు.

మీ ఇంటి పేరు చెప్పగానే మహానటుడు రేలంగి వెంకట్రామయ్య గుర్తొస్తారు! ఆయనకు మీకూ సంబంధం ఏంటి?

రేలంగి నరసింహారావు: మా ఇంటి పేరు రేలంగి అవ్వడం, నేను ఆయనకు దూరపు బంధువును కావటం నా అదృష్టం. మా నాన్నకు ఆయన వరుసకు పెదనాన్న అవుతారు. సినిమాల్లోకి వెళ్లకముందు నేనెప్పుడూ రేలంగిగారిని నేరుగా చూడలేదు. నేను సినిమా పరిశ్రమలో నేను బి.ఎల్‌.వి. ప్రసాద్‌గారు, కేఎస్‌ఆర్‌ దాస్‌గారి దగ్గర పనిచేసేవాడిని. ఆ తర్వాత గురువుగారు దాసరి నారాయణరావు ఎక్కువ సినిమాలు చేశా. 'రాధమ్మ పెళ్లి' చేస్తున్నప్పుడు అందులో రేలంగిగారు ఉన్నారు. అప్పటికి ఆయన ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నారు. కేవలం సోఫాలో కూర్చొని డైలాగ్‌లు చెప్పేవారు. నేను ఆయనను చూడటం అదే తొలిసారి. నన్ను పిలిచి 'నీ పేరు ఏంటయ్యా' అని అడిగారు. 'రేలంగి నరసింహారావు' అన్నాను. 'రేలంగి వద్దు. ఇక నుంచి నువ్వు ఉత్త నరసింహారావు’ అన్నారు. 'అదేంటి సర్‌. మా పూర్వీకుల నుంచి రేలంగి మా ఇంటి పేరుగా ఉంటోంది. దాన్ని పెట్టుకోవద్దని అంటారేంటి’ అన్నాను. 'ఏమీ లేదయ్యా..! సెట్‌లో మీ గురువు 'రేలంగి' అని పిలుస్తూ నన్ను తిడుతున్నాడో.. నిన్ను తిడుతున్నాడో తెలియదయ్యా. అందుకే రేలంగి అని పెట్టుకోవద్దు' అని అన్నారు. అలా సరదాగా మాట్లాడేవారు.

రాజేంద్రప్రసాద్‌, చంద్రమోహన్‌లతో ఎన్ని సినిమాలు చేశారు?

రేలంగి నరసింహారావు: రాజేంద్రప్రసాద్‌తో 32, చంద్రమోహన్‌తో 24 సినిమాలు చేశా. అగ్ర నటులు నాగేశ్వరరావు, కృష్ణంరాజు, శోభన్‌బాబుగార్లతో ఒక్కో సినిమా చేశా. మధ్యలో బ్రహ్మానందం, అలీ, బాబూమోహన్ నటించిన చిత్రాలకూ దర్శకత్వం వహించాను. సుమన్‌ను 'ఇద్దరు కిలాడీలు' చిత్రంతో వెండితెరకు పరిచయం చేసింది మేమే. ఆ చిత్రానికి తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాత. జయసుధతో 'జీవనజ్యోతి', రేవతి తొలి చిత్రం 'మానస వీణ', సుహాసినితో 'శిక్ష' ఇలా మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాలకూ దర్శకత్వం వహించా.

మీకు స్ల్పిట్‌ ఏసీ అంటే ఇష్టమా? విండో ఏసీ అంటే ఇష్టమా?

రేలంగి నరసింహారావు: (నవ్వులు). అదా..! అద్దె ఇంట్లో ఉంటున్నప్పుడు ఒక ప్రొడ్యూసర్‌ నన్ను బుక్‌ చేశారు. ఆయన సినిమాకు పనిచేస్తున్న హీరో, డైరెక్టర్‌ను కాకాపడితే సినిమా బాగా తీస్తారని ఒక అపోహ. నేను ఒక రోజు స్నానం చేద్దామని బాత్రూమ్‌కు వెళ్లాను. ఇంతలో 'డైరెక్టర్‌గారూ' అంటూ పెద్ద కేక వినిపించింది. గబగబా బయటకు వచ్చాను. 'డైరెక్టర్‌గారూ మీకు ఏసీ లేదా' అని అడిగారు. 'లేదు' అని చెప్పాను. ‘అయ్య బాబోయ్‌. మీరు క్రియేటర్లు. ఆలోచనలతో బుర్ర అంతా వేడెక్కిపోతుంది. ఏసీ లేకపోతే ఎలా’ అంటూ తన సహాయకుడిని పిలిచి ఏసీ కొని తీసుకురమ్మన్నారు. నేను వద్దని వారించా! అయినా ఆయన ఊరుకోలేదు. ఇంటి ఓనర్‌కు చెప్పి, గోడకు రంధ్రం చేసే వ్యక్తిని పిలిపించి, ఆ పని కూడా పూర్తి చేశారు. మళ్లీ వస్తానని చెప్పి, వెళ్లిన వ్యక్తి రాత్రి అయినా కూడా రాలేదు. దీంతో ఆ రంధ్రం నుంచి ఏ దొంగ ఇంట్లోకి వస్తాడోనని భయంతో బీరువా అడ్డం పెట్టి, నేను, నా భార్యాపిల్లలు అక్కడే పడుకున్నాం. ఉదయమైనా ఆయన రాలేదు. ఇంట్లో వాళ్లకు చెప్పి, వెంకన్నబాబుగారి ఆఫీస్‌కు వెళ్లి పోయా. అక్కడ కథా చర్చలు జరగుతున్నాయి. విషయం వెంకన్నబాబుగారి చెప్పా. 'ఆయనొక తలతిక్క ప్రొడ్యూసర్‌. ఆయన్ను నమ్మి గోడకు రంధ్రం ఎలా చేశారు' అని వెంకన్నబాబుగారు తలకొట్టుకున్నారు. సాయంత్రం ఇంటికి వచ్చే సరికి ఏసీ బిగిస్తున్నారు. మా ఆవిడ దగ్గరకు వెళ్లి, 'అనవసరంగా ఆ నిర్మాతను తిట్టుకున్నా. ఎట్టకేలకు ఏసీ బిగిస్తున్నారన్నమాట' అని ఏదో చెప్పబోయాను. 'మీరు ఒకరు ఊరుకోండి. వెంకన్నబాబుగారు ఏసీ పంపారు' అని చెప్పే సరికి నేను ఆశ్చర్యపోయా. ఆ మరుసటి రోజు మళ్లీ ఆ ప్రొడ్యూసర్‌ వచ్చాడు. 'ఏంటి నరసింహారావుగారు ఏసీ బిగించారు. నిన్న షాపులో మంచివి లేవట. ఈరోజు తీసుకుని మీ దగ్గరకే బయలుదేరాను. ఇంతలో ఏసీ బిగించి ఉండటం చూసి, ఏసీ వద్దని మావాళ్లకు చెప్పాను' అంటూ ఇంటిలోపలికి వచ్చాడు. సర్లే ఇద్దరం ఇంట్లో కాఫీ తాగుంటే, మా పనిమనిషి బట్టలు తీసుకుని వెళ్తోంది. ఆమెను తదేకంగా చూస్తున్నాడు. 'డైరెక్టర్‌గారూ మన ఇంట్లో వాషింగ్‌ మెషీన్‌ లేదా' అన్నాడు. అంతే కాఫీ కప్పు అక్కడ పెట్టి, నాకు ఏమీ వద్దు మహాప్రభో అంటూ ఆయన కాళ్ల మీద పడ్డాను.(నవ్వులు) ఈ క్యారెక్టర్‌ను పెట్టి సినిమా తీయమని బ్రహ్మానందంగారు పదే పదే అడిగేవారు.

రేలంగి

మీ తండ్రి ఆయనకులాగానే మిమ్మల్ని కూడా డాక్టర్‌ చేయాలనుకున్నారట!

రేలంగి నరసింహారావు:అవును! పీయూసీలో 86శాతం మార్కులు వచ్చాయి. ఎంబీబీఎస్‌ సీటు వచ్చేస్తుందని అనుకున్నా. అయితే అదే ఏడాది ప్రభుత్వం ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ తీసుకొచ్చింది. దీంతో నిరుత్సాహం వచ్చింది. ఎలాగో చదివి ఆ పరీక్ష రాస్తే 83శాతం మార్కులు వచ్చాయి. నాకంటే బాగా రాసిన వాళ్లు చాలా మంది ఉన్నారు. దాంతో నాకు సీటు రాలేదు. ఇక చదవనని పుస్తకాలు పక్కన పడేశా. కనీసం డిగ్రీ అయినా పూర్తి చేయమని కోరితే, నా తండ్రి కోరిక మేరకు డిగ్రీ చదివా.

మీరు చదువుతున్నప్పుడు ఓ స్నేహితుడితో గొడవపడ్డారట. ఇంతకీ ఎవరా స్నేహితుడు?

రేలంగి నరసింహారావు: ఆ స్నేహితుడు ఎవరో కాదు. కోడి రామకృష్ణ. మేమిద్దరం మంచి స్నేహితులం. చదువుకునేటప్పుడు నలుగురం స్నేహితులం ఒక గదిలో ఉండేవాళ్లం. యూత్‌ కాంగ్రెస్‌ స్టూడెంట్ అసోసియేషన్‌కు కోడిరామకృష్ణ ప్రెసిడెంట్‌గా ఉండేవాడు. అది మూలన పడిపోయింది. దాన్ని బాగుచేయాలన్న ఉద్దేశంతో విరాళాలు సేకరించాం. అయితే, కొందరు స్నేహితులు వచ్చిన విరాళాలను ఖర్చు చేయడం మొదలు పెట్టారు. ఇదే విషయంలో నాకూ రామకృష్ణకు గొడవ జరిగింది. దాంతో అప్పటి నుంచి అతనితో మాట్లాడటం మానేశా. కోడిరామకృష్ణకు సినిమాల్లోకి వెళ్లడం ఇష్టం. నేనేమో డాక్టర్‌ అవ్వాలని అనుకునేవాడిని. ఆ గొడవ కారణంగా అలా నాలుగైదేళ్లు మాట్లాడుకోలేదు. ఆ తర్వాత నేను అనుకోకుండా సినిమా ఫీల్డ్‌కు వచ్చాను. ఊరంతా ఈ విషయం తెలిసింది. కానీ, రామకృష్ణకు ఈ విషయం చెప్పలేదు. దీంతో అతను బాధపడ్డాడు. నాకూ కూడా కాస్త ఇబ్బందికరంగా అనిపించింది. మద్రాసు వెళ్లే ముందు విషయం చెబుతామని కోడి రామకృష్ణ ఇంటికి వెళ్లా. విషయం చెబితే చాలా సంతోషపడ్డాడు.

కోడి రామకృష్ణ

మీరిద్దరిలో ఎవరికి మొదట దర్శకత్వం చేసే అవకాశం వచ్చింది?

రేలంగి నరసింహారావు: నేనే మొదట దర్శకుడినయ్యా. 1980లో ‘చందమామ’ అనే చిత్రానికి దర్శకత్వం వహించా. మురళీమోహన్‌, మోహన్‌బాబులు నటించారు.

ఈ సినిమా జరిగేటప్పుడు ఫటాఫట్‌ జయలక్ష్మికి, మీకూ ఏదో జరిగిందట!

రేలంగి నరసింహారావు: ఏదో జరిగిందంటే ప్రేక్షకులు అపార్థం చేసుకుంటారు. ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తయింది. క్లైమాక్స్‌ కూడా పూర్తి చేశాం. రెండో షెడ్యూల్‌ మొదటి రోజు సెట్‌కు వచ్చి, అందరం టిఫిన్‌ చేస్తున్నాం. జయలక్ష్మి వచ్చారు.‘ఏవండీ.. రషెస్‌ చూశారట కదా! ఎలా ఉంది’ అని అడిగారు. ‘చాలా బాగుందమ్మా. మీరు కూడా బాగా నటించారు. మీ నటనకు కన్నీళ్లు వచ్చాయి’ అని చెప్పాను. ఆ పక్కనే కోదండరామిరెడ్డి మేనల్లుడు సుధాకర్‌రెడ్డి అందుకుని ‘మీ నటన చూసి తెలుగు రాని నిర్మాత కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు’ అని అనడంతో అందరూ నవ్వారు. అది జరిగింది. అంతకుమించి ఏమీలేదు.

మీరు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు క్లాప్‌బోర్డు కిందపెడితే ఆ సినిమా డైరెక్టర్‌ వచ్చి, మిమ్మల్ని కొట్టారట!

రేలంగి నరసింహారావు: కేఎస్‌ఆర్‌ దాస్‌ గారు. ‘ఊరికి ఉపకారి’ సినిమా చేస్తున్నాం. ఆయన ఒక సీన్‌ తర్వాత ఒకటి వెంటవెంటనే తీస్తారు. నేను కూడా అంతే జాగ్రత్తగా ఉండేవాడిని. ఒక సీన్‌ అయిపోయిన తర్వాత క్లాప్‌బోర్డు కింద పెట్టి చేతిలో ఉన్న ఎడిటింగ్‌ పేపర్‌పై సీన్‌ రాసుకుంటూ ఉన్నా. నా ఎదురుగా రెండు కాళ్లు వచ్చి ఆగాయి. పైకి చూస్తే గురువుగారు, ‘పైకి లేరా’ అని లాగి పెట్టి ఒకటి కొట్టారు. ‘క్లాప్‌ బోర్డు కింద పెడతావా? దాని విలువ తెలుసా? నీకు. అది మనకు సరస్వతితో సమానం. నిర్మాతకు లక్ష్మీ దేవితో సమానం. జాగ్రత్త’ అని అన్నారు. అప్పుడే క్లాప్‌బోర్డు ప్రాముఖ్యత తెలిసింది. ఇప్పుడున్న డిజిటల్‌ టెక్నాలజీలో క్లాప్‌బోర్డ్‌తో పనిలేదు. కానీ, ఇప్పటికీ పూజా కార్యక్రమంలో క్లాప్‌బోర్డును పెడతాం. దాన్ని ఫైల్స్‌తో పాటు, డైరెక్టర్‌కు ఇస్తాం!

ఒక హీరో సినిమా చేస్తున్నప్పునడు మీరు మధ్యలోనే తప్పుకొన్నారట కారణం!

రేలంగి నరసింహారావు: అది మూడునాళ్ల ముచ్చట. సినిమా పేరు 'పెళ్లి చేసి చూపిస్తా'. చలం హీరో. ఆయన సూపర్‌హిట్లు తీశారు. ఆ తర్వాత డౌన్‌ఫాల్‌ మొదలైంది. 'మన్నళ్‌కైర్‌' రీమేక్‌ చేయాలనుకున్నారు. కామెడీ సినిమా అది. అందుకే నన్ను దర్శకుడిగా అనుకున్నారు. కథను తెలుగు నేటివిటీకి అనుగుణంగా చలం, రాజశ్రీగారు మార్పు చేయడం మొదలు పెట్టారు. మరోవైపు మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ జరుగుతున్నాయి. దేనికీ నన్ను పిలవటం లేదు. మానసికంగా నాకు అదోలా అనిపించింది. తెల్లవారితే షూటింగ్‌ అనగా, 'ఏవండీ.. రేపు మనం ఈ సీన్స్‌ చేస్తున్నాం' అని అన్నారు. ఏ సీన్స్‌ చేస్తున్నామనే విషయాన్ని నన్ను అడగాల్సింది పోయి, ఆయనే చెప్పడం మొదలు పెట్టారు. ‘పొద్దున్నే 5గంటలకు కారు వస్తుంది. ఎడిటింగ్‌ రూమ్‌కు వెళ్లి షాట్‌ డివిజన్‌ చేసుకోండి’ అన్నారు. 'షాట్‌ డివిజన్‌ ఎందుకండీ. మనకు కావాల్సినట్టు తీసుకోవచ్చు కదా' అన్నాను. 'నేను చెప్పింది చేయండి' అని గట్టిగా అన్నారు. మొదట నా దగ్గరకు వచ్చినప్పుడు ఉన్న స్వరానికీ ఇప్పటికీ చాలా తేడా వచ్చింది. అయినా నేను ఓపిక పట్టాను. మరుసటి రోజు సెట్‌కు వెళ్లే సరికి, సినిమాలో నటించే వారందరికీ ఆయన సీన్లు వివరిస్తున్నారు. ఆ తర్వాత నా దగ్గరకు వచ్చి, నేను క్లాప్‌ ఎప్పుడు చెప్పాలి? యాక్షన్‌ ఎప్పుడు చెప్పాలి? ఎక్కడ కట్‌ చెప్పాలి? అనే విషయాలు కూడా ఆయన చెప్పేస్తున్నారు. నా మైండ్‌ బ్లాంక్‌ అయిపోయింది. ఇలా మూడు రోజులు చేశారు. మూడు రోజు ‘చలంగారూ సాయంత్రం మనం భరద్వాజ, సారథి గారిని కలుద్దాం’ అని అన్నాను. అయితే, ఆ మీటింగ్‌కు వాళ్లిద్దరూ రాలేదు. చలంగారు వచ్చారు. ‘సర్‌ నా పాలసీ ఒకటే. మీరు కథా చర్చల్లో ఎంతైనా పాలుపంచుకోవచ్చు. కానీ, సెట్స్‌పైకి వచ్చిన తర్వాత మీరు కలగజేసుకోకూడదు. నేను ఎలా తీస్తే, అలా తీయాల్సిందే. ఎందుకంటే నా లైఫ్‌ నాకు తెలుసు’ అన్నాను. ‘నా బ్యానర్‌లో అలా కాదు. ఏ డైరెక్టర్‌ వచ్చినా, స్టార్ట్‌, కట్‌ మాత్రమే చెప్పాలి. మీకు తెలిసి వచ్చారని అనుకున్నా’ అని చలం అన్నారు. ‘సారీ నా వల్ల కాదు. నేను చేయలేను. కొన్ని కారణాల వల్ల సినిమా నుంచి తప్పుకొంటున్నా’ అని చెప్పి లెటర్‌ రాసి ఇచ్చాను.

మీరు విజిలేస్తే రౌడీలు వచ్చేవారట!

రేలంగి నరసింహారావు:నా మొదటి సినిమా 'చందమామ' దర్శకత్వం వహించేటప్పుడు ఇల్లు మారదామనుకున్నా. నేను అద్దెకుండే వీధిలోనే మరొక చోట ఇల్లు అద్దెకు ఇవ్వబడును అని ఉంటే అక్కడకు వెళ్లా. ఆ ఇంటి యజమాని బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి అని నాకు తెలియదు. వెళ్లాక ఆయన ఇల్లు చూపించారు. అప్పటికే ఉన్న వాళ్లు ఒక వారంలో ఖాళీ చేస్తారని నాతో చెప్పాడు. నాకు కూడా నచ్చింది. అయితే నెలకు రూ.750 అద్దె, మూడు నెలల అడ్వాన్స్‌ ఇవ్వమన్నాడు. నేను అంత ఇచ్చుకోలేనని చెప్పా. అయితే, రూ.600 అద్దె, 5 నెలల అడ్వాన్స్‌ అడిగాడు. అడ్వాన్స్‌ ఎలాగూ తిరిగి వస్తుందన్న ఉద్దేశంతో ఇచ్చేశాను. ఆ తర్వాత సాయంత్రం పాండీ బజార్‌కు వెళ్తే, ఇలా ఇల్లు మారుతున్నట్లు తెలిసిన వాళ్లతో అన్నాను. ‘ఆయన ఇంటికి ఎందుకు వెళ్లారండీ. ఆయన మీకు ఇల్లు అద్దెకు ఇవ్వడు. డబ్బులు తీసుకుని, మిమ్మల్ని బెదిరిస్తాడు’ అన్నారు. దాంతో భయంవేసి, ఆయన దగ్గరకు వెళ్లి ‘ఇల్లు అద్దెకు వద్దు. అడ్వాన్స్‌ తిరిగి ఇచ్చేయండి’ అని చెప్పా. అందుకు ఆయన ఒప్పుకోలేదు. దీంతో విషయం మా నిర్మాత చెరియన్‌గారికి చెబితే ఆయన మాంబళం పోలీస్‌స్టేషన్‌ ఎస్సైకి ఫోన్ చేసి, విషయం చెప్పారు. ఆ తర్వాత ఎస్సై దగ్గరికి వెళ్తే, ‘వాడి ఇంటికి ఎందుకు వెళ్లారండీ. మా బాస్‌లకు కూడా వాడు బాగా పరిచయం. మా తరపు నుంచి నేను ఏమీ చేయలేను. అయితే, ఒక సలహా ఇస్తా. మీ షూటింగ్స్‌లో రౌడీలుగా పనిచేసేవాళ్లు ఉంటారు కదా. వాళ్లను తీసుకెళ్లి బెదిరించి డబ్బులు తీసుకోండి. ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటా’ అని అన్నారు. అలా నాకు తెలిసిన వాళ్లను, మా నిర్మాత ఇచ్చిన వ్యానులో ఎక్కించుకుని ఆయన ఇంటికి వెళ్లా. ‘నేను విజిల్‌ వేయగానే మీరు రావాలి’ అని నాతో పాటు వచ్చిన వాళ్లకు చెప్పా. మొదట నేను ఒక్కడినే ఆయన ఇంటిలోకి వెళ్లా. ‘మళ్లీ వచ్చావేంటి? డబ్బులు ఇవ్వనని చెప్పానుగా’ అని గట్టిగా మాట్లాడాడు. దీంతో ‘మీరు డబ్బులు ఇవ్వకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అంటూ విజిల్‌ వేసే సరికి నలుగురైదుగురు ఇంట్లోకి వచ్చి తలుపులు, కిటికీలు మూసేసి, కత్తి తీశారు. వాడు భయంతో వణికిపోయాడు. ఎవరికో ఫోన్‌ చేయబోతే దాన్ని కట్‌ చేశారు. ‘డబ్బులు ఇవ్వకపోతే చస్తావు’ అని బెదిరించడంతో ఎట్టకేలకు డబ్బులు ఇచ్చాడు.

దాసరితో

దాసరి నారాయణరావుతో మీ జర్నీ ఎలా సాగేది?

రేలంగి నరసింహారావు: తల్లిదండ్రుల తర్వాత నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తి ఆయనే. నాకు లైఫ్‌ ఇచ్చిన వ్యక్తి. నేను 75 సినిమాలు చేశానంటే ఆయనే కారణం. ‘చందమామ’ అవకాశం ఇచ్చింది గురువుగారే. మొదటి కాపీ వచ్చిన తర్వాత సినిమా ఆగిపోయింది. నేను ఎక్కడ నిరాశలోకి వెళ్లిపోతానోనని ఆయన వెంటే ఉండమనేవారు. వేరే సినిమాలకు అవకాశం ఇచ్చేవారు. అసలు ఖాళీ లేకుండా చూసేవారు. మధ్యలో కొన్నాళ్లు గ్యాప్‌ వచ్చింది. తరచూ ఆయన ఆఫీస్‌కు వెళ్తుంటే, ‘ఏమయ్యా నరసింహారావు సినిమాలు ఏమీ లేవా’ అని అడిగారు. ‘మూడు సినిమాలు విడుదల కావాల్సి ఉంది’ అని చెప్పాను. ‘మనిషి ఖాళీగా ఉండకూడదయ్యా’ అన్నారు. మరుసటి రోజు శుభలేఖ సుధాకర్‌ హీరోగా ‘ప్రేమకు పది సూత్రాలు’ అనే సినిమాను ఆయన బ్యానర్‌లో స్టార్ట్‌ చేసి, నన్ను డైరెక్ట్‌ చేయమన్నారు. ఆ తర్వాత నేను మళ్లీ ఎప్పుడూ ఖాళీగా లేను.

అంత అనుబంధం ఉన్న మీరు ఆయనతో ఒక మాట అంటే దాసరి దిగులుపడిపోయారట!

రేలంగి నరసింహారావు: ఆయన చాలా సినిమాలు తీస్తుండేవారు. దీంతో నాలుగైదు బ్యాచ్‌లు ఉండేవి. ఒక్కొక్కళ్లు ఒక్కో పని చేసుకునేవాళ్లు. ఒకసారి నేను ఉండే బ్యాచ్‌కు కాకుండా వేరే వాళ్లకు పని చెప్పారు. దీంతో నాకు కోపం వచ్చింది. ‘కాకా పట్టేవాళ్లందరినీ ఈయన ముందు పెడుతున్నారు’ అని తెలియని అజ్ఞానంతో అనుకున్నా. ఇదే విషయాన్ని ఆయనకు చెబుదామని వారం రోజులు తిరిగా. కానీ, ధైర్యం చాలలేదు. ఒకరోజు మధ్యాహ్నం ఎవరూలేని సమయం చూసి, ఆయన దగ్గరకు వెళ్లి, కాళ్లకు నమస్కారం పెట్టి, 'ఎక్కడ ఉన్నా నేను మీ శిష్యుడినే. మీరు పేరు నిలబెడతా. వస్తాను సర్‌' అని చెప్పాను. అప్పుడు నా కన్నీళ్లు ఆయన పాదాలపై పడ్డాయి. అది నేను చూసుకోలేదు. ఇంటికి వచ్చి, మంచంపై పడుకున్నా. కొద్దిసేపటి తర్వాత కారు హారన్‌ వినిపించింది. బయటకు వచ్చాను. శ్రీహరిరావు గారు కారులో నుంచి దిగి, లోపలికి వచ్చారు. ‘ఏంటి దాసరిగారిపై దండయాత్ర చేశావట’ అన్నారు. ‘సర్‌ ఆయనెక్కడ నేనెక్కడ. ఆయన కాలిగోటికి కూడా పనికిరాను’ అన్నాను. ‘దాసరిగారి దగ్గర నువ్వు పని ఎందుకు మానేయాలని అనుకున్నావో నేను అడగను. ఒక విషయం చెబుతా. బయటకు వెళ్తే పని దొరుకుతుంది. డబ్బులు వస్తాయి. ఇలాంటి అనుబంధాలను పంచే వ్యక్తి. నీకు దొరుకుతారా? నేను చెప్పింది నీకు సబబుగా అనిపిస్తే, వచ్చి కారు ఎక్కు. లేదు నా ఇష్టం అంటే, నువ్వు సమాధానం చెప్పాల్సిన పనిలేదు. నేను వెళ్లిపోతా’ అని అని అన్నారు. ఇంకోమాట కూడా చెప్పారు. ‘నువ్వు అక్కడి నుంచి వచ్చేసి గంటకు పైగా అయింది. ఇప్పటికీ ఆయన కనీసం మంచినీళ్లు కూడా తాగలేదు. బాధపడుతూ కూర్చొన్నారు’ అని అన్నారు. నా మనసుకూ బాధగా అనిపించింది. దాసరిగారి ఇంటికి వెళ్లేసరికి, నేను వెళ్లేటప్పుడు ఎక్కడ కూర్చొన్నారో అప్పటికీ ఆయన అక్కడే ఉన్నారు. నేను రాగానే ఆప్యాయంగా పిలిచి, మాట్లాడారు. తన సహాయకుడిని పిలిచి, ఇద్దరికీ భోజనం పెట్టమని అన్నారు. ‘నువ్వు ఎందుకు నా దగ్గర పని మానేయాలని అనుకుంటున్నావ్‌’ అని ఆయనా అడగలేదు.. నేనూ చెప్పలేదు!

శోభన్​బాబుతో

మీరూ రాజేంద్రప్రసాద్‌ కొత్తగా విష్‌ చేసుకుంటారట!

రేలంగి నరసింహారావు: 'బాబు అది విషయం' మేమిద్దరం ఎప్పుడు కలిసినా ఇలాగే పిలుచుకుంటాం. 'సంసారం' షూటింగ్‌ చేస్తున్నాం. శోభన్‌బాబు కథానాయకుడు. రాజేంద్రప్రసాద్ రాగానే 'బాబూ అది విషయం' అని అన్నాను. శోభన్‌బాబుగారిని పిలిచానేమోననుకుని ఆయన తిరిగి చూసేవారు. ఎందుకంటే శోభన్‌బాబుగారిని ‘బాబు’ అనిపిలిచేవారు. నాలుగు రోజులు ఇలాగే ఆయన తికమకపడ్డారు. నాలుగు రోజులు తర్వాత రాజేంద్రప్రసాద్‌ అడిగితే అసలు విషయం చెప్పారు. అప్పటి నుంచి శోభన్‌బాబుగారు ఉన్నన్ని రోజులు అలా పిలుచుకునేవాళ్లం కాదు.

రాజేంద్రప్రసాద్​తో

రాజేంద్రప్రసాద్‌తో మీకు ఏదో గొడవ అయిందట!

రేలంగి నరసింహారావు: మేమిద్దరం భార్యభర్తల్లాంటి వాళ్లం. అలాంటివి సహజం. రాజేంద్రప్రసాద్‌గారు కొంచెం కోపంలో ఉంటే నేను తగ్గిపోయేవాడిని. నేను కోపంలో ఉంటే ఆయన తగ్గి మాట్లాడేవారు. 'కన్నయ్య కిట్టయ్య' షూటింగ్‌ ఊటీలో జరుగుతోంది. మా ఇద్దరి మధ్య క్లాష్‌ ఏర్పడింది. మాట్లాడటం మానేశాడు. నేనూ మానేశా. రాత్రి 11గంటల సమయంలో గంగుల ప్రభాకర్‌రెడ్డి నాకు ఫోన్‌చేసి, 'నరసింహారావుగారు బయటకు వస్తారా' అని అడిగారు. వచ్చి విషయం కనుక్కుంటే 'రాజేంద్రప్రసాద్‌ భోజనం చేయలేదండీ. పడుకున్నాడు' అన్నారు. ఆయన రూమ్‌కు వెళ్తే, నన్ను చూసి, అటు తిరిగి పడుకున్నాడు. భార్యభర్తల్లో గొడవ వస్తే, భార్య ఎలాగైతే అలిగి పడుకుంటుందో ఆయన అలా పడుకున్నాడు. 'లేచి భోజనం చేయండి' అన్నాను. ఆయన తన సహాయకుడిని పిలిచి 'భోజనానికి రెండు కంచాలు పెట్టు' అన్నాడు. 'రెండోది ఎందుకు' అన్నాను. 'నిజం చెప్పండి మీరూ భోజనం చేయలేదు కదా' అడిగారు. అప్పటికి నేను కూడా తినకుండానే ఉన్నాను. ఇద్దరి మధ్య ఉన్న ఆప్యాయత అలాంటిది. అది చూసి ప్రభాకర్‌రెడ్డి కూడా ఆశ్చర్యపోయారు!

ఇదీ చూడండి:'ఓ నిర్మాత చేసిన పనికి రాత్రంతా భయంతో పడుకున్నాం'

ABOUT THE AUTHOR

...view details