Who is Gangubai kathiawadi: 'గంగూబాయి కథియావాడి' ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్ టాపిక్ మూవీ. అలియా భట్ కీలక పాత్రలో ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఈ సినిమాను తెరకెక్కించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిస్టారికల్ బయోపిక్‌గా తెరకెక్కిన ‘గంగూబాయి’ చిత్రంలో ఏముంది? ఎవరిది ఈ కథ? గంగా హర్‌జీవన్‌దాస్.. గంగూబాయిగా ఎలా మారింది? ప్రముఖ రచయిత, జర్నలిస్ట్ హుస్సేన్ జైదీ రాసిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబయి’ పుస్తకంలో గంగూబాయి గురించి ఏం చెప్పారు?
నటిగా ఎదగాలని...
Gangubai life: గంగా హర్‌జీవన్‌దాస్ గుజరాత్‌కు చెందిన అమ్మాయి. చిన్నప్పటి నుంచే సినిమాల్లో కథానాయికగా రాణించాలని కలలు కనేది. హీరోయిన్‌లా రెడీ అవటం, హావభావాలు పలికించటం, దుస్తులు ధరించడం.. ఇలా సినిమాలపై అంతులేని ప్రేమను పెంచుకుంది. ఎలాగైనా ముంబయి వెళ్లి వెండితెరపై రాణించి ధ్రువతారలా ఓ వెలుగు వెలగాలనుకునేది. పైకి కనిపించే అందమైన గులాబీల వెనుక ముళ్లు ఉంటాయన్న సంగతి గుర్తించలేనంత అమాయకురాలు గంగ. ఒక వైపు సినిమా కలలు, మరోవైపు ప్రేమ. గంగ కలలకు ఆమె ఇష్టపడిన వాడు మరింత రంగులు అద్దాడు. దీంతో ఇద్దరూ కలిసి ఇంటి నుంచి పారిపోయి ముంబయి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఎవరికీ చెప్పకుండా ముంబయి రైలెక్కేశారు.
ఆశలు ఆవిరైన వేళ..
ముంబయి చేరుకున్న గంగ, ఆమె ప్రియుడు కొద్దిరోజులు సంతోషంగా ఉన్నారు. ఇద్దరూ వివాహం కూడా చేసుకున్నారు. త్వరలోనే తన సినిమా కలలు నిజమవుతాయని గంగ భావించింది. అయితే తాను వచ్చింది మేక వన్నె పులితో అని గ్రహించలేకపోయింది. ఈ క్రమంలోనే గంగ ప్రియుడు ఆమెను ఒక ప్రాంతానికి తీసుకెళ్లాడు. అలాంటి చోటును ఆమె ఇంతకుముందెప్పుడూ చూడలేదు. ఒక ఇంటి లోపలికి వెళ్లి మాట్లాడి కాసేపటికి బయటకు వచ్చాడు. అక్కడి వాళ్లు వచ్చి ఆమెను లోపలికి తీసుకెళ్లారు. సాయంత్రమైనా కట్టుకున్న వాడు రాలేదు. అసలేం జరిగిందో తెలుసుకున్న గంగకు కన్నీళ్లు ఆగలేదు. నమ్మించి తీసుకొచ్చిన వాడు తనని రూ.500కు వ్యభిచార గృహానికి అమ్మేశాడని తెలుసుకోవడానికి ఆమెకు ఎక్కువ సేపు పట్టలేదు. దుఃఖం కట్టలు తెంచుకుంది. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తోడేళ్ల గుంపు మధ్య చిక్కుకుపోయిన జింక పిల్లలా గంగ జీవితం సర్వనాశనమైంది.
కష్టాలు.. కన్నీళ్లు.. దాటి..
మోసపోయి కామాఠిపుర చేరిన గంగకు సాలెగూడులాంటి వ్యభిచార కూపంలోనే తన జీవితం ముగిసిపోతుందని అర్థమైంది. గతిలేక తాను ఉంటున్న వ్యభిచార గృహ యజమాని చెప్పినట్లు చేస్తూ, అటు మానసికంగా, ఇటు శారీరకంగా తీవ్ర వేదన అనుభవిస్తూ నిత్యం నరకాన్ని చూసేది. ముంబయిలోని మాఫియా గ్యాంగుల్లో కరీంలాలా గ్యాంగ్ ఒకటి. అందులోని ఒక వ్యక్తి చేతిలో గంగ అత్యాచారానికి గురైంది. తనకు న్యాయం చేయమని కరీంను వేడుకోగా అతడు ఆమెతో రాఖీ కట్టించుకుని తన సోదరిని చేసుకున్నాడు. అంతేకాదు, కామాఠిపురపై ఆమెకు అధికారం కల్పిస్తూ తీర్మానం చేశాడు. అప్పటి నుంచి గంగ కామాఠిపురలోని పరిస్థితులకు అనుగుణంగా తనని తాను మార్చుకుంది. తనలాంటి వాళ్లెందరో అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కనీసం వాళ్లను మనుషులుగా కూడా చూడటం లేదని అర్థమైంది. తమకూ హక్కులు ఉంటాయని, వాటిని కాలరాసే అధికారం ఎవరికీ లేదని చెప్పాలనుకుంది. అక్కడే ఉంటూ తమతో వ్యభిచారం చేయిస్తూ తమనే పావుల్లా వాడుకొంటున్న వారిపై యుద్ధం ప్రకటించింది. వారితో పోరాటం చేసింది. ఈ క్రమంలో ఆమెను అంతం చేయాలని ఎన్నో శక్తులు ప్రయత్నించాయి. వాటిని దాటుకుని నెమ్మదిగా కామాఠిపురపై పట్టు సాధించింది.