ఓ జానపద నాయకుడు... ఓ చిలిపి స్నేహితుడు... ఓ ఆదర్శవాది... ఓ మహా భక్తుడు... ఓ ప్రేమ పిపాసి... ఓ భగ్న ప్రేమికుడు... ఓ అతితెలివి కవి... ఓ మహా పండితుడు... ఓ గొప్ప కళాకారుడు... ఓ సమాజ ప్రేమికుడు... ఓ ఉన్నత ఆలోచనా పరుడు...
ఏం చెప్పాలి అక్కినేని నాగేశ్వరరావు గురించి!
ఏ పాత్రను గుర్తు చేసుకోవాలి ఆయన నటనా వైదుష్యం గురించి!!
ఏ గుణగణలు ఉదహరించాలి ఆ మహామనిషి గురించి!!!
ఓ దాదా సాహెబ్ ఫాల్కే, ఓ పద్మవిభూషణ్ లాంటి అవార్డులు అక్కినేనిని వరించి వచ్చి మురిసిపోయాయి. ఎన్నో పురస్కారాలు, అవార్డులు ఆయనను సత్కరించుకుని తీపి గురుతులను నగిషీలుగా చెక్కుకుని తళుకులీనాయి. అన్నింటినీ మించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోలేని ప్రేమాభిమానాలు, అక్కినేనికి అగ్రపీఠం వేసి స్వర్ణ సింహాసనం మీద కూర్చోబెట్టాయి. కృష్ణాజిల్లా రామాపురం నుంచి నాటక రంగాన్ని మురిపించి, వెండితెరను అలరించి, ఎన్నో పాత్రలను మెరిపించి చిరస్మరణీయ ఖ్యాతిని అందుకున్న అక్కినేని శకం, తెలుగు చలన చిత్ర చరిత్రలో సువర్ణాధ్యాయం. 1924 సెప్టెంబర్ 20న పుట్టి, జనవరి 22, 2014న మరణించిన అక్కినేని జీవితం, ఆద్యంతం స్ఫూర్తిదాయకం! అనునిత్యం స్మరణీయం!!
1945లో పూర్తిస్థాయి నటుడిగా 'మాయాలోకం'లో విహరించిన అక్కినేని, పల్లెటూరి నేపథ్యంలో నటించిన మొదటి చిత్రం.. దర్శక నిర్మాత బి.ఏ.సుబ్బారావు నిర్మించిన 'పల్లెటూరిపిల్ల'గా చెప్పవచ్చు. అక్కినేనికి ఇది 12వ చిత్రం. ఎన్.టి.ఆర్‌తో కలిసి నటించిన మొదటి మల్టీ స్టారర్ సినిమా కూడా ఇదే. ఎన్.టి.ఆర్‌కి కూడా కథా నాయకుడిగా(జయంత్) ఇది తొలి చిత్రమే. 27-4-1950న విడుదలైన ఈ సినిమాకు మూలం షెరిటన్ రాసిన 'ఫిజారో' అనే ఆంగ్ల నాటకం. ఇందులో అక్కినేని పాత్ర పేరు వసంత్. ఈ పాత్రకు మొదట కల్యాణం రఘురామయ్యను తీసుకుందామనుకుంటే, అందులో పోరాట సన్నివేశాలున్నందున తను చెయ్యలేనని చెప్పగా.. అక్కినేనికి అవకాశం దక్కింది. ప్రధాన పాత్ర ఎన్.టి.ఆర్‌దే అయినా టైటిల్స్‌లో అక్కినేని పేరే మొదట కనబడుతుంది. పసిబిడ్డను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయే త్యాగమూర్తి పాత్రలో అక్కినేని అద్భుతంగా నటించారు. అక్కినేని బుల్ ఫైట్ సన్నివేశంలో ఎంతో సహజంగా నటించారు. అక్కినేని ఎన్.టి.ఆర్‌తో కలిసి నటించిన మరో పల్లెటూరి కథా చిత్రం ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వం వహించిన 'సంసారం'. ఎన్.టి.ఆర్‌కి తమ్ముడిగా, పల్లెటూరి రైతు పాత్రలో ప్రవేశం చేసి, పట్నవాసంలో నాగరికత నేర్చుకున్న యువకునిగా అక్కినేనిని నటన సాంఘిక పాత్రల్లో ప్రత్యేక స్థానాన్ని కల్పించింది. 1950 డిసెంబరు 25న న విడుదలైన ఈ చిత్రం రజతోత్సవం చేసుకుంది. 1954లో వచ్చిన తాతినేని ప్రకాశరావు చిత్రం 'నిరుపేదలు'లో పల్లెటూరి యువకునిగా ఉంటూ కరువు-కాటకాలవలన వలస వెళ్లి రిక్షా కార్మికునిగా మారే పాత్రలో అక్కినేని నటించారు. ఈ చిత్రం 5 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. అదే సంవత్సరం తాతినేని ప్రకాశరావు మరో చిత్రం 'పరివర్తన' కూడా విడుదలైంది. ఇందులో కూడా ఎన్.టి.ఆర్, అక్కినేని కలిసి నటించారు.
అభ్యుదయ చిత్రాల్లో
స్వాతంత్య్రం వచ్చిన తరువాత జమీందారీ విధానాలపట్ల సమాజంలో బిన్నభిప్రాయాలు వెలువడ్డాయి. కొందరు అభ్యుదయ వాదులు ఈ సమస్యల నేపథ్యంలో సినిమాలు నిర్మించారు. సారథి ఫిలిమ్స్ పతాకంపై సి.వి.ఆర్.ప్రసాద్ తాపీ చాణక్య దర్శకత్వంలో వచ్చిన 'రోజులు మారాయి' చిత్రం ఆ కోవలోనిదే. అక్కినేని, షావుకారు జానకి నటించిన ఈ సినిమా గ్రామీణ వాతావరణంలో దున్నే వాడిదే భూమి అనే నేపథ్యంలో సాగుతుంది. అన్యాయాన్ని ఎదిరించే నవతరం ప్రతినిధిగా, బడుగు రైతులకు అండగా ఉంటూ ఆదర్శ రైతుబిడ్డగా అక్కినేని ఎంతో సహజంగా నటించారు. హైదరాబాదులో రజతోత్సవం చేసుకున్న తొలి తెలుగు సినిమా 'రోజులుమారాయి'. దున్నేవాడికే భూమి అనే ఈ సినిమా నినాదంతోనే పేద రైతుల ఉద్యమానికి ప్రేరణ కలిగింది. అంతేకాదు రాష్ట్ర రాజధానిలోనే చిత్ర నిర్మాణం జరగాలని యార్లగడ్డ రామకృష్ణ ప్రసాద్ సారథి స్టూడియో నిర్మాణానికి నడుం బిగించారు.
దుక్కిపాటి మధుసూదనరావు నిర్మాతగా అన్నపూర్ణా సంస్థను నెలకొల్పి కె.వి.రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించిన 'దొంగరాముడు' సినిమాలో గ్రామీణ వాతావరణాన్ని సృష్టించినా అక్కినేనిది పూర్తి స్థాయి గ్రామీణ పాత్రకాదు. 11-1-1957లో వచ్చిన సొంతచిత్రం 'తోడికోడళ్ళు'లో చదువుకున్న ఆదర్శ రైతుగా అక్కినేని భూమిక నిర్వహించిన విధానం గొప్పగా వుంటుంది. శరత్ నవల 'నిష్కృతి' ఆధారంగా నిర్మించిన ఈ చిత్రానికి తొలిసారి ఆదుర్తి సుబ్బారావు అన్నపూర్ణ సంస్థకు దర్శకత్వ బాధ్యతలు నిర్వహించి, తదుపరికాలంలో 'పూలరంగడు' చిత్రం దాకా ఆ పరంపరను కొనసాగించారు. బంధుత్వాలలోని అనుబంధాల లోతులను చూపిన ఈ సినిమాలో అక్కినేని నటించిన సత్యం పాత్ర, అనివార్య పరిస్థితుల్లో పల్లెటూరు వచ్చి, రైతుల పక్షాన పోరాడి సహకార సేద్యానికి నాంది పలకడం, ఆశయసిద్ధి సాధించడం వంటి మంచి పనులు చేసే పాత్ర. ఈ చిత్రానికి రాష్ట్రపతి యోగ్యతా పత్రం లభించింది. తరువాత వచ్చిన 'ఆడపెత్తనం'(1958), 'మాంగల్య బలం'(1959) చిత్రాల్లో గ్రామీణ వాతావరణం కనిపించినా అది పూర్తి స్థాయిలో వుండదు.
ఇక తెలుగు సినిమాల్లో యాంటీ హీరో పాత్రలకు బలమైన పునాది ఏర్పాటుచేసిన సినిమా 'నమ్మినబంటు'. హీరో అంటే సద్గుణ సంపన్నుడని, నీతికి కట్టుబడేవాడనే పడికట్టు లక్షణాలకు ఎదురువెళ్లిన సినిమా 'నమ్మినబంటు'. ఇందులో హీరో ఒక భూస్వామికి నమ్మినబంటు. అంటే అన్యాయానికి కొమ్ముకాసే పాత్ర. అక్కినేనికి ఈ పాత్ర కత్తిమీద సామువంటిది. అందరిలో ఒక్కడిగా, అందరికీ ఒక్కడిగా నమ్మినవారిని ఆదుకొనే తత్వంగల పాత్ర. అటువంటి 'నమ్మినబంటు'ని సావిత్రి మంచి మార్గంలో పెట్టి, సంస్కరించే సోషలిస్టు భావాలను ప్రతిబింబించే పాత్ర. 7-1-1960న విడుదలైన ఈ చిత్రాన్ని స్పెయిన్‌లోని శాన్ సెబాస్టియన్లో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించారు.
అన్నపూర్ణా వారి ‘పూలరంగడు’ సినిమా కూడా గ్రామీణ వాతావరణంలో తీసిందే. అక్కినేనిది ఇందులో జట్కా నడిపే రంగడి పాత్ర. ఎంత కష్టం తలెత్తినా పూలరంగడుగానే తిరిగే మనస్తత్వంగల పాత్ర అక్కినేనిది. ప్రళయం వచ్చినా లొంగడని, ప్రాణం పోయినా జయిస్తాడనీ ఎస్టాబ్లిష్ చేసే పాత్తల్రో అద్భుతంగా నటించారు అక్కినేని. ఆ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ జగపతి పిక్చర్స్ అధినేత వి.బి.రాజేంద్రప్రసాద్ స్వీయ దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణంలో 'దసరా బుల్లోడు' సినిమా తీశారు. ఈ సినిమా 25 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుని బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. అక్కినేనికి 'దసరాబుల్లోడు' 146వ చిత్రం. జానపద చిత్రాల హీరో అక్కినేని అని ముద్రపడబోతున్న రోజుల్లో జాగ్రత్తపడి, సాంఘికాలకు మారి, ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని ప్రేక్షకులకు చూపిస్తూ.. తన సుదీర్ఘ సినీ ప్రస్థానాన్ని 70 ఏళ్ళకు పైగా నిలుపుకోగాలిగారు.