తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సిమ్రాన్ దక్షిణాది పరిచయం ఆ సినిమాతోనే​!

స్టన్నింగ్‌ బ్యూటీ.. ఎట్రాక్టివ్‌ పర్సనాలిటీ.. హంటింగ్‌ స్మైల్‌... రొమాంటిక్‌ లుక్స్‌... వావ్‌ అన్పించే డాన్సింగ్‌ స్కిల్స్‌... సూపర్‌ యాక్టింగ్‌...వెరసి రిషిబాల నావల్‌. 90 దశకంలో అందంతో, అభినయంతో హల్చల్‌ చేసిన సొగసులు. సిల్వర్‌ స్క్రీన్​​కి గ్లామర్‌ అద్ది అలనాటి యువ ప్రేక్షకులకెన్నో నిదురలేని రాత్రులు బహూకరించిన సోయగాల తారక... వెండితెర నాయిక. ఆమె సినిమా చూసి వచ్చిన తరువాత పొరపాటున ఆదమరిచి నిద్రపోతే, ఆ నిద్రలోనూ హఠాత్తుగా ఏతెంచె అర్ధరాత్రి కల. ఆమె మరెవరో కాదు నటి సిమ్రాన్. వెండితెరపైనే కాకుండా టెలివిజన్​ స్క్రీన్​పై తన ప్రతిభ చాటుకుని బహుముఖ ప్రజ్ఞ కనబర్చిన ఈ వెండి తెర తుపాన్​ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్బంగా ఆమె గురించి మరిన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం...

ACTRESS SIMRAN BIRTHDAY SPECIAL STORY
రిషిబాల నావల్​.. ఆమె ఓ అందాల తుపాన్​!

By

Published : Apr 4, 2020, 6:56 AM IST

Updated : Apr 4, 2020, 4:17 PM IST

రిషిబాల నావల్‌ సినిమా వస్తోందంటే చాలు... థియేటర్ల ప్రాంగణంలో జాతరే జాతర. టికెట్‌ కౌంటర్స్‌ ఎదుట గంటల తరబడి ఎదురుచూపులు. అంతలా మెస్మరైజ్‌ చేసిన రిషిబాల నావల్‌ అంటే... ఎవరా? అనే సందేహం ఆమె సినిమాలు చూసిన ప్రేక్షకులకు కూడా రావొచ్చు. ఆ పేరు గల వెండితెర తారక లేరంటూ వాదించవచ్చు. అయితే ఆమె స్క్రీన్​​ నేమ్‌ చెప్తే చాలు... కళ్లింతలు చేసుకుని మరీ విస్మయానికి లోనవుతారు కూడా! ఔను ... రిషిబాల నావల్‌ మరెవరో కాదు... మనందరికి తెలిసిన సిమ్రాన్‌. వీక్షకులను కమ్మేసిన అందాల తుపాన్‌. హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, ఉర్దూ భాషల్లో వివిధ చిత్రాల్లో నటించిందామె. 'మై ఔర్‌ మేరీ ఖవాయిసిన్‌' అనే మ్యూజిక్‌ ఆల్బమ్‌లోనూ మెరిసిన సిమ్రాన్‌.. టెలివిజన్‌ స్కీన్​పైనా తన ప్రతిభ చాటుకుంది.

ముంబై ముద్దుగుమ్మ

ముంబై ముద్దుగుమ్మ

సిమ్రాన్‌ ముంబాయ్‌ నుంచి టాలీవుడ్‌కి దిగుమతి అయిన ముద్దుగుమ్మ. అశోక్‌ నావల్, శారదా నావల్‌ దంపతులకు ముంబయిలో 1976 ఏప్రిల్‌ 4న రిషిబాల నావల్‌ పేరుతో సిమ్రాన్‌ జన్మించింది. ఈమె పంజాబీ. సిమ్రాన్‌కి ఇద్దరు సోదరీమణులు మోనాల్, జ్యోతి నావల్‌తో పాటు ఓ సోదరుడు సుమిత్‌ కూడా ఉన్నారు. సెయింట్‌ ఆంథోనీ హై స్కూల్‌లో చదివిన సిమ్రాన్‌ ముంబైలో బీకామ్‌ పూర్తి చేసింది. మాతృభాష పంజాబీతో పాటు హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్‌ భాషల్లో కూడా ఈమెకి మంచి పట్టు ఉంది. నృత్యం అంటే మక్కువ ఎక్కువైన సిమ్రాన్‌ సంప్రదాయ భరతనాట్యంలోనూ, ఆధునిక సల్సా నృత్యంలోనూ శిక్షణ పొందింది. సినిమా కెరీర్‌ తారాస్థాయిలో ఉన్నప్పుడే 2003లో ఈమె తన చిన్ననాటి స్నేహితుడైన దీపక్‌ బగ్గాని వివాహమాడి కొంతకాలం కెమెరాకి విరామం ప్రకటించింది. ఈ దంపతులకు ఆదిత్, అదీప్‌ అనే ఇద్దరు పిల్లలు.

మోడలింగ్‌ అంటే ఇష్టం

సిమ్రాన్‌కి మోడలింగ్‌ అంటే ఎంతో ఇష్టం. కెమెరాని విపరీతంగా ప్రేమించింది. కళాశాలలో చదువుకున్నప్పుడే భవిష్యత్‌లో ఫ్యాషన్‌ డిజైనర్‌ కావాలని ఆమెకి ఎన్నో కలలు. ఆ కలల్ని నిజం చేస్తూ సినీ తారకగా తళుక్కున మెరిసి.. జనహృదయ సింహాసనంపై మకుటం లేని మహారాణిగా తనని తాను ప్రతిష్టించుకుంది. 'సనమ్‌ హారాజై'తో 1995లో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన సిమ్రాన్‌.. ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ తరువాత కూడా కొన్ని హిందీ సినిమాల్లో నటించినా.. పెద్దగా గుర్తింపు రాలేదు.

ఆ తర్వాత అందివచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకుని... బుల్లితెరపై సూపర్‌ హిట్‌ ముఖబ్లా షోకి యాంకర్‌గా వ్యవహరించింది. ఆ షోలో చూసిన జయబాధురి ఎబిసిఎల్‌ ప్రొడక్షన్స్‌ బానర్‌పై తన భర్త అమితాబ్‌ నిర్మిస్తున్న రొమాంటిక్‌ డ్రామాలో అవకాశాన్ని అందించింది. అయితే...ఆ సినిమా కూడా అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. ఆ తరువాత సిమ్రాన్‌ 'ముకద్దర్‌', 'అంగారా', 'దాదాగిరి'లాంటి కొన్ని సినిమాల్లో వివిధ పాత్రలు పోషిస్తూ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆ వరుసలోనే 'బాల్‌ బ్రహ్మచారి', 'అగ్నిమోర్చా', 'గూండా గర్థి' తదితర చిత్రాల్లోనూ నటించింది.

'ఇంద్రప్రస్థం'తో దక్షిణాదికి

సిమ్రాన్‌ని దక్షిణాది నుంచి మళయాళ పరిశ్రమ తొలుత ఆహ్వానించింది. 1996లో 'ఇంద్రప్రస్థం' సినిమాతో మళయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 1997లో కన్నడ ఇండస్ట్రీకి 'సింహద' సినిమాలో శివరాజకుమార్‌కి జతగా సిమ్రాన్‌ నటించింది. 1997లో తమిళ్‌ ఇండస్ట్రీలోకి 'వన్స్‌ మోర్‌' చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత 'విఐపి' చిత్రంలో ప్రభుదేవా సరసన నటించింది. బాలీవుడ్‌లో పలు వైఫల్యాలను ఎదుర్కొన్నా... దక్షిణాది సినిమా ఆమెని తలెత్తుకునేలా చేసింది. తమిళ్‌లో లేడీ సూపర్‌ స్టార్‌ అంటూ అక్కడ ప్రేక్షకులు ఈమెకి బ్రహ్మరథం పట్టారు. తమిళ్‌లో 1998లో 'నటుపుక్కగా', 'అవళ్‌ వరువాల', 'కన్నిధిరే తోండ్రినల్‌' తదితర చిత్రాల విజయాలతో సిమ్రాన్‌ హల్చల్‌ చేసింది.

'అబ్బాయిగారి పెళ్లి'తో తెలుగులోకి

సిమ్రాన్‌ని డైరెక్టర్‌ శరత్‌ 1997లో హీరో సుమన్‌ సరసన హీరోయిన్‌గా 'అబ్బాయిగారి పెళ్లి' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆ సినిమాలో అందాలారబోసిన సిమ్రాన్‌ను.. టాలీవుడ్‌కి మరో గ్లామరస్‌ హీరోయిన్‌ దొరికిందంటూ మెచ్చుకున్నారు. భారతీయ సినీ పరిశ్రమలో బాలీవుడ్‌ తరువాత అత్యధిక సినిమాలు రూపొందిస్తూ సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న తెలుగు ఇండస్ట్రీని వదులుకోవడానికి ఏ పరాయి భాష నటీనటులెవ్వరూ ఇష్టపడరు. అవకాశాలు వస్తే... ఇక్కడే అందలం ఎక్కుతారు. ఈ విషయంలో సిమ్రాన్‌ కూడా మినహాయింపు కాదు. టాలీవుడ్‌లోని అగ్ర కథానాయకులతో నటించి మెప్పించింది. సిల్వర్‌ స్కీన్​కి అందాలు అద్దడంలో ఏ మాత్రం మొహమాటం లేని ఆమె వైఖరే ... ఆమెకి విజయాల్ని తీసుకొచ్చింది. 'ప్రియా...ప్రియా', 'మా నాన్నకి పెళ్లి', 'ఆటో డ్రైవర్‌'... ఇలా అనేక సినిమాల్లో నటిస్తున్న సిమ్రాన్‌ కెరీర్‌లోనే సూపర్‌ డూపర్‌ సినిమాలు కొన్ని ఉన్నాయి.

'సమరసింహారెడ్డి'తో స్టార్డమ్‌

బాలకృష్ణ హీరోగా బి.గోపాల్‌ దర్శకత్వంలో 1999లో రూపొందిన చిత్రం ‘సమరసింహారెడ్డి’ సిమ్రాన్‌కి సరికొత్త గ్లామర్‌ని అద్దింది. రాయలసీమ ఫ్యాక్షన్‌ నేపథ్యంలో ఉత్కంఠభరితంగా సాగిన చిత్రంలో పాటలకు సిమ్రాన్‌ తన వయసు వసంతాలు జోడించి నేత్రపర్వం చేసింది. ఇక... అక్కడ నుంచి సిమ్రాన్‌ అంటే మనసు పారేసుకున్న అభిమానులెందరో? అదే బాలకృష్ణకి జోడీగా ‘గొప్పింటి అల్లుడు’, ‘సీమ సింహం’, ‘ఒక్క మగాడు’ చిత్రాల్లో అలరించింది. ఇక చిరంజీవితో ‘అన్నయ్య’, ‘మృగరాజు’, ‘డాడీ’ చిత్రాల్లో నటించింది. నాగార్జునకి జోడీగా ‘ఆటో డ్రైవర్‌’, ‘నువ్వు వస్తావని’, ‘బావ నచ్చాడు’; వెంకటేష్‌ సరసన ‘కలిసుందాం రా’, ‘ప్రేమతో రా’; మహేష్‌ బాబు సరసన ‘యువరాజు’; ప్రభాస్‌కి జోడీగా ‘రాఘవేంద్ర’; నందమూరి హరికృష్ణకి జోడీగా ‘సీతయ్య’ తదితర చిత్రాల్లో నటించారు. తమిళంలోంచి తెలుగులోకి అనువాదం అయిన ‘వీఐపీ’, ‘వాలి’ చిత్రాలు సిమ్రాన్‌ ఖాతాలో విజయాల్ని జమ చేశాయి.

తమిళ్‌ సూపర్‌స్టార్‌ రజినీతో

తమిళ్‌ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌తో 2019లో తెరపంచుకొంది. ‘పేట’ సినిమాలో ఆమె ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఈ సినిమా 2019 జనవరి 10న విడుదలై విమర్శకుల ప్రసంశలు అందుకుంది.

బ్రాండ్‌ అంబాసిడర్‌గా

సిమ్రాన్‌ కొన్ని వాణిజ్య ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించింది. కొన్ని శీతల పానీయాలకు, సబ్బులకు ఆమె ప్రచార కర్తగా నటించింది.

బుల్లితెరపై

బుల్లితెరపై

సిమ్రాన్‌ బుల్లితెర మాధ్యమాన్ని కూడా వదలలేదు. 1995లో సూపర్‌ హిట్‌ ‘ముఖబ్లా’తో మొదలైన ఆమె టెలివిజన్‌ ప్రస్థానంలో అనేక షోలు ఉన్నాయి. 2008లో సిమ్రాన్‌ ‘తీరాయ్‌’లో అనేకానేక పాత్రలు పోషించిన తను అదే సంవత్సరం తమిళ్‌లో సూపర్‌ షో కి న్యాయ నిర్ణేతగా వ్యవహరించింది. 2010 నుంచి 2012 వరకు జెమిని తెలుగు ఛానెల్‌లో సుందరకాండ షో లో కీలక పాత్ర పోషించింది. 2010 నుంచి 2013 వరకు తమిళ్‌లో జాక్‌ పాట్‌ టీవీ షో నిర్వహించింది. 2013లో తమిళ్‌లో డాన్స్‌ తంజా షోకి న్యాయ నిర్ణేతగా ఉంది. 2013, 14 సంవత్సరాల్లో తమిళ్‌లో అగ్ని పర్వాయ్‌ సీరియల్లో మాధవి పాత్రలో రాణించింది.

అవార్డులు

వివిధ చిత్రాల్లో సిమ్రాన్‌ ప్రదర్శించిన ప్రతిభకి గుర్తింపుగా అనేక సాంస్కృతిక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు అవార్డులు అందించాయి. మలయాళ చిత్రపరిశ్రమకి సిమ్రాన్‌ సేవలకు గాను ఆసియా నెట్‌ పురస్కారం ఆమెకి లభించింది. 1999లో ‘వాలి’ సినిమాలో ప్రతిభకిగాను, 2000లో ‘ప్రియమన్‌ వాలే’ చిత్రానికిగాను బెస్ట్‌ తమిళ్‌ యాక్టెస్ర్‌ అవార్డును సినిమా ఎక్స్‌ ప్రెస్‌ అవార్డు సంస్థ సిమ్రాన్‌కి అందించి సత్కరించింది. 2001లో సినిమా ఎక్స్‌ ప్రెస్‌ అవార్డు సంస్థ బెస్ట్‌ ఆన్‌ స్కీన్ర్‌ కపుల్‌ అవార్డును హీరో ప్రశాంత్‌తో పాటు సిమ్రాన్‌కి అందించి గౌరవించింది. 2002లో మళ్ళీ బెస్ట్‌ తమిళ్‌ యాక్టెస్ర్‌ అవార్డును ‘కణ్ణత్తిల్‌ ముత్తమత్తల్‌’ చిత్రంలో నటనకు గాను సిమ్రాన్‌ అందుకుంది. దినకరన్‌ ఫిలిం అవార్డు సంస్థ బెస్ట్‌ న్యూపేస్‌ అవార్డును సిమ్రాన్‌ కి అందించింది.

ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డు సౌత్‌ తెలుగు, తమిళ భాషల్లో నటనకు గాను సిమ్రాన్‌ను వరించింది. తెలుగులో 2000లో ‘కలిసుందాం రా!’, ‘నువ్వు వస్తావనీ’... చిత్రాలకు, 2001లో ‘నరసింహనాయుడు’ చిత్రానికిగాను సిమ్రాన్‌ ఫిలింఫేర్‌ ఉత్తమ నటి అవార్డులను అందుకుంది. ఇంకా ఇంటర్నేషనల్‌ తమిళ్‌ ఫిలిం అవార్డులు, కళైమామణి, తమిళ్‌నాడు స్టేట్‌ ఫిలిం అవార్డులు, సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ అవార్డులు, విజయ్‌ అవార్డులు... ఇలా చాలా అందుకుంది సిమ్రాన్‌. పౌర సన్మానాలు, సాంస్కృతిక సంస్థల సన్మానాలనెన్నో అందుకుందామె.

ఇదీ చదవండి:అన్ని కోణాల్లోనూ అలుపెరగని బహుముఖ ప్రజ్ఞాశాలి

Last Updated : Apr 4, 2020, 4:17 PM IST

ABOUT THE AUTHOR

...view details