తొలినాళ్లలో అందంతో, ఆ తరువాత అభినయంతో పాటు వ్యక్తిగత విషయాలతోనూ వార్తల్లో నిలిచిన కథానాయిక నయనతార. తెలుగు, తమిళం, మలయాళ ప్రేక్షకులకు సుపరిచితమైన ఈమె దక్షిణాదిన అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కథానాయికగా పేరు తెచ్చుకుంది. తన హొయలతో అభిమానుల మతులు పోగొట్టే నయనతార పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా నయన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.
తారగా మారిన క్షణం
నయనతార 1984 నవంబరు 18న బెంగళూరులో జన్మించింది. ఆమె అసలు పేరు డయానా మారియమ్ కురియన్. తండ్రి కురియన్ కొడియట్టు ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి. తల్లి ఒమన్ కురియన్. తండ్రి ఉద్యోగ రిత్యా బదిలీల కారణంగా నయనతార బాల్యం పలు నగరాల్లో గడిచింది. ఇంటర్, డిగ్రీ మాత్రం కేరళలోనే పూర్తిచేసింది. కళాశాల రోజుల నుంచే మోడలింగ్‌పై దృష్టిపెట్టిన నయన్.. మలయాళీ దర్శకుడు సత్యన్ అంతిక్కాడ్ దృష్టిలో పడి ‘మనస్పినక్కరే’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది.
తెలుగులోనే అసలైన గుర్తింపు
తమిళం, మలయాళంలో నాలుగైదు చిత్రాలు చేసినా... తెలుగు ప్రేక్షకులకు మాత్రం ‘చంద్రముఖి’తోనే చేరువైంది నయనతార. ‘గజిని’ చిత్రం తర్వాత అవకాశాలు వెల్లువెత్తాయి. ‘లక్ష్మి’, ‘బాస్’, ‘యోగి’, ‘దుబాయ్ శీను’, ‘తులసి’ చిత్రాలతో తెలుగులో తీరక లేని కథానాయిక అయిపోయింది. ‘వల్లభ’, ‘శివాజీ’ తదితర చిత్రాలు కూడా అనువాదాలుగా విడుదలై విజయవంతమయ్యాయి. తెలుగులో స్టార్ కథానాయికగా క్రేజ్ సంపాదించుకుంది.
అప్పటినుంచి ఆచితూచి అడుగులు వేస్తూ ‘అదుర్స్’, ‘కృష్ణం వందే జగద్గురుమ్’, ‘శ్రీరామరాజ్యం’ తదితర చిత్రాల్లో ముఖ్యపాత్రలు పోషించి అభినయం పరంగా మంచి పేరు సంపాదించుకుంది. అందంతో ఆకట్టుకున్న ఆమె ఆ తరువాత వరుసగా ఇతర భాషల్లోనూ అవకాశాలు అందుకుంది. తన సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనని నిర్మొహమాటంగా చెప్పే ఒకే ఒక్క కథానాయిక నయనతార.
ప్రేమ కలహాలు
ఆమె సినిమాలో ఉంటే చాలనుకొంటూ దర్శకనిర్మాతలు నయనతారను సంప్రదిస్తుంటారు. బాపు దర్శకత్వం వహించిన ‘శ్రీరామరాజ్యం’లో నటనకిగానూ నయనతారకి ఆంధప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది పురస్కారం లభించింది. సినిమాలతోనే కాకుండా, వ్యక్తిగత విషయాలతోనూ తరచుగా వార్తల్లో నిలుస్తుంది నయన్. ‘వల్లభ’ చిత్రీకరణ సమయంలో సహనటుడు శింబుతో ప్రేమలో పడింది. వాళ్లిద్దరూ కలిసి ఏకాంతంగా గడిపినప్పటి ఫొటోలు, వీడియోలు అప్పట్లో హల్‌చల్ చేశాయి. ఆ తరువాత ఇద్దరూ విడిపోయారు. కొన్నాళ్ల తరువాత మళ్లీ ప్రభుదేవాతో ప్రేమలో పడ్డారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. ప్రభుదేవా కోసం నయనతార మతం కూడా మార్చుకుంది. సినిమాల్లో నటించే అవకాశాలొచ్చినా వాటిని కాదనుకుంది. అయితే ఏమైందో తెలియదు ... కొన్నాళ్లకే ఇద్దరి మధ్య బంధం బీటలు వారింది. మళ్లీ ఆమె తన కెరీర్‌పై దృష్టిపెట్టి వరుసగా అవకాశాలు అందుకుంటూ విజయాల్ని సొంతం చేసుకుంటోంది.
దర్శకుడితో లవ్
ప్రస్తుతం కథానాయికకు ప్రాధాన్యమున్న చిత్రాలు చేస్తూ తన జోరును కొనసాగిస్తోంది నయనతార. సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాక యువ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో పడింది. ఇద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలొస్తున్నాయి. ఇటీవలే ‘సైరా నరసింహారెడ్డి’లో మెగాస్టార్‌తో కలిసి నటించింది నయనతార. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీ కాంత్‌తో దర్బార్ చిత్రంలో నటిస్తోంది. తమిళం, మలయాళంలోను చిత్రాలు చేస్తోంది.