తెలంగాణ

telangana

ETV Bharat / sitara

లతకు ప్రముఖుల ఘన నివాళి- అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

Lata mangeshkar died: ప్రముఖ గాయని, భారతరత్న పురస్కార గ్రహీత, గాన కోకిల లతా మంగేష్కర్ కన్నుమూశారు. వివాదాలకు అతీతంగా, అభిమానులకు సమీపంగా ఉండే మహోన్నత వ్యక్తిత్వం కలిగిన ఆమె మరణంతో సంగీతాభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. లతా మంగేష్కర్ మరణంతో కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల పాటు జాతీయ సంతాప దినాలు ప్రకటించింది.

Lata mangeshkar died
Lata mangeshkar died

By

Published : Feb 6, 2022, 11:24 AM IST

Updated : Feb 6, 2022, 12:32 PM IST

Lata mangeshkar died: భారత సినీ చరిత్రలో గాయనిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న లతా మంగేష్కర్​.. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం కన్నుమూశారు. ముంబయిలోని బ్రీచ్​ కాండీ ఆసుపత్రిలో శ్వాససంబంధిత సమస్యలతో బాధపడుతూ గత 29 రోజులుగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు ఆమె సోదరి ఉషా మంగేష్కర్​ తెలిపారు.

అధికారిక లాంఛనాలతో..

లతా మంగేష్కర్ కన్నుమూతతో కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల పాటు జాతీయ సంతాప దినాలు ప్రకటించింది. గౌరవ సూచకంగా రెండు రోజుల పాటు జాతీయ జెండాను అవనతం చేయాలని సూచించింది.

అధికార లాంఛనాలతో లతా మంగేష్కర్‌ అంత్యక్రియలు నిర్వహిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. మధ్యాహ్నం 12.30కి ఆమె పార్థివ దేహాన్ని ఆస్పత్రి నుంచి ఇంటికి తరలించనున్నారు. సాయంత్రం ఆరున్నర గంటలకు శివాజీ పార్క్​ శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.

ప్రముఖుల సంతాపం..

గాయని లతా మంగేష్కర్​కు సంతాపం ప్రకటించారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. ' భారత రత్న, లతా జీ సాధించిన విజయాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి' అని ట్వీట్​ చేశారు.

లెజెండరీ సింగర్​ లతా మంగేష్కర్​ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె లేని లోటు తీర్చలేనిదని పేర్కొన్నారు.

లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మరణం తనను శోకసంద్రంలోకి నెట్టిందని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. అనేక దశాబ్దాలుగా తన మధుర స్వరాలతో సంగీత ప్రియులను అలరించారని పేర్కొన్నారు. ఆమె మరణంతో దేశం గొంతు మూగబోయిందని ట్వీట్​ చేశారు.

లతా మంగేష్కర్​ మృతిపట్ల సంతాపం ప్రకటించారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. సంగీత ప్రపంచానికి ఆమె చేసిన సేవలను మాటల్లో చెప్పలేమన్నారు. ఆమె మరణం తనకు వ్యక్తిగతంగానూ నష్టాన్ని చేకూర్చుతుందని ట్వీట్​ చేశారు.

'లతా మంగేష్కర్​ ఇక లేరనే బాధాకరమైన వార్త తెలిసింది. ఎన్నో దశాబ్దాల పాటు ఆమె గొంతుక నిలిచిపోతుంది. ఆమె బంగారు స్వరం అజరామరం. ఆమె అభిమానుల హృదయాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి.' అని ట్వీట్​ చేశారు రాహుల్​ గాంధీ.

లతా మంగేష్కర్​కు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు. లత స్వరానికి తానూ ఓ అభిమానినని ట్వీట్​ చేశారు. ఆమె గౌరవార్థం సోమవారం సగం రోజు సెలవు ప్రకటించారు.

భారత సంగీత ప్రపంచానికి లత మరణం తీరని లోటని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. భారత సంగీత ఉద్యానవనంలో స్వరాలను అలంకరించిన లత మరణం తీరని లోటని ప్రియాంక ట్వీట్‌ చేశారు. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ ఠాక్రే సహా పలు రాష్ట్రాల సీఎంలు లత మృతికి సంతాపం తెలిపారు.

లతా మంగేష్కర్ మృతి పట్ల చిరంజీవి సంతాపం తెలియజేశారు. 'లత దీదీ ఇక లేరనే వార్తతో చలించిపోయా' అని తెలిపారు. ఆమె సంగీతం ఎప్పటికీ సజీవంగా ఉంటుందని అన్నారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ట్వీట్​ చేశారు.

వీరితో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

ఇవీ చూడండి:

లతా మంగేష్కర్ పాడటం.. సంగీత దర్శకులకు గౌరవం

దివికేగిన అమృతగానం.. లతా మంగేష్కర్ అస్తమయం

Lata Mangeshkar: ఏడు దశాబ్దాల ప్రయాణం.. వేల గీతాల నిలయం

Last Updated : Feb 6, 2022, 12:32 PM IST

ABOUT THE AUTHOR

...view details