తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విజయ్​ సేతుపతి కుమార్తెకు అత్యాచార బెదిరింపులు - vijay sethupathi news

వివాదాస్పదంగా మారిన శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్​ బయోపిక్​ నుంచి కోలీవుడ్​ నటుడు విజయ్​ సేతుపతి తప్పుకున్నారు. అంతకుముందు విజయ్​ సేతుపతి కుమార్తెపై అత్యాచారం చేస్తామంటూ సోషల్​మీడియాలో కొందరు వ్యాఖ్యలు చేయగా.. వాటిని పలువురు నెటిజన్లు ఖండించారు.

800 row: Rape threat against Tamil actor Vijay Sethupathi's minor daughter
విజయ్​ సేతుపతి కుమార్తెకు అత్యాచార బెదిరింపులు

By

Published : Oct 20, 2020, 1:49 PM IST

Updated : Oct 20, 2020, 2:39 PM IST

శ్రీలంక దిగ్గజ స్పిన్నర్​ ముత్తయ్య మురళీధరన్​ బయోపిక్​ '800' నుంచి తప్పుకుంటున్నట్లు కోలీవుడ్​ నటుడు విజయ్​ సేతుపతి సోమవారం స్పష్టం చేశారు. ఈ సినిమాలో నటించడానికి అంగీకరించిన కారణంగా అతడి కుమార్తెను అత్యాచారం చేస్తామని సోషల్​మీడియాలో కొంతమంది బెదిరింపులకు దిగారు. ఇటీవలే ధోనీ కుమార్తెను అత్యాచారం చేస్తానని బెదిరించిన వ్యక్తిని గుజరాత్​ పోలీసులు అరెస్టు చేసిన తర్వాత మళ్లీ అలాంటి ఘటనే చోటుచేసుకుంది.

విజయ్​ సేతుపతి కుమార్తెపై అత్యాచారం చేస్తామని సోమవారం సోషల్​మీడియాలో బెదిరింపులు వచ్చాయి. అలా చేస్తే ఈలం తమిళుల బాధలు విజయ్​కు అర్థమవుతాయని వారు పోస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలపై స్పందించిన నెటిజన్లు పిల్లలపై హింసను సమర్థించిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

గతంలో మురళీధరన్‌ ఓ వర్గంపై చేసిన వ్యాఖ్యల కారణంగా '800'లో విజయ్‌ నటించడాన్ని కొన్ని వర్గాలు తప్పుపట్టాయి. దీంతో ఈ చిత్రం రాజకీయంగా వివాదంలో చిక్కుకుంది. తమిళనాడుకు చెందిన అనేక రాజకీయ పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై మురళీధరన్​ స్పష్టతనిచ్చినా విమర్శలు ఆగకపోవడం వల్ల.. సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తోన్న విజయ్‌ కెరీర్‌ ప్రమాదంలో పడుతుందనే ఉద్దేశంతో తన సినిమా నుంచి తప్పుకోమని ముత్తయ్య మురళీధరన్‌ తాజాగా కోరారు.

"నా బయోపిక్‌ వివాదాల్లో చిక్కుకున్న నేపథ్యంలో నేను ఈ ప్రకటన చేస్తున్నా. విజయ్‌ సేతుపతికి వ్యతిరేకంగా అనేక మంది వ్యాఖ్యలు చేస్తున్నారు. '800' సినిమా నుంచి తప్పుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ నటుడి కెరీర్‌ను నాశనం చేయడం నాకు ఇష్టం లేదు. ఇందులో నటిస్తే ఆయనకు భవిష్యత్తులోనూ సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని విజయ్‌ సేతుపతిని కోరుతున్నా".

- మురళీధరన్​, శ్రీలంక దిగ్గజ స్పిన్నర్​

"నేను జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశా. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగడం వల్లే ఇవాళ ఈ స్థాయిలో ఉన్నా. నా బయోపిక్‌ యువతలో స్ఫూర్తినింపుతుందని భావించా. కానీ అది ఆగిపోయింది. దర్శక, నిర్మాతలు సమస్యల్ని పరిష్కరించి, సినిమాను ప్రేక్షకులకు చేరవేస్తారని ఆశిస్తున్నా. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన వస్తుంది. నిర్మాతల నిర్ణయాన్ని నేనెప్పుడూ గౌరవిస్తా" అని మురళీధరన్ పేర్కొన్నారు. దీనికి విజయ్‌ సేతుపతి స్పందిస్తూ.. 'థ్యాంక్యూ.. గుడ్‌బై' అని ట్వీట్‌ చేశారు.

Last Updated : Oct 20, 2020, 2:39 PM IST

ABOUT THE AUTHOR

...view details