Stay Order on Lock Upp show: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న "లాక్ అప్" షో ప్రసారంపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హిందీ నిర్మాత ఏక్తా కపూర్ సారథ్యంలో రూపొందించిన లాక్ అప్ షో ప్రసారం నిలిపివేయాలని కోరుతూ.. పిటిషనర్ సనోబర్ బేగ్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ సనోబర్ బేగ్ సమర్పించిన పత్రాలను పరిశీలించిన కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది.
తాను లాక్ అప్ షో ప్రోమో చూసినప్పుడు షాక్‌కి గురయ్యానని పిటిషనర్ బేగ్.. కోర్టుకు తెలియజేశారు. ఈ కాన్సెప్ట్ తనదని.. అందుకు సంబంధిత సంస్థ ప్రతినిధులతో చర్చించానని పేర్కొన్నారు. ఆ కాన్సెప్ట్‌తో ముందుకు వెళ్లవద్దని వారికి విజ్ఞప్తి చేసినట్లు కోర్టుకు వివరించారు. కానీ వారు పట్టించుకోకపోవడంతో పాటు.. షెడ్యూల్ ప్రకారం ప్రసారం చేయడానికి తమకు పూర్తి హక్కు ఉందని సవాలు చేశారని వెల్లడించారు. అందుకే తనకు న్యాయవ్యవస్థను ఆశ్రయించడం తప్ప మరో మార్గం లేదని పిటిషనర్ పేర్కొన్నారు. లాక్ అప్ షో ఈ నెల 27న ప్రసారం కావలసి ఉందని.. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మధ్యమాల్లో ప్రదర్శించడాన్ని నిషేధించాలని పిటిషినర్.. కోర్టుకు విన్నవించారు. బేగ్ విజ్ఞప్తి మేరకు ఆయన అందజేసిన డాక్యుమెంట్లను పరిశీలించి.. కోర్టు మధ్యంతర నోటీసులు జారీ చేసింది.