ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ అంటే తెలియనివారుండరు. వాట్సాప్ అనేది అన్ని గ్రూప్‌ల వారు ఉపయోగించుకునేందుకు వీలుగా తయారు చేశారు. దీనిని ఉపయోగించడం కూడా చాలా సులభంగా ఉంటుంది. అయితే లోతుగా పరిశీలిస్తే వాట్సాప్‌లో మనకు తెలియని కొన్ని ఉపయోగకరమైన ఫీచర్లు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మీకోసం..
గ్రూప్‌లలోని మెసేజ్‌లకు ప్రైవేట్‌గా రిప్లై
వాట్సాప్ గ్రూప్‌లో ఎవరైనా మెసేజ్ పెడితే వారికి పర్సనల్‌గా రిప్లై ఇవ్వాలనుకుంటాం. అప్పుడు ఆ వ్యక్ పెట్టిన మెసేజ్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే రిప్లై ప్రైవేట్లీ అనే ఆప్షన్ వస్తుంది. దాంతో మీరు రిప్లైను అనుకున్న ఒక వ్యక్తికే పెట్టవచ్చు. యాపిల్ ఫోన్లలో ఇది కొంత వేరేగా ఉంటుంది. గ్రూప్‌లో మనకు సందేహం ఉన్న చాట్ మీద హోల్డ్ చేసి మోర్ అనే ఆప్షన్‌ను మీద క్లిక్ చేసి రిప్లై ప్రైవేట్లీ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి వ్యక్తిగతంగా చాట్ చేసుకునే అవకాశం ఉంది. ఇలా మనం వాట్సాప్ గ్రూప్‌లో అందరికి కనిపించేలా రిప్లై ఇవ్వొద్దు అనుకున్నప్పుడు.. పర్సనల్‌గా చాట్ చేయవచ్చు.
చాలా సులభంగా వాయిస్ మెసెజెస్
మనలో చాలా మంది చాట్ చేయలేనప్పుడు వాయిస్ మెసేజెస్ పంపుతుంటారు. అలాంటి సమయంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటుంటారు. మైక్ మీద హోల్డ్ చేసి వాయిస్ రికార్డు చేస్తున్నప్పుడు కొన్నిసార్లు సరిగ్గా పంపలేం. అలాంటప్పుడు మనం పంపాలనుకున్న వాయిస్ మధ్యలోనే ఆగిపోతుంది. వాయిస్ మెసేజ్‌ను పూర్తిగా పంపలేము. ఈ సమస్య నుంచి బయటపడటానికి వాట్సాప్‌లో ఒక ఆప్షన్ ఉంది. మైక్ ఐకాన్‌ను హోల్డ్ చేసి పైకి స్వైప్ చేస్తే మనం బటన్‌ను పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. కావాల్సినంత సేపు వాయిస్ రికార్డు చేసుకోవచ్చు. మధ్యలో రికార్డింగ్‌ను ఆపి వాయిస్ ప్రివ్యూ కూడా చేసుకోవచ్చు. మనం రికార్డు చేసిన దానిని డిలీట్ కూడా చేసుకునే సౌలభ్యం కూడా ఉంది.
కావాల్సిన టెక్ట్స్‌ని ప్రత్యేకంగా చూపించవచ్చు
మనం ఏదైనా మెసేజ్‌ను పంపుతున్నప్పుడు దానిలో కొన్ని ముఖ్యమైన పదాలుంటాయి. దానిని ప్రత్యేకంగా పెట్టాలనుకుంటాం. అలాంటి వాటి కోసం వాట్సాప్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. మనం పంపిన సందేశంలో ముఖ్యమైన వాక్యాన్ని లేదా పదాన్ని ప్రత్యేకంగా పెట్టాలి అనుకున్నప్పుడు కింద చెప్పినట్లు చేయాలి.
- పదం లేదా వాక్యానికి రెండు చివరలలో స్టార్(*) పెడితే అది బోల్డ్ అయ్యి ప్రత్యేకంగా కనిపిస్తుంది.
- పదాలను ఇటాలిక్గా పెట్టాలనుకుంటే వాక్యాల చివరన అండర్స్కోర్ (_) పెడితే అది ఇటాలిక్గా మారుతుంది.
- అలాగే టెక్ట్స్‌ను స్ట్రైక్‌త్రూ చేయాలనుకుంటే ఇరువైపులా టిల్డెస్ (~) ను పెడితే అది ప్రత్యేకంగా మారుతుంది.