Twitter Audio Video Call Feature : ట్విట్టర్ (ఎక్స్)ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచే.. ఆ సంస్థలో భారీ మార్పులకు స్వీకారం చుట్టారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. సరికొత్త ఫీచర్లను యాప్‌లో ప్రవేశపెడుతూ.. తనదైన శైలిలో ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని ఫీచర్లను యాప్‌లో అందుబాటులోకి తీసుకురాగా.. మరికొన్ని ప్రయోగదశలో ఉన్నాయి. ట్విటర్ సబ్‌స్క్రిప్షన్‌కు సైతం వినియోగదారుల నుంచి నెమ్మదిగా ఆదరణ పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే మరిన్ని ఫీచర్లను యూజర్లకు అందించేందుకు సిద్ధమవుతోంది ట్విట్టర్. దాంట్లో ముందుగా చెప్పుకోవాల్సింది ఆడియో, వీడియో కాల్ ఫీచర్ గురించి.
ఆడియో, వీడియో కాల్ ఫీచర్‌పై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ట్విట్టర్లో ఆడియో, వీడియో కాల్‌కు సంబంధించి కొద్ది రోజుల క్రితం ఆ సంస్థసీఈఓ లిండా యాకరినో ఓ ప్రకటన విడుదల చేశారు. త్వరలోనే ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌లో వీడియో కాలింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు అప్పుడే అధికారికంగా ప్రకటించారు. ఈ ఫీచర్ వచ్చిన తరువాత యూజర్లు తమ ఫోన్ నంబర్‌ను ఇతరులతో పంచుకోకుండానే వీడియో కాలింగ్ చేసుకోవచ్చని ఆమె స్పష్టం చేశారు. కాగా మరికొద్ది రోజుల్లోనే ఈ ఫీచర్‌ను యాప్‌లో తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది ట్విట్టర్ యాజమాన్యం.
ప్రముఖ టెక్ నిపుణులు క్రిస్ మెస్సినా దీనికి సంబంధించి మరో వార్త అందించారు. ఎక్స్(ట్విట్టర్)లో ఆడియో, వీడియోలకు సపోర్ట్ చేసే.. ఓ కోడ్ ఆయన రివీల్ చేశారు. కొద్ది రోజుల్లోనే ఆడియో, వీడియో కాల్ ఫీచర్‌ను ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌లో(ట్విట్టర్)లో ప్రవేశపెట్టనున్నట్లు క్రిస్ మెస్సినా ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్(ట్విట్టర్) సీఈఓ లిండా యాకరినో నుంచి సూచనలు అందినట్లు కూడా ఆయన వివరించారు.