వాట్సాప్.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగిస్తున్న మెసేజింగ్ యాప్. ఇటీవల కాలంలో విభిన్న ఫీచర్లతో మరింతగా ఆకర్షిస్తున్న ఈ యాప్‌లో.. ఓ బగ్‌ను బయటపెట్టాడు భారత్‌కు చెందిన బగ్ బౌంటీ హంటర్ అథుల్ జయరామ్. ఈ ఫీచర్‌లోని లోటుపాట్లను ఓ ప్రైవేట్ ఛానెల్ ద్వారా వివరించాడు. వెంటనే స్పందించిన సంస్థ.. రోజుల వ్యవధిలో సమస్యను పరిష్కరించింది. అంతేకాకుండా అథుల్ను ప్రశంసించింది.
ఇక్కడ వచ్చింది సమస్య...
వాట్సాప్ యాప్‌లో 'క్లిక్ టు చాట్' ఫీచర్ ద్వారా యూజర్లు అవతలి వ్యక్తి ఫోన్ నంబర్‌ను తమ ఫోన్లో సేవ్ చేసుకోకుండానే సందేశం పంపొచ్చు. లేదా ఫోన్ చేయొచ్చు. సరిగ్గా ఇదే ఆ వాట్సాప్ యూజర్‌ను రిస్క్‌లో పడేస్తుందని చెప్పాడు అథుల్. దీని ద్వారా వినియోగదారుల వాట్సాప్ నంబర్ గూగుల్ సెర్చ్‌లో కనిపిస్తుందని చెప్పాడు. ఇలా తాను సుమారు 3 లక్షల ఫోన్ నంబర్లను కనుగొన్నట్లు చెప్పాడు. ఈ ఫీచర్ ఎక్కువగా బిజినెస్ చేసే వ్యక్తులు తమ కస్టమర్లతో సంప్రదించేందుకు వాడతారని చెప్పాడు.
నష్టమేంటి?
గూగుల్ సెర్చ్‌లో కేవలం ఫోన్ నంబర్ మాత్రమే దొరుకుతుందని, ఇతర వివరాలేవీ లభించవని చెబుతున్నాడు ఈ హంటర్. అయితే, ఈ మాత్రం దొరికినా యూజర్లకు రిస్కేనని చెబుతున్నాడు. మీ ఫోన్ నంబర్ ఆధారంగా మీ ప్రొఫైల్ ఫొటోను కనుగొనవచ్చని (పబ్లిక్‌గా పెడితే) అంటున్నాడు. ఆ ఫొటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయడం ద్వారా యూజర్‌కు సంబంధించిన ఇతర సోషల్‌మీడియా ఖాతాల ద్వారా అతడి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. లేదా సదరు సైబర్ నేరగాడు నేరుగా సందేశాలు పంపించి మోసాలకు పాల్పడొచ్చని చెబుతున్నాడు.