మెసెంజర్ నుంచి వాట్సాప్ కాంటాక్టులకు సందేశాలు పంపగలిగేలా కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది ఫేస్బుక్.
మెసెంజర్‌ను వాట్సాప్‌తో అనుసంధానం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఫేస్బుక్ ఇదివరకే ప్రకటించింది. తాజాగా ఈ రెండు యాప్‌ల మధ్య కమ్యునికేషన్‌ను అభివృద్ధి చేసేందుకు కసరత్తులు చేస్తున్నట్లు ఓ టెక్ వెబ్సైట్ పేర్కొంది.
ప్రక్రియ ఇదే..
ఇతర వాట్సాప్ యూజర్లతో చాటింగ్ చేయడానికి లోకల్ డేటాబేస్‌లోని కొన్ని కోడ్లు సహకరిస్తాయని అలెస్సాండ్రో పలుజ్జీ అనే డెవలపర్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ వెబ్సైట్ కథనం ప్రచురించింది. ఈ కోడ్ ద్వారా వాట్సాప్ కాంటాక్ట్ బ్లాక్ చేశారో లేదో అన్న విషయం కూడా ఫేస్‌బుక్‌కు తెలుస్తుందని పేర్కొంది. పుష్ నోటిఫికేషన్లు, చాటింగ్ వివరాలనూ తెలుసుకోవచ్చని స్పష్టం చేసింది.
చాట్‌ను ఆర్కైవ్ చేసినట్లైతే ఈ కోడ్ సాయంతో కాంటాక్ట్ నెంబర్లను మెసేంజర్ సేకరించవచ్చని వెబ్సైట్ వివరించింది. యూజర్ల ప్రొఫైల్ పిక్చర్లను చూడొచ్చని తెలిపింది. యూజర్ ఏదైనా వాట్సాప్ గ్రూప్‌లో ఉన్నారా అనే విషయాన్ని తెలుసుకోవచ్చని స్పష్టం చేసింది.
ఈ కోడ్ లైవ్‌లోకి రాగానే సిగ్నల్ ప్రోటోకాల్‌ను ఫేస్బుక్ దిగుమతి చేసుకొని మెసేజ్‌లను ఎన్‌క్రిప్ట్, డీక్రిప్ట్ చేస్తుందని నివేదిక తెలిపింది. సిగ్నల్ ప్రోటోకాల్(ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్) ఇప్పటికే వాట్సాప్‌లో అందుబాటులో ఉంది.
అయితే వినియోగదారుల సమాచార భద్రత, డేటా ఎన్క్రిప్షన్లపై రాజీ పడకుండా ఈ ప్రక్రియను ఎలా చేపడుతున్నామనే విషయాన్ని ఫేస్బుక్ వెల్లడించలేదని వెబ్సైట్ గుర్తు చేసింది. ఈ ఫీచర్‌ను డిసేబుల్ చేసే ఆప్షన్‌ను ఫేస్బుక్ ఇస్తుందో లేదో స్పష్టత లేదని పేర్కొంది. ఇలాంటి సంక్లిష్టతల కారణంగా ఫేస్బుక్ ఈ ఫీచర్‌ను రద్దు చేయడానికే ప్రయత్నించవచ్చని అభిప్రాయపడింది. ఒకవేళ ఈ రెండు యాప్‌ల మధ్య అనుసంధానాన్ని ఏర్పరచినా... వాట్సాప్ మెసేజ్‌లు పూర్తిగా ఎన్క్రిప్టెడ్గానే ఉంటాయని స్పష్టం చేసింది.
ఇన్‌స్టా మెసెంజర్
ఇన్స్టాగ్రామ్ సైతం ఫేస్బుక్ మెసెంజర్‌తో అనుసంధానం చేసేందుకు ప్రయత్నిస్తోందని పలుజ్జీ వెల్లడించారు. ఇన్స్టాగ్రామ్ డీఎం(డైరెక్ట్ మెసేజ్) ఫీచర్ ద్వారానే కాకుండా.. మెసెంజర్‌ను ఉపయోగించి కూడా చాట్ వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు.
ఇదీ చదవండి-వన్‌ప్లస్ నార్డ్ ఫీచర్స్ లీక్- ధర ఎంతో తెలుసా?