సరికొత్త రీతిలో వినియోగదారులకు సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది ఫుడ్ డెలివరీ దిగ్గజ సంస్థ స్విగ్గీ. దీనిలో భాగంగానే ఆహారం చేరవేసేందుకు డ్రోన్లను ఉపయోగించుకోవాలని చూస్తోంది. ఆ దిశగా ప్రయత్నాలు కూడా ప్రారంభించింది. డ్రోన్ కంపెనీ ఏఎన్ఆర్ఏ టెక్నాలజీతో జట్టుకట్టిన స్విగ్గీ.. ఇప్పటికే భారత్‌లో ట్రయల్స్ ప్రారంభించింది. ఇందుకోసం.. రక్షణ మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సహా డీజీసీఏ అనుమతులు కూడా లభించాయి.
జూన్ 16న ప్రయోగాత్మకంగా పరిశీలించింది కూడా. పంజాబ్, ఉత్తర్ప్రదేశ్ల్లోని అన్ని జిల్లాల్లో ట్రయల్స్ నిర్వహించి.. ఆ తర్వాత పూర్తి స్థాయిలో డ్రోన్ల ద్వారా ఫుడ్ డెలివరీని ప్రారంభించనున్నట్లు ఏఎన్ఆర్ఏ స్పష్టం చేసింది. ఫుడ్‌తో పాటు ఔషధాలు కూడా డెలివరీ చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
డ్రోన్ల ద్వారా చేసిన ఫుడ్ డెలివరీకి సంబంధించి ఓ 3 నిమిషాల వీడియోను కూడా షేర్ చేసింది.