Smartphone Buying Tips In Telugu :పండుగలు వచ్చాయంటే స్మార్ట్ఫోన్ల మీద భారీ ఆఫర్లు వస్తుంటాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు పలు ఈ-కామర్స్ వెబ్సైట్లు స్మార్ట్ ఫోన్ల మీద భారీగా డిస్కౌంట్లు ప్రకటిస్తుంటాయి. దీంతో చాలామంది స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయాలనుకుంటారు. అయితే కొత్త స్మార్ట్ ఫోన్లు కొనాలని చూస్తున్న వాళ్లు ఈ అంశాలను కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.
- ఆపరేటింగ్ సిస్టం:
మొబైల్ కొనుగోలు చేసే సమయంలో గుర్తించుకోవాల్సిన ముఖ్య విషయాల్లో ఒకటి ఆపరేటింగ్ సిస్టం. ప్రస్తుతం మార్కెట్లో ఆండ్రాయిడ్, iOS అనే ఆపరేటింగ్ సిస్టంలతో మొబైళ్లు అందుబాటులో ఉన్నాయి. చాలా వరకు ఫోన్లు ఆండ్రాయిడ్‌తో వస్తుండగా, యాపిల్ కంపెనీ ఫోన్లలో iOS ఆపరేటింగ్ సిస్టం ఉంటుంది. అయితే ఫోన్ తీసుకునే ముందు ఏ ఆపరేటింగ్ సిస్టం అవసరం, అనుకూలం అనే విషయాన్ని గుర్తించాలి. మన అవసరాన్ని బట్టి ఆపరేటింగ్ సిస్టంను ఎంచుకోవాలి. - డిస్ప్లే:
స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేసే సమయంలో గుర్తించుకోవాల్సిన మరో ముఖ్యమైన అంశం డిస్ప్లే. సాధారణంగా 5.5- 6 అంగుళాలు కలిగిన HD మరికొన్ని QHD డిస్ప్లేలు తీసుకోవడం మంచిది. ఇలాంటి డిస్ప్లేలు గేమ్స్ అడుతున్నప్పుడు, వీడియో స్ట్రీమింగ్ చేస్తున్నప్పుడు మీకు మంచి అనుభూతిని ఇస్తాయి. - బ్యాటరీ:
స్మార్ట్ ఫోన్ ఎంత బాగా ఉన్నా ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ లేకపోతే ప్రయోజనం ఉండదు. అందుకే 3500mAh బ్యాటరీ లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను ఎంచుకోవడం ఉత్తమం. - స్టోరేజీ:
స్మార్ట్‌ఫోన్ అంటే కేవలం కాల్స్ కోసమే కాదు, వీడియోలు, ఫోటోలు తీసుకోవడం కోసం కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి వీటన్నింటిని స్టోర్ చేసుకునే కెపాసిటీ చాలా ముఖ్యం. అవసరాలకు తగ్గట్టుగా 128జీబీ లేదా 256జీబీ స్టోరేజీ ఉండే స్మార్ట్‌ఫోన్‌ను ఎంచుకోవాలి. - కెమెరా:
స్మార్ట్ ఫోన్లో ఎక్కువ మంది పరిగణలోకి తీసుకునే అంశాల్లో కెమెరా కచ్చితంగా ఉంటుంది. ఫొటోలు తీసుకునే వారికి, వీడియో, వ్లాగ్‌లు షూట్ చేసే వారు కెమెరా క్వాలిటీ బాగుండాలనుకుంటారు. అయితే చాలా మంది కెమెరా మెగాపిక్సెల్ ఎంత ఉంది అని మాత్రమే చూస్తారు. కానీ అపెర్చర్, షట్టర్ స్పీడ్, ఇమేజ్ స్టెబిలైజేషన్, ఆటోఫోకస్ వంటి ఫీచర్లు ఉన్నాయో లేదో కూడా చూసుకోవాలి. వీలైతే ఈ ఫీచర్లలో అప్డేట్ వెర్షన్లను ఎంపిక చేసుకోవాలి. - కనెక్టివిటీ:
స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు యుఎస్బీ ఇంటర్ ఫేస్, వైఫై కనెక్టివిటీ, లేటెస్ట్ బ్లూటూత్ వెర్షన్, (జీపీఎస్, గ్లోనాస్, బైడూ, గెలీలియో, QZSS) లొకేషన్ టెక్నాలజీ లాంటి సాంకేతిక పరమైన అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి.
ఫోన్ కొనుగోలు చేసే సమయంలో పైన పేర్కొన్న ఆరు అంశాలను పరిగణలోకి తీసుకొని, అవసరాలకు తగిన వాటిని ఎంచుకోవాలి.