అలెక్సాతో భారతీయ వినియోగదారుల సంభాషణ 2020లో 67 శాతం పెరిగిందని అమెజాన్ వెల్లడించింది. భారత్లో అలెక్సాను ప్రవేశపెట్టి మూడేళ్లయిన సందర్భంగా ఆసక్తికరమైన గణాంకాలను వెలువరించింది. 2020లో సగటున రోజుకు 19 వేల సార్లు కస్టమర్లు అలెక్సాకు 'ఐ లవ్ యూ' చెప్పారని తెలిపింది. 2019తో పోలిస్తే ఇది 1200 శాతం అధికమని పేర్కొంది.
2020లో దేశంలోని 85 శాతం పిన్కోడ్లకు చెందిన ప్రజలు అలెక్సాను కొనుగోలు చేశారని అమెజాన్ తెలిపింది. ఎక్కువ శాతం నాన్-మెట్రో నగరాల ప్రజలే అలెక్సాను కొన్నారని వెల్లడించింది. భారత్లో 50 శాతం వినియోగదారులు నాన్-మెట్రో నగరాలకు చెందినవారేనని పేర్కొంది.
"మాకు ఇప్పటికీ తొలిరోజులాగే ఉంది. ఇకపైనా అలెక్సాను మరింత మెరుగుపరుస్తాం. కస్టమర్ల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని కొత్త ఫీచర్లను పొందుపరుస్తూనే ఉంటాం. స్థానికులు మాట్లాడే విషయాలను అర్థం చేసుకొని స్పందించేలా అలెక్సాను అభివృద్ధి చేస్తాం."
-పునీశ్ కుమార్, అలెక్సా ఇండియా లీడర్