PhonePe Launches Indus Appstore : గూగుల్, యాపిల్ స్టోర్లకు పోటీగా ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే (PhonePe).. 'ఇండస్ యాప్ స్టోర్'ను లాంఛ్ చేసింది. యాప్ డెవలపర్ల కోసం ఈ సరికొత్త వేదికను అందుబాటులోకి తెచ్చినట్లు స్పష్టం చేసింది.
Indus Appstore : డెవలపర్లు తమ అప్లికేషన్లను (యాప్) ఇండస్ యాప్‌స్టోర్‌లో లిస్ట్ చేయాలని కోరింది. అది కూడా పూర్తి ఉచితంగా. ఇండస్ యాప్‌స్టోర్ త్వరలో 12 స్థానిక భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు ఫోన్‌పే వెల్లిడించింది.
గుత్తాధిపత్యాన్ని దెబ్బకొట్టేందుకే!
ప్రస్తుతం మార్కెట్లో గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ స్టోర్ల హవా నడుస్తోంది. వీటి గుత్తాధిపత్యం రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలోనే ఫోన్‌పే వాటికి ధీటైన సవాల్ విసురుతూ.. మార్కెట్లోకి తన సరికొత్త యాప్‌స్టోర్‌ను తీసుకొచ్చింది.
లిస్ట్ చేయడం ఎలా?
ఆండ్రాయిడ్ డెవలపర్లు ఇండస్ యాప్ స్టోర్‌లో రిజిస్టర్ చేసుకోవాలంటే.. ముందుగా www.indusappstore.com వెబ్సైట్ ఓపెన్ చేయాలి. తరువాత రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తరువాత తాము రూపొందించిన యాప్స్‌ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఇది అంతా ఉచితం అని ఫోన్‌పే స్పష్టం చేసింది.
ఉచితం!
ఫోన్‌పే యాప్‌స్టోర్ ఫీజు విషయంలో ఒక స్పష్టత ఇచ్చింది. తొలి ఏడాది డెవలపర్స్ నుంచి ఎలాంటి ఫీజు వసూలు చేయమని స్పష్టం చేసింది. అయితే మరుసటి సంవత్సరం నుంచి స్వల్ప మొత్తంలో ఫీజు వసూలు చేసే అవకాశం ఉందని పేర్కొంది. అయితే యాప్ డెవలపర్స్ నుంచి ఎలాంటి ప్లాట్‌ఫాం ఫీజుగానీ, ఇన్-యాప్ పేమెంట్‌పై కమిషన్ తీసుకోమని స్పష్టం చేసింది.
నచ్చిన పేమెంట్ గేట్‌వే!
గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ స్టోర్లలో డిఫాల్ట్ పేమెంట్ గేట్వేస్ మాత్రమే ఉంటాయి. వీటిని ఉపయోగించి మాత్రమే పేమెంట్స్ అన్నీ పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనివల్ల యూజర్లకు ఇబ్బందులు తప్పడంలేదు. అందుకే ఫోన్‌పే.. యూజర్లు తమకు నచ్చిన పేమెంట్ గేట్‌వేను పూర్తి ఉచితంగా ఇంటిగ్రేట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.
డెవలపర్స్‌కు గుడ్ న్యూస్
గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ స్టోర్స్.. ఇన్-యాప్ పర్చేజెస్పై 30 శాతం వరకు కమీషన్ వసూలు చేస్తున్నాయి. పైగా నచ్చిన పేమెంట్ గేట్‌వేను లేదా పేమెంట్ ప్రాసెసింగ్ సిస్టమ్‌ను ఎంచుకోవడానికి వీలు లేకుండా చేస్తున్నాయి. వీటిపై డెవలపర్ల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అందుకే వాళ్లకు అనువుగా ఉండే విధంగా.. ఇండస్ యాప్‌స్టోర్‌ను తీసుకొచ్చినట్లు ఫోన్‌పే చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ ఆకాశ్ డోంగ్రే తెలిపారు.