Ola electric car specifications : ఒక్కసారి ఛార్జింగ్‌తో 500 కిలోమీటర్ల ప్రయాణం.. 4 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల సత్తా.. భారత్‌లో ఇప్పటివరకు ఎన్నడూ డిజైన్ చేయని స్పోర్టీ లుక్.. ఆల్ గ్లాస్ రూఫ్.. కీ లెస్.. త్వరలో మార్కెట్లోకి రానున్న ఓలా ఎలక్ట్రిక్ కార్ ఫీచర్లు ఇవి. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు ఆ సంస్థ సీఈఓ భవీష్ అగర్వాల్.
స్వాతంత్ర్య వజ్రోత్సవాల వేళ ఓలా ఎలక్ట్రిక్ భవిష్యత్ ప్రణాళికల్ని వెల్లడించారు భవీష్. సోమవారం 'మిషన్ ఎలక్ట్రిక్ 2022' పేరిట నిర్వహించిన కార్యక్రమంలో.. విద్యుత్ కార్ సహా ఇతర కొత్త ఉత్పత్తుల వివరాలను తెలియజేశారు. ఈవీల ప్రేమికులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఓలా విద్యుత్ కార్‌పై అధికారిక ప్రకటన చేశారు. ఆ వాహనం ఫీచర్లు ఎలా ఉండనున్నాయో సంక్షిప్తంగా చెప్పారు. ఒక చిన్నపాటి హ్యాచ్ బ్యాక్ సైజులో, తాళాలు, హ్యాండిల్స్ లేకుండా ఉంటుందని వివరించారు. మూవ్ ఓఎస్‌తో పనిచేస్తూ, అసిస్టెడ్ డ్రైవింగ్ ఫీచర్స్‌తో.. ప్రపంచంలోని ఇతర ఈవీలకు దీటుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అయితే.. ఓలా విద్యుత్ కారుకు సంబంధించి ఆయన పూర్తి వివరాలు వెల్లడించలేదు. 2024లో ఈ వాహనం అందుబాటులోకి వచ్చే అవకాశముంది.