మనుషులను తిరిగి చందమామ వద్దకు తీసుకెళ్లే సన్నాహాల్లో భాగంగా అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా చేపట్టిన మానవరహిత ఆర్టెమిస్-1 యాత్ర దిగ్విజయంగా పూర్తయింది. ఈ ప్రాజెక్టులో భాగంగా పయనమైన ఒరాయన్ క్యాప్సూల్.. జాబిల్లిని చుట్టి, అనుకున్న రీతిలో ఆదివారం క్షేమంగా భూమికి తిరిగొచ్చింది. అపోలో-17 పేరిట చివరిసారిగా మానవులు చంద్రుడిపై కాలుమోపి 50 ఏళ్లు పూర్తయిన రోజునే ఈ పరిణామం జరగడం విశేషం. ఆర్టెమిస్-1ను నాసా ప్రయోగాత్మకంగా చేపట్టింది. ఒరాయన్.. మానవులను చంద్రుడిపైకి చేరవేసి, తిరిగి సురక్షితంగా భూమికి తీసుకురాగలదా అన్నది పరీక్షించడం దీని ఉద్దేశం. అందువల్ల ఈ దఫా ఆ క్యాప్సూల్‌లో మానవులకు బదులు మూడు డమ్మీలను ఏర్పాటు చేశారు. అందులో వివిధరకాల డేటా సేకరణకు సెన్సర్లను ఏర్పాటు చేశారు.
- ఒరాయన్‌ను నవంబరు 16న నింగిలోకి పంపారు. శక్తిమంతమైన స్పేస్ లాంచ్ సిస్టమ్ (ఎస్‌ఎల్‌ఎస్) రాకెట్‌పైన దీన్ని ఉంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు.
- అనంతరం ఎస్‌ఎల్‌ఎస్ నుంచి విడిపోయిన ఒరాయన్.. చంద్రుడి దిశగా పయనాన్ని ఆరంభించింది. నవంబరు 25న జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించింది. డిసెంబర్ 1న బయటకు వచ్చేసింది. ఈ క్రమంలో చందమామ ఉపరితలానికి 127 కిలోమీటర్ల దూరం వరకూ వెళ్లింది.
- కొద్దిరోజుల కిందట ఒరాయన్ ప్రధాన ఇంజిన్‌ను 3.5 నిమిషాల పాటు మండించడం ద్వారా దాన్ని భూమి దిశగా తిరుగుప్రయాణానికి సన్నద్ధం చేశారు. ఆదివారం రాత్రి ఈ క్యాప్సూల్.. గంటకు 39,400 కిలోమీటర్ల వేగంతో భూవాతావరణంలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో వాతావరణ రాపిడి వల్ల దాదాపు 3వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను ఒరాయన్ ఎదుర్కొంది.
- వ్యోమనౌకకు ఏర్పాటు చేసిన ఉష్ణ కవచం ఈ వేడి నుంచి రక్షించింది. అనంతరం పారాచూట్లు క్రమపద్ధతిలో విచ్చుకొని, ఒరాయన్ వేగాన్ని తగ్గించాయి. అంతిమంగా వేగం గంటకు 30 కిలోమీటర్లకు తగ్గింది.
- మెక్సికోకు చెందిన గ్వాడాలూప్ దీవి సమీపాన పసిఫిక్ మహాసముద్రంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 11.10 గంటలకు ఈ వ్యోమనౌక దిగింది. మొత్తం మీద ఒరాయన్.. 14 లక్షల మైళ్లు ప్రయాణించింది. పుడమి నుంచి 4.32 లక్షల కిలోమీటర్ల దూరం వెళ్లింది. మానవ రవాణా యోగ్యత ఉన్న ఒక వ్యోమనౌక ఇంత దూరం వెళ్లడం ఇదే మొదటిసారి.