అన్ని రంగాల్లో స్వదేశీ పరిజ్ఞానంతో సాంకేతికతను అభివృద్ధి చేయాలన్న ప్రధానమంత్రి పిలుపుతో.. భారత శాస్త్రవేత్తలు ముందుకు సాగుతున్నారు. అతితక్కువ ఖర్చుతో స్వదేశీ స్పెక్ట్రోగ్రాఫ్‌ను అభివృద్ధి చేశారు. ఇది విశ్వంలోని సుదూర గెలాక్సీల నుంచి కాంతి వనరులు, నక్షత్ర మండలాల చుట్టూ ఉండే భారీ కృష్ణబిలాల వంటి వాటిని అత్యంత స్పష్టతతో గుర్తిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
డాట్ టెలిస్కోప్‌లో ఏర్పాటు
దిగుమతి చేసుకునే వాటితో పోలిస్తే సూమారు 2.5 రెట్లు తక్కువగా రూ.4 కోట్ల వరకు ధర ఉంటుంది. అత్యంత తక్కువ ఫోటాన్ రేటుతో ఫోటాన్/సెకండ్‌తో కాంతిని గుర్తిస్తుంది. భారత్‌లో ఇప్పటికే ఉన్న ఖగోళ స్పెక్ట్రోగ్రాఫ్లతో పోలిస్తే ఇది అతిపెద్దది. ఉత్తరాఖండ్‌లోని నైనితాల్‌లో ఏర్పాటు చేసిన 3.6ఎం దేవస్థల్ ఫాస్ట్ ఆప్టికల్ టెలిస్కోప్(డాట్)లో అమర్చారు. ఇది దేశంలోనే కాదు ఆసియాలోనే అతిపెద్దదిగా గుర్తింపు పొందింది.
ఏడీఎఫ్ఓఎస్సీగా నామకరణ..
ఇప్పటివరకు ఇలాంటి అత్యంత విలువైన స్పెక్ట్రోస్కోప్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ప్రస్తుతం స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన స్పెక్ట్రోగ్రాఫ్కు.. 'ఏరీస్-దేవస్థల్ ఫేయింట్ ఆబ్జెక్ట్ స్పెక్ట్రోగ్రాఫ్'(ఏడీఎఫ్ఓఎస్సీ)గా నామకరణం చేశారు. దీనిని నైనితాల్‌లోని ఆర్యభట్ట రీసర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్స్(ఏఆర్ఐఈఎస్)లో అభివృద్ధి చేశారు.