కొత్త మోడల్ విడుదలైన ప్రతిసారీ పాత ఫోన్ అమ్మేసి కొత్త ఫోన్ కొనుగోలు చేయడం అందరికీ సాధ్యపడదు. కొంత మంది ఏడాదికో మోడల్ ఫోన్ మారుస్తుంటే.. మరికొంతమంది ఏళ్ల తరబడి ఒకే మోడల్ ఫోన్ ఉపయోగిస్తుంటారు. అయితే, పాత ఫోన్ కొన్నాళ్లు వాడిన తర్వాత దాని పనితీరు నెమ్మదిస్తుంది. తరచూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంతమాత్రన ఫోన్ మార్చాల్సిన అవసరం లేదు. కేవలం చిన్నపాటి మార్పులు చేసుకుంటే సరిపోతుంది. మరి పాత ఆండ్రాయిడ్ ఫోన్ పనితీరును ఎలా మెరుగుపరుచుకోవాలి? అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
అలాంటి యాప్స్‌కు గుడ్‌బై
అవసరానికో అబద్ధం అన్నట్లుగా ఇప్పుడు ప్రస్తుత జీవనశైలిలో అవసరానికో యాప్ తయారైంది. ఆర్థిక లావాదేవీల నుంచి ఆన్‌లైన్ క్లాసుల వరకు.. గేమ్స్ నుంచి షాపింగ్ వరకు ప్రతి అవసరానికీ మొబైల్ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటిలో చాలా వరకు మనం ఒకసారి కంటే ఎక్కువసార్లు ఉపయోగించం. అలాంటి యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి. అనవసరమైన ఇలాంటి యాప్స్ వల్ల ఫోన్ స్టోరేజీ నిండిపోతుంది. వీటిలో కొన్ని రకాల యాప్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుండటం వల్ల ఫోన్ స్లో అవుతూ ఉంటుంది. అందుకే ఫోన్‌లో మీకు అవసరంలేని యాప్స్ ఏవైనా ఉంటే వెంటనే వాటినీ డిలీట్ చేయండి.
అలానే ఫోన్‌లో ప్రీ-ఇన్‌స్టాల్డ్‌గా వచ్చిన యాప్స్‌లో మీరు అవసరం లేనివి ఉంటే వాటిని డిజేబుల్ చెయ్యొచ్చు. అలాగే యాంటీ వైరస్, టాస్క్ కిల్లర్ యాప్స్ ఉంటే వాటిని కూడా తొలగించండి. గూగుల్ ప్లే ప్రొటెక్ట్ అనే ఫీచర్ గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే యాప్స్‌లో మాల్‌వేర్‌ను స్కాన్ చేసి తొలగిస్తుందని, అందుకోసం ప్రత్యేకంగా యాప్స్ అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. అలా మీరు ఉపయోగించని యాప్స్‌ను డిలీట్ చేస్తే ఫోన్ సామర్థ్యం మరింత మెరుగవుతుంది.
వాల్‌పేపర్.. విడ్జెట్స్ వద్దే వద్దు
మీరు పాత ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగిస్తుంటే.. దాని పనితీరు గతంలో కంటే నెమ్మదిస్తే లైవ్ వాల్‌పేపర్స్, విడ్జెట్స్‌ను డిలీట్ చేయడం ఉత్తమం. ప్రస్తుత ఫోన్లలో ర్యామ్, ఆధునిక ప్రాసెసర్లతో వస్తుండటం వల్ల వాటికి అనుగుణంగా లైవ్ పేపర్స్, విడ్జెట్స్ వంటి పీచర్లు ఇస్తున్నారు. అయితే కొన్ని పాత ఫోన్లలో ఓఎస్ అప్‌డేట్ చేసినప్పుడు ఈ ఫీచర్లు వస్తున్నాయి. ఇవి ఫోన్ హోం స్క్రీన్‌ను ఎంతో ఆకర్షణీయంగా మారుస్తున్నప్పటికీ పాత ఫోన్ల ర్యామ్, ప్రాసెసర్, బ్యాటరీ వంటి వాటి పనితీరుపై ప్రభావం చూపిస్తాయి. అందుకే వాటిని డిలీట్ చేయమని సూచిస్తున్నారు టెక్ నిపుణులు.
ఇదీ చదవండి:గూగుల్ క్రోమ్ వెంటనే అప్డేట్ చేసుకోండి.. లేదంటే..