ఇంట్లో నుంచి బయటకు అడుగుపెడితే చాలు... ముఖానికి మాస్క్ తప్పనిసరిగా మారింది. అయితే అలా వేసుకునే మాస్క్, వైరస్ సోకకుండా ఎంతవరకూ అడ్డుకోగలదనేది ప్రశ్నార్థకమే. అందుకే అనేక కంపెనీలు స్మార్ట్ మాస్క్‌ల తయారీకి శ్రీకారం చుట్టాయి. అలాంటివాటిల్లో ఒకటి ఎయిర్‌పాప్ యాక్టివ్ ప్లస్ స్మార్ట్ మాస్క్. ఇందులో అమర్చిన సెన్సర్, చుట్టుపక్కల వాతావరణంలోని గాలినాణ్యతను పరిశీలించి దానికి అనుసంధానమై ఉన్న ఫోను ఆప్‌కి పంపిస్తుంది. మాస్కులో ఉన్న ఫిల్టరు వాతావరణంలోని కలుషితాలను సైతం లోపలకు వెళ్లకుండా చేస్తుంది. కాబట్టి వైరస్ సోకకుండా పూర్తి రక్షణనిస్తుందట. ఎల్‌జీ ప్యూరీకేర్ వేరబుల్ ప్యూరిఫైర్ మాస్క్ కూడా ఈ కోవకే చెందుతుంది. ఇందులో అమర్చిన రెండు ఫిల్టర్లు 99.95 శాతం వైరస్‌నీ, బ్యాక్టీరియానీ నిరోధించడమే కాదు, ఇందులోని రెండు ఫ్యాన్లు శ్వాసకి ఇబ్బంది లేకుండానూ చేస్తాయి.
కొవిడ్ కాలంలో మాస్క్ ఎంత తప్పనిసరైనా ఫోను లేకుండా నిమిషం గడవదన్నది తెలిసిందే. కానీ మాస్క్ పెట్టుకుని ఫోను మాట్లాడటం కొంత ఇబ్బందికరమే. హెడ్‌సెట్ లేదా ఇయర్‌పాడ్స్ పెట్టుకున్నా ఎంతోకొంత అసౌకర్యంగానే ఉంటుంది. అందుకే ‘మాస్క్‌ఫోన్’ కంపెనీ రెండూ కలిసిన పరికరాన్ని తయారుచేసింది. ఇందులో ఎన్95 ఫిల్టర్‌తోపాటు వైర్‌లెస్ ఇయర్‌ఫోన్లూ మైక్రోఫోనూ కూడా ఉంటాయట. రేజర్ కంపెనీ మరో అడుగు ముందుకేసి మాస్క్‌తో మాట్లాడుతున్నా మాట స్పష్టంగా వినిపించేలా వాయిస్ ఆంప్లిఫయిర్‌తో ఉన్న స్మార్ట్ మాస్క్‌ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది.
హెల్త్ రిపోర్ట్ మీ చెంతే..
ఎంత స్మార్ట్ మాస్క్ పెట్టుకున్నా బయటకు వెళ్లినప్పుడు ఏ వైపు నుంచి కొవిడ్ సోకుతుందో అనే భయం వెంటాడుతూనే ఉంటుంది. అలాంటివాళ్లు ఈ బయో ఇంటెలెసెన్స్ కంపెనీ తయారుచేసిన బటన్‌ను ఛాతీ పై భాగంలో అతికించుకుంటే సరి... ఇది ఎప్పటికప్పుడు శరీర ఉష్ణోగ్రతనీ పల్స్ రేటునీ ఫోనులో చూపిస్తుంది. మూడునెలలపాటు నిరంతరాయంగా పనిచేసే ఈ బటన్ చెంత ఉంటే, ఎక్కడికి వెళ్లాలన్నా ప్రత్యేకంగా హెల్త్ రిపోర్ట్ అవసరం లేదు. దీనికి అనుసంధానమై ఉన్న ఆప్‌లో వివరాలన్నీ ఉంటాయి. ఒకవేళ శరీర ఉష్ణోగ్రత ఏ కాస్త పెరిగినా వెంటనే జాగ్రత్తపడొచ్చు.
టచ్‌లెస్ డోర్ బెల్
వ్యాక్సీన్ వచ్చినా కరోనా భయం కొంతకాలం వెంటాడుతుంటుంది. కానీ అవసరాన్ని బట్టి స్నేహితులూ బంధువుల ఇళ్లకు వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు- చేత్తో తలుపు కొట్టాలన్నా డోర్‌బెల్ మోగించాలన్నా భయం అనిపించడం సహజం. అందుకే ఇప్పుడు వాటిని టచ్ చేయకుండానే మ్యాట్‌మీద నిలబడితే చాలు, బెల్ దానంతటదే మోగేలా టచ్‌లెస్ వీడియో డోర్ బెల్‌ను తయారుచేసింది అలారం డాట్ కామ్ అనే సంస్థ. అర్లో అనే మరో కంపెనీ కూడా బ్యాటరీతో పనిచేసే డోర్‌బెల్‌ను రూపొందించింది. ఎవరైనా వచ్చి బెల్ ముందు నిలబడగానే అందులో ఉన్న కెమెరా వాళ్లను పసిగడుతుంది. ఆపై ‘నేను మీకోసం బెల్ మోగిస్తున్నా... ఒక్క నిమిషం వేచి ఉండండి’ అని ముందుగానే రికార్డు చేసిన వాయిస్ మెసేజ్ వినిపిస్తుంది. తరవాత డోర్ మోగుతుంది. సో, చేతులకి ఏమీ అంటదన్నమాట.
తడితే చాలు..
పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచేందుకూ ఎలాంటి ఇన్ఫెక్షన్లూ సోకకుండా ఉండేందుకు రోబోలూ మాస్క్‌లూ వంటి వాటిని యూవీలైట్లతో తయారుచేయడం సాధారణమైపోయింది. అయితే తాగే నీళ్లు కూడా అంతే పరిశుభ్రంగా ఉండేందుకన్నట్లు ఎల్‌జీ కంపెనీ ఇన్‌స్టా వ్యూ రిఫ్రిజిరేటర్‌ను తయారుచేసింది. పాక్షిక పారదర్శకంగా ఉండే దీని తలుపుమీద రెండుసార్లు తడితే చాలు... ఫ్రిజ్‌లోని యూవీ లైట్లు వెలగడంతో లోపలున్నవన్నీ చక్కగా కనిపిస్తాయి. పైగా ఆ లైట్లు లోపల బ్యాక్టీరియా చేరకుండా చేస్తాయి. ఇంకా ఇందులో అమర్చిన మైక్రోఫోనూ స్పీకర్ల వల్ల తాకకుండా కేవలం వాయిస్ కమాండ్స్ ద్వారానే ఫ్రిజ్ తలుపు తెరుచుకుని మూసుకునేలా చేయొచ్చట.