Types of Sand and Their Uses: ఇసుక బంగారం! ఆ మాటకొస్తే బంగారం కన్నా గొప్పదీనూ. విలువ పరంగా బంగారం గొప్పదే. కానీ వాడకం విషయంలో ఇసుక అంతకన్నా విలువైందంటే అతిశయోక్తి కాదు. గాలి, నీరు తర్వాత మనిషి అత్యధికంగా వినియోగిస్తున్న సహజ వనరు ఇదే మరి. రోజురోజుకీ దీనికి డిమాండ్ పెరుగుతూ వస్తోందే తప్ప తరగటం లేదు. మనం ఏటా 5వేల కోట్ల టన్నుల ఇసుకను వాడుకుంటున్నామని అంచనా. ఇదిలాగే కొనసాగితే 2060 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఇసుక డిమాండ్ 45% మేరకు పెరుగుతుందని నెదర్లాండ్స్ పరిశోధకుల తాజా లెక్కలు చెబుతున్నాయి. దీనికోసం మనిషి నదులు, సముద్ర తీరాలను విపరీతంగా తవ్వటం పర్యావరణానికి పెను ముప్పుగా పరిణమిస్తుందనీ హెచ్చరిస్తున్నారు. భవనాల మన్నిక కాలాన్ని పెంచటం, కాంక్రీటును తిరిగి వాడుకోవటం, తేలికైన భవనాల డిజైనింగ్, కలప ఫ్రేముల వంటి ప్రత్యామ్నాయ పదార్థాల వాడకం వంటివి చేపట్టకపోతే పెను ప్రమాదంలో పడక తప్పదని గుర్తుచేస్తున్నారు.
నిజానికి భూమ్మీద బోలెడంత ఇసుక ఉంది. సహారా నుంచి థార్ వరకు ఏడారుల నిండా ఇసుక దిబ్బలే. అయినా కూడా ఎందుకింత కొరత? రహస్యమంతా దీని వైవిధ్యంలోనే ఉంది. మనం ఎక్కువగా ఇసుకను కాంక్రీటు కోసం వాడుతుంటాం. దీనికి ఎడారి ఇసుక పనికిరాదు. ఇది చాలా నున్నగా, గుండ్రంగా ఉంటుంది. అందువల్ల బలంగా కలిసి ఉండలేదు. నిర్మాణాలకు పనికిరాదు. కాబట్టే నదులు, సముద్రాలు, సరస్సుల తీరాల ఇసుకకు డిమాండ్ పెరిగిపోతోంది.
ఈనాటిది కాదు
చూడటానికి పైకి ఇసుక అంతా ఒకేలా కనిపిస్తుంది. కానీ దీని రేణువులు రకరకాల ఆకారాల్లో, సైజుల్లో ఉంటాయి. వివిధ పదార్థాలతో తయారవుతాయి. వుడ్డెన్-వెంట్‌వర్త్ స్కేల్ ప్రకారం- 2 నుంచి 0.0625 మిల్లీమీటర్ల వ్యాసంతో ఉండి, గట్టి పదార్థంతో తయారైన రేణువును ఇసుకగా భావిస్తారు. ఇంతకీ ఇసుక ఎలా ఏర్పడుంది? రాళ్ల కోత వల్ల. గాలి, వాన, నీరు, సూక్ష్మక్రిములు, ఇతర బలాల వంటి ప్రభావంతో పర్వతాలు, గుట్టలు, రాళ్లు క్షీణిస్తూ వస్తాయి. చిన్న చిన్న రేణువులుగా మారి, రాళ్ల ఉపరితలం నుంచి విడిపోతాయి. వాన కురిసినప్పుడు నీటి ప్రవాహంతో కలిసి కిందికి వస్తాయి. కాలువలు, నదుల ద్వారా దూరదూరాలకు విస్తరిస్తూ.. చివరికి సముద్రాలకు చేరతాయి. ఈ క్రమంలోనే నదీ తీరాల వద్ద, నదులు సముద్రంతో కలిసే చోట ఇసుక మేట వేసుకుపోతుంది. శతాబ్దాలుగా నదులు తీరాలను ముంచెత్తటం, దిశను మార్చుకోవటం వంటివన్నీ ఇసుక పెద్ద మొత్తంలో పోగయ్యేలా చేస్తూ వచ్చాయి. ఇదంతా చాలా చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ. లక్షలాది సంవత్సరాలుగా ఇసుక ఒక అవక్షేపంగా (స్లిట్) భూగర్భంలో పొరలు పొరలుగా పరచుకొంటూ వస్తుంది. అవక్షేపం మనం చూసే ఇసుక కన్నా ఇంకా సన్నగా ఉంటుంది. ఇదే కొత్త పర్వతాలుగా మారుతుంది. ఈ పర్వతాల రాళ్లే క్షీణించి తిరిగి నేల మీదికి చేరుకుంటాయి. ఈ ప్రక్రియ మళ్లీ మళ్లీ పునరావృతమవుతూ వస్తుంటుంది. ఇసుక ఏర్పడటం, పోగుపడటం, భూమిలో నిక్షిప్తం కావటం, పర్వతాల రూపంలో తిరిగి పైకి రావటం, గాలి తాకిడికి క్షీణించటం, చిన్న చిన్న రేణువులుగా మారి నదులు, సముద్రాల్లోకి చేరటం.. ఇదంతా ఒక చట్రంలా కొనసాగుతూ వస్తుంది. ఒక చట్రం పూర్తవటానికి సగటున 20 కోట్ల సంవత్సరాలు పడుతుంది! అంటే ఇప్పుడు మనం చూసే ఇసుక కోట్లాది సంవత్సరాల క్రితం నాటిది అన్నమాట.
సముద్రాల్లో నత్తగుల్లలు, కోరల్స్ క్షీణించటంతోనూ ఇసుక ఏర్పడుతుంది. ఇది క్యాల్షియం కార్బొనేట్ రకం ఇసుక. కరేబియన్ దీవుల్లోని తీరాలు చాలావరకు ఇలాంటి క్షీణించిన నత్తగుల్లలతో తయారైనవే. అగ్నిపర్వతాల నుంచి వెలువడే లావా చల్లబడి.. గాలి, నీటి ప్రవాహాల తాకిడికి గురవ్వటంతోనూ ఇసుక ఏర్పడొచ్చు. హవాయి నల్ల ఇసుక బీచులు ఇలా ఏర్పడ్డవే. జిప్సమ్‌తో కూడిన ఇసుక తెల్లగా ఉంటుంది. ఇది అరుదు. అమెరికాలోని వైట్ సాండ్స్ నేషనల్ పార్కు వంటి చోట్ల ఇది కనిపిస్తుంది.
క్వార్ట్జ్ ప్రధానం
ఇసుక ప్రధానంగా క్వార్ట్జ్ స్ఫటికాలతో కూడుకొని ఉంటుంది. ఇది సిలికాన్ డయాక్సైడ్ రూపం. దీన్నే సిలికా అనీ అంటారు. ఇందులో సిలికాన్, ఆక్సిజన్ మూలకాలు ఉంటాయి. భూమి అంతర్భాగంలో పెద్దమొత్తంలో ఉండే మూలకాలు ఇవే. క్వార్ట్జ్ చాలా గట్టిగా ఉంటుంది. రాళ్ల కోతకు ఇతర ఖనిజాలు విచ్ఛిన్నమైనా క్వార్ట్జ్ అలాగే స్థిరంగా ఉంటుంది. అందుకే సుదీర్ఘకాలం చెక్కు చెదరకుండా దృఢంగా ఉంటుంది. క్వార్ట్జ్ ఆయా భూభాగాల్లోని ఐరన్, ఫ్లెడ్‌స్పార్ వంటి ఇతర పదార్థాల మిశ్రమంతో కలిసిపోయి ఉంటుంది. స్వచ్ఛ క్వార్ట్ పారదర్శకంగా ఉంటుంది. కానీ ఆక్సీకరణ మూలంగా క్వార్ట్జ్ రేణువుల రంగు మారుతుంది. వీటి మూలంగానే సముద్ర తీరాల్లోని బీచ్‌ల ఇసుక రకరకాల రంగులతో కనిపిస్తుంటుంది.
ఒక్కోటి ఒకోలా
ఇసుక రూపాలు అనేకం. మనం నిర్మాణాలకు వాడుతున్న ఇసుక వివిధ ముఖాలతో ఉంటుంది. అందుకే సిమెంటు మిశ్రమంతో కలిసి గట్టి అనుబంధాన్ని ఏర్పరచుకుంటుంది. సముద్రం అడుగున ఉండే ఇసుకను ఎక్కువగా కృత్రిమ దీవుల వంటివి నిర్మించటానికి వినియోగిస్తుంటారు. దుబాయిలోని కృత్రిమ పామ్ దీవులు దీంతో నిర్మించినవే. దీన్ని కాంక్రీటుకూ వాడుకోవచ్చు. కాకపోతే ముందు దీనిలోని ఉప్పును తొలగించాల్సి ఉంటుంది. ఇది చాలా ఖరీదైన వ్యవహారం.