Environmental Innovations: చురకైన ఆ ఇద్దరూ పర్యావరణ ఇంజినీరింగ్ విద్యార్థులు... వినూత్న ఆలోచనలతో సరికొత్త యంత్రాలు రూపొందించి విజయవంతంగా ప్రయోగిస్తున్నారు. హైదరాబాద్ మెహిదీపట్నంలో ఉంటున్న ఉప్పరి అనిల్‌కుమార్, మాలోత్ చరణ్‌లాల్... ఏపీలోని విజయవాడ ధనేకుల ఇనిస్ట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్, టెక్నాలజీలో ఎంటెక్ రెండో సంవత్సరం చదువుతున్నారు. వాతావరణ మార్పులు, పెరుగుతున్న జనాభా నేపథ్యంలో ప్రకృతిహిత ఆవిష్కరణలపై ప్రత్యేక దృష్టి సారించారు.
పర్యావరణహితం ఆవిష్కరణలు..
ఆయా అంశాలపై సామాజికంగా స్పందించిన ఈ ఇద్దరు విద్యార్థులు తమ సృజనకు పదును పెట్టి రూపొందించిన గ్రీన్ ప్యాడ్ ఇన్సరేటర్, సౌరశక్తి ఆధారిత నీటి పంపింగ్ మోటర్, ఫ్లోర్ క్లీనింగ్ యంత్రం ఆకట్టుకుంటున్నాయి. నిరంతరమైన కృషి, మంచి పట్టుదలతో రూపొందించిన "సోలార్ పవర్ ఆటోమేటిక్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టం ఆఫ్ సాప్లింగ్స్" టెక్నాలజీ అద్భుతమైన పనితీరు కనబరుస్తుంది. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌కు చెందిన అనిల్‌కుమార్, ఖమ్మం జిల్లా మణుగూరుకు చెందిన చరణ్‌లాల్... ఇద్దరూ గండిపేట మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - ఎంజీఐటీలో బీటెక్ మెకట్రానిక్స్ చదిటప్పుడు క్లాస్‌మేట్స్. ఆ సమయంలో పర్యావరణహితం కోసం ఏదైనా ఆవిష్కరణలు చేయాలన్న ఇద్దరి ఆలోచనలు కలిశాయి. సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉండేలా ఆవిష్కరణల కోసం శాస్త్రీయ, సృజనాత్మక జోడించి పలు ప్రయోగాలు చేశారు. 2018 ఫైనల్ ఇయర్‌లో "సోలార్ పవర్ ఆటోమేటిక్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టం ఆఫ్ సాప్లింగ్స్" రూపొందించి కళాశాల యాజమాన్యంతో శెభాష్ అనిపించుకున్నారు. 2019లో "స్మార్ట్ అండ్ వర్సటైల్ క్లీనర్" ఆవిష్కరించారు. ఇది కార్యాలయాల్లో ఫ్లోర్ క్లీనింగ్, గ్రాస్ కటింగ్, మాఫింగ్ లాంటి 3 రకాల పనులు చేస్తుంది. రిమోట్ సాయంతో అద్భుతంగా వాడుకోవచ్చు. ఇటీవల సమాజంలో పెద్ద సవాల్‌గా మారిన బయో మెడికల్ వేస్ట్ నిర్వహణ అధిగమించేందుకు "గ్రీన్ పాడ్ ఇన్సిలరేటర్" సృష్టించారు. ప్రభుత్వ, ప్రైవేటు, కార్పోరేట్ ఆసుపత్రులు, ఇంటా బయట రీయూజబుల్ కాని ప్యాడ్లు, గ్లౌజులు, మాస్కులు, ప్లాస్టిక్, ఇతర వస్తువులన్నీ 800 డిగ్రీల వద్ద బూడిద చేయడం ఈ టెక్నాలజీ ప్రత్యేకత.
గ్రీన్ ప్యాడ్ ఇన్సినరేటర్ యంత్రాలు
సాధారణంగా మహిళలు నెలసరి సమయంలో వినియోగించే ప్యాడ్లు... చెత్త వ్యర్థాలతో కలిసి పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి. హైదరాబాద్, అమరావతి లాంటి మహానగరాల్లో... ప్రత్యేకించి వసతిగృహాల్లో టాయ్‌లెట్లలో వేయడం వల్ల పైపులైన్లు, డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతింటోంది. భూమిలో కలిసిపోయేందుకు ఏళ్ల తరబడి సమయం పడుతుండటంతో ప్లాస్టిక్ తరహాలోనే ప్రకృతికి ముప్పు వాటిల్లుతోంది. ఇందుకోసం గ్రీన్ ప్యాడ్ ఇన్సినరేటర్ అనే యంత్రాలు ఆవిష్కరించారు. మహిళలు వినియోగించిన ప్యాడ్లను ఈ యంత్రంలో వేస్తే అది బూడిదగా మారిపోతుంది. కనీసం తాకకుండా ఫుట్ పెడల్ సాయంతో వినియోగించునే విధంగా ఈ యంత్రం విద్యుత్ లేదా సౌరశక్తి ఆధారంగా పనిచేసే తీర్చిదిద్దామని మాలోత్ చరణ్‌లాల్ తెలిపారు.