వైద్య రంగంలో(medicine field) కొత్త ఆవిష్కరణలకు రూపకల్పన జరుగుతోంది. హైదరాబాద్ హైటెక్స్(Hitex in Hyderabad)లో శుక్రవారం ఏర్పాటై ఆదివారం ముగియనున్న పబ్లిక్ హెల్త్ ఇన్నోవేషన్స్ కాంక్లేవ్ ఎక్స్‌పో(Public health innovations conclave expo)లో వైరస్(virus), బ్యాక్టీరియా రహిత పరిసరాల(bacteria free world)కు వివిధ పరికరాలు, నాణ్యమైన వైద్య సేవల కోసం యంత్రాలు ఇక్కడ కొలువుదీరాయి. ప్రదర్శనలోని ఆసక్తికరమైన కొన్ని పరికరాల గురించి క్లుప్తంగా....
గాల్లో క్రిములను చంపే థర్మల్ ఎయిర్ శానిటైజర్
మనం ఉండే గదిలో లెక్కలేనన్ని వైరస్‌లు, బ్యాక్టీరియాలుంటాయి. కొవిడ్ బాధితుడు తుమ్మినా.. దగ్గినా.. ఆ వైరస్ గది మొత్తం వ్యాపిస్తుంది. ఆ గదిలోకి వెళ్లినప్పుడు గాలి ద్వారా ఇతరులకు సోకుతుంది. ఇలాంటి వైరస్‌లను చంపేందుకు థర్మల్ ఎయిర్ శానిటైజేషన్(Thermal air sanitization) యంత్రం ఉపకరిస్తుందని తొమ్మిదో తరగతి విద్యార్థి కె.మధురిమ నిరూపించింది.
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని చందాపూర్ ప్రభుత్వ పాఠశాలలో 9 తరగతి చదువుతున్న ఈ విద్యార్థిని, తనకు తట్టిన ఆలోచనను సైన్సు ఉపాధ్యాయుడు టి.సంపత్‌కుమార్‌తో పంచుకొంది. ఆయన ప్రోత్సాహంతో, బ్లోయర్, యూవీ టెక్నాలజీతో ఈ యంత్రాన్ని తయారు చేసినట్లు తెలిపింది. దీన్ని ఆన్ చేయగానే బ్లోయర్ తిరిగి, అందులో ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది. గదిలో ఉన్న వైరస్‌ను బ్లోయర్ తీసుకుంటుంది. యూవీ కిరణాలు వాటిని నాశనం చేస్తాయి. తక్కువ ఖర్చుతోనే వీటిని ఆసుపత్రులు, పాఠశాలలు, వ్యాయామశాలలు తదితర చోట్ల అమర్చడం ద్వారా కొవిడ్ వైరస్‌ను నిర్మూలించవచ్చు.
ఇంట్లో లైట్లతోనే వైరస్‌లు దూరం
క్రిముల నివారణకు వాడే యూవీ కిరణాలతో అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఓ సంస్థ రోగకారక సూక్ష్మ క్రిములను చంపేలా నాన్ యూవీ ఎల్‌ఈడీ లైట్ల(UV LED lights)ను తయారు చేసింది. వాతావరణంలో క్రిములను చంపడంతోపాటు కాంతిని ఇవి అందిస్తాయి. ఈ బల్బులను సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ(CCMB)) పరీక్షించి, ధ్రువీకరించింది. ఆన్‌చేసిన 60 నిమిషాల్లో 95 శాతం కొవిడ్ వైరస్‌ను నిర్మూలిస్తుందని సంస్థ ఎండీ విజయ్‌గుప్తా తెలిపారు.