తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

ఇస్రో మరో ఘనత- జాబిల్లి నుంచి భూకక్ష్యలోకి చంద్రయాన్-3 మాడ్యూల్‌! - చంద్రుడి నుంచి భూ కక్ష్యలోకి ప్రొపల్షన్​ మాడ్యూల్​

Chandrayaan 3 Latest Update : చంద్రయాన్-3కి సంబంధించిన ప్రొపల్షన్ మాడ్యూల్‌ను ప్రత్యేక ప్రయోగం ద్వారా భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది ఇస్రో. భవిష్యత్ ఆపరేషన్లను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రయోగం చేపట్టింది.

Chandrayaan 3 Latest Update
Chandrayaan 3 Latest Update

By PTI

Published : Dec 5, 2023, 9:45 AM IST

Updated : Dec 5, 2023, 12:34 PM IST

Chandrayaan 3 Latest Update :చంద్రయాన్​-3 ప్రాజెక్ట్​లో భాగంగా జాబిల్లి వద్దకు పంపిన ప్రొపల్షన్ మాడ్యూల్‌ను విజయవంతంగా చంద్రుడి కక్ష్య నుంచి భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది ఇస్రో. ఇది ప్రత్యేక ప్రయోగమని ఇస్రో శాస్త్రవేత్తలు​ తెలిపారు. చంద్రుడిపై నుంచి నమూనాలు సేకరించే ప్రణాళికలు చేస్తున్న ఇస్రో, తాజా ప్రయోగం ఆ మిషన్​కు దోహదపడుతుందని పేర్కొంది. నమూనాలను తీసుకొని తిరిగి వచ్చే మిషన్ కోసం వ్యూహాలు రూపొందించేందుకు ప్రొపల్షన్ మాడ్యూల్​లోని అదనపు సమాచారం ఉపయోగపడుతుందని పేర్కొంది.

కాగా, చంద్రయాన్-3 మిషన్​ ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువంపై భారత్​ ఈ ఏడాది ఆగస్టు 23న సాఫ్ట్​ ల్యాండింగ్ చేసింది. 'విక్రమ్​ ల్యాండర్'​, 'ప్రజ్ఞాన్​ రోవర్‌' పరికరాల సాయంతో వివిధ ప్రయోగాలను పూర్తి చేశారు. దీంతో చందమామ సౌత్​ పోల్​పై కాలు మోపిన మొదటి దేశంగా భారత్​ నిలిచింది. ముందుగా చంద్రుడిపై విక్రమ్​ ల్యాండర్​ అడుగు పెట్టగా కొద్ది గంటల్లోనే రోవర్​ బయటకు వచ్చింది. తనకు నిర్దేశించిన ప్రయోగాలను జాబిల్లిపై కలియతిరుగుతూ విజయవంతంగా పూర్తి చేసింది. చేపట్టిన ప్రయోగాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇస్రో సైంటిస్టులకు చేరవేసింది. జీటీఓ(జియో స్టేషనరీ ట్రాన్స్​ఫర్ ఆర్బిట్) నుంచి చంద్రుడి చివరి పోలార్ కక్ష్యకు ల్యాండర్ మాడ్యూల్​ను తీసుకురావడం; ల్యాండర్​ను వేరుచేయడం ప్రొపల్షన్ మాడ్యూల్ ప్రధాన లక్ష్యాలని ఇస్రో తెలిపింది.

"ల్యాండర్ విడిపోయిన తర్వాత ప్రొపల్షన్ మాడ్యూల్​లో ఉన్న స్పెక్ట్రో-పొలారిమెట్రి ఆఫ్ హాబిటబుల్ ప్లానెట్ ఎర్త్(షేప్) పేలోడ్​ను ఆపరేట్ చేశాం. ఈ పేలోడ్​ను ప్రొపల్షన్ మాడ్యూల్ జీవితకాలంలో మూడుసార్లు ఆపరేట్ చేయాలన్నది మా లక్ష్యం. చంద్రయాన్-3ని కక్ష్యలోకి సమర్థవంతంగా ప్రవేశపెట్టడం, కక్ష్య తగ్గింపు-పెంపు ప్రక్రియలు సక్రమంగా నిర్వహించడం వల్ల ఇంధనం ఆదా అయింది. ప్రొపల్షన్ మాడ్యూల్​ నెల రోజులు పని చేసిన తర్వాత అందులో వంద కిలోలకు పైగా ఇంధనం మిగిలింది. ఆ ఇంధనాన్ని ఉపయోగించి ప్రొపెల్షన్ మాడ్యూల్​లోని అదనపు సమాచారాన్ని సేకరించాలని భావించాం. భూపరిశీలనకు అనుకూలంగా షేప్ పేలోడ్​ను భూకక్ష్యలోకి తిరిగి తీసుకొచ్చే చర్యలు తీసుకున్నాం. ప్రొపల్షన్ మాడ్యూల్ చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. అదేసమయంలో, భూమికి 36వేల కి.మీ దూరంలో ఉన్న జీయోసింక్రనస్ ఈక్వటోరియల్ ఆర్బిట్​లోకి ప్రవేశించకుండా చూసేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నాం."
-ఇస్రో

చంద్రయాన్​-4కు ఇస్రో రెడీ- జాబిల్లి నుంచి మట్టి తీసుకురావడమే టార్గెట్​

Chandrayaan 3 Latest Update : చంద్రుడిపై దుమ్మురేపిన విక్రమ్​ ల్యాండర్​.. ఏకంగా 2 టన్నుల మట్టి గాలిలోకి..

Last Updated : Dec 5, 2023, 12:34 PM IST

ABOUT THE AUTHOR

...view details