జాబిల్లి మీద నీరు ఉండే అవకాశం ఉందని పేర్కొంటూ ఇప్పటికే పలు నివేదికలు వచ్చాయి. ఇప్పుడు ఈ విషయంపై మరింత బలమైన ఆధారాలను సేకరించారు భారత శాస్త్రవేత్తలు. కొన్నేళ్ల క్రితం ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన చంద్రయాన్-2 (chandrayaan 2 news).. ఇందుకు సంబంధించిన డేటాను సేకరించింది. చంద్రుడి ఉపరితలం మీద నీటి అణువులు (water on moon) ఉన్నట్లు గుర్తించింది. ఈ విషయాన్ని ఇస్రో మాజీ ఛైర్మన్ ఏఎస్ కిరణ్కుమార్ సహా పలువురు శాస్త్రవేత్తలు కరెంట్ సైన్స్ అనే జర్నల్ ద్వారా వెల్లడించారు.
చంద్రయాన్-2లో ఏర్పాటు చేసిన ఇమేజింగ్ ఇన్ఫ్రేర్డ్ స్పెట్రోమీటర్ (ఐఐఆర్ఎస్) సాంకేతికతతో ఈ నీటి అణువులను గుర్తించగలిగామని కిరణ్కుమార్ పేర్కొన్నారు. చంద్రుడి ఉపరితలంపైన ఉత్తర భాగంలోని 29 నుంచి 62 డిగ్రీల ల్యాటిట్యూడ్ల మధ్య హైడ్రాక్సైడ్ (OH), నీటి (H2O) కణాలు ఉన్నట్లు ఐఐఆర్ఎస్ అందించిన డేటాలో వెల్లడైందని శాస్త్రవేత్తలు తెలిపారు. డేటాకు థర్మల్ కరెక్షన్ చేపట్టాకే ఈ విషయాన్ని నిర్ధరించామని స్పష్టం చేశారు. అయితే చంద్రయాన్-2 ఆశించిన ఫలితాలు అందించలేదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.