తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

Hala Mobility: 'సెల్ఫీ కొడితే స్కూటర్​ స్టార్ట్‌.. పెట్రోల్, డీజిల్ బెడదే లేదు'

Hala Mobility Electric Scooter: తాళం చెవితో పనిలేదు, పెట్రోల్, డీజిల్ బెడద లేదు. సెల్ఫీ కొడితే స్టార్టయ్యే ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఎప్పుడైనా విన్నారా..? హైదరాబాద్‌లోని ట్రిపుల్‌ ఐఐటీ క్యాంపస్‌కు వెళ్తే దర్శనమిస్తాయి. హైదరాబాదీ యువ పారిశ్రామికవేత్త మొబిలిటీ స్పేస్‌లో ప్రత్యేకయాప్‌ రూపొందించాడు. ఓలా, ఉబర్‌లకు దీటుగా హల యాప్ ద్వారా... ఎలక్ట్రిక్‌ స్కూటర్లు అద్దెకిస్తున్నాడు. కిలోమీటర్ల ఆధారంగా కాక.. సమయం ఆధారంగా ఛార్జీలు అంటున్న ఆ సంస్థ ప్రత్యేకతలు ఇంకా చాలా ఉన్నాయి.

Hala Mobility, Hala Mobility Electric Scooter
ఎలక్ట్రిక్ స్కూటర్

By

Published : Dec 14, 2021, 12:14 PM IST

తాళం చెవిలేకుండా ఈ స్కూటర్ నడిపేయొచ్చు

Hala Mobility Electric Scooter: ఓ వైపు పెరుగుతున్న వాయు కాలుష్యం... మరోవైపు మండుతున్న ఇంధన ధరలు.. ఈ రెండింటి నడుమ వాహనదారులు ఎలక్ట్రిక్‌ వాహనాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఐతే.. వాటి ధరలు కాస్త ఆలోచింపజేస్తున్నాయి. సిటీలో మెట్రో ప్రయాణం.. నగరం దాటితే కారు ఉండగా.. మళ్లీ బైక్‌ అవసరమా? అని కొందరు ఆలోచిస్తున్నారు. కాకపోతే.. మెట్రో దిగి ఆఫీస్‌కు ఎలా వెళ్తారు...? కళాశాల వరకు మళ్లీ షేర్‌ ఆటోలే దిక్కా? ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తున్నారు ఈ యువకులు. విద్యాసంస్థలు, హాస్పిటల్స్, టెక్ పార్కులు వంటి ప్రదేశాల్లో వాడుకునేలా స్మార్ట్‌ ఎలక్ట్రిక్ స్కూటర్లు అద్దెకిస్తున్నారు.

తాళం చెవితో పనిలేకుండా

స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు అద్దెకిస్తున్న ఈ స్టార్టప్‌ పేరు... హల మెుబిలిటీ. తాళం చెవితో పని లేకుండా ఈ-స్కూటర్ వద్దకు వెళ్లి యాప్ ఆన్ చేసి ఓ సెల్ఫీ ఇస్తే చాలు స్కూటర్ స్టార్ట్ అవుతుంది. హల మొబిలిటీ నెట్ వర్క్​తో ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే. ఇందుకోసం హలా ఈ బైక్ వద్దకు వెళ్లి, యాప్​లో మీ ఫోటో, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ అప్ లోడ్ చేస్తే చాలు ఈ-స్కూటర్​తో రయ్ రయ్ మంటూ దూసుకెళ్లొచ్చు అంటున్నారు హల మొబిలిటీ సంస్థ నిర్వాహకులు అబ్దుల్ హకీమ్.

హైదరాబాద్‌కు చెందిన శ్రీకాంత్‌.. ఇటలీలో షేర్ మొబిలిటీ స్పేస్​లో డ్యూయల్ మాస్టర్స్ చేశారు. భారత్‌కు వచ్చాకా... ఓలా, ఉబర్ వంటి ప్రఖ్యాత సంస్థలకు దీటుగా ఈ రంగంలో ఎదగాలనుకున్నాడు. ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారు చేస్తోన్న 5 ప్రఖ్యాత సంస్థల నుంచి వాహనాలు కొనుగోలు చేశారు. వాటిని షేర్ మొబిలిటీ స్పేస్ కొరకు ప్రత్యేకంగా కస్టమైజ్ చేశారు. ఈ-స్కూటర్ వాడకం కొరకు ఏఐ, ఐవోటీ టెక్నాలజీ జోడించి యాప్‌ రూపొందించినట్లు హల మొబిలిటీ వ్యవస్థాపకుడు శ్రీకాంత్ తెలిపారు. స్కూటర్ లాక్‌, అన్‌లాక్‌ సిస్టమ్‌ పొందుపరచామని వెల్లిడించారు.

ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో ఈ- స్కూటర్లు అద్దెకు

ప్రస్తుతం ట్రిపుల్ ఐటీలో వారి పికప్ పాయింట్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులు, విజిటర్స్‌, క్యాంపస్‌లో ఉండే సిబ్బందికి అందుబాటులో ఉంచారు. ఈ స్కూటర్లను.. కిలోమీటర్ల ఆధారంగా కాక.. వినియోగించిన సమయం ఆధారంగా ఛార్జ్ చేస్తారు. కేవలం ఐదు రూపాయల బేస్ ఫెయిర్​తో స్కూటర్ అన్ లాక్ చేసి.. నిమిషానికి 0.75 రూపాయల చొప్పున ఛార్జ్ చేస్తామంటున్నారు...నిర్వాహకులు. ప్రస్తుతం అన్ని విభాగాల్లో అద్దె తీసుకునే సంప్రదాయం పెరుగుతోంది. మెట్రోపాలిటన్ నగరాల్లో పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలు హల తీరుస్తుందని వ్యవస్థాపకుడు శ్రీకాంత్‌ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం హల మొబిలిటీ నుంచి 9 రకాల మోడల్ స్కూటర్లు అందుబాటులో ఉంచారు. ఇవి ఇన్ క్యాంపస్ అవసరాలతో పాటు.. డెలివరీ, ట్రాన్స్ పోర్ట్, పర్సనల్ యూసేజ్ వంటి వాటికి సులభంగా ఉపయోగించవచ్చు.

త్వరలోనే హైదరాబాద్‌ అంతటా సేవలు

ఈ-స్కూటర్లను 2022 జనవరి నెలాఖరుకల్లా నగరవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువస్తామంటున్నాడు... ఫౌండర్‌ శ్రీకాంత్‌. త్వరలోనే... ముంబయి, పుణే, విశాఖ వంటి నగరాలకు హల మెుబలిటీ సేవలు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఇదీ చూడండి:Fake IT Raids: ఐటీ అధికారులమంటూ మోసం.. 3 కిలోల బంగారం, డబ్బు స్వాహా

ABOUT THE AUTHOR

...view details