యావత్ దేశం 5జీ నెట్వర్క్ రాకపై ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే దిగ్గజ టెలికాం సంస్థలు ఎయిర్టెల్, జియో.. 5జీ సేవలను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. అయితే 5జీ నెట్వర్క్ సేవలు అందుబాటులోకి వచ్చినా.. వినియోగదారులు '4జీ' సేవలనే ఎక్కువగా ఉపయోగిస్తారని ఇంటర్నెట్ యాక్సెస్ పనితీరును విశ్లేషించే ఓక్లా సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది మార్చిలో జరిగిన స్పెక్ట్రమ్ వేలం తర్వాత 4జీ సేవలు మెరుగుపడ్డాయని పేర్కొంది. 2020 నాలుగో త్రైమాసికంలో 93.5 శాతం ఉన్న 4జీ సేవల వినియోగం.. 2021 రెండో త్రైమాసికంలో 96 శాతానికి పెరిగినట్లు ఓక్లా తెలిపింది. ఫలితంగా 4జీ సేవల వినియోగానికే యూజర్స్ ఆసక్తి చూపుతారని వెల్లడించింది.
వేగంలో పెరుగుదల
2020 తొలి త్రైమాసికంలో 10.64 ఎంబీపీఎస్ ఉన్న ఇంటర్నెట్ స్పీడు.. 2021 రెండో త్రైమాసికంలో 15.67 ఎంబీపీఎస్‌కు పెరిగింది. దీంతో మొబైల్ నెట్వర్క్ డౌన్లోడ్ వేగంలో(జూలై 2021 నాటికి) భారత్.. ప్రపంచంలోనే 122వ స్థానంలో ఉందని.. ఆ సంస్థ సహవ్యవస్థాపకుడు, సీఈఓ డగ్ షటిల్స్ తెలిపారు. దేశంలో 5జీ సేవలు ప్రారంభించినప్పటికీ మార్కెట్ చాలా స్థిరంగా, బలంగా ఉంటుందనడానికి ఇది ఒక సూచన అని అన్నారు.
"ప్రస్తుతం దేశంలో 4జీ ఆధిపత్యం చెలాయిస్తోంది. 5జీ సేవలు ప్రారంభమైనా.. 4జీ నెట్వర్క్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ఏడాది మార్చిలో జరిగిన స్పెక్ట్రమ్ వేలం తర్వాత ఆపరేటర్లు తీసుకున్న చర్యలతో 4జీ సేవలు చాలా మెరుగుపడ్డాయి" అని షటిల్స్ చెప్పారు.
అలాగే భవిష్యత్‌లో 5జీ సేవలు మెరుగుపడతాయన్న అంశంపై కూడా మాట్లాడారు. మార్కెట్లో ఓపెన్ రేడియో యాక్సెస్ నెట్వర్క్(ఓపెన్ రాన్), డైనమిక్ స్పెక్ట్రమ్ షేరింగ్(డీఎస్ఎస్), అందుబాటులోని 5జీ హ్యాండ్సెట్ల ద్వారా 5జీ సేవలను వేగంగా విస్తరించే అవకాశముందని పేర్కొన్నారు.