prawns recipe : మలై ప్రాన్స్ కర్రీ
కావలసినవి: రొయ్యలు: పదిహేను, పసుపు: పావుచెంచా, నూనె: పావుకప్పు, గరంమసాలా: చెంచా, ఉల్లిపాయ: ఒకటి, అల్లం ముద్ద: చెంచా, కారం: చెంచా, వేడినీళ్లు: మూడు టేబుల్‌స్పూన్లు, చిక్కని కొబ్బరిపాలు: ముప్పావుకప్పు, నెయ్యి: ఒకటిన్నర చెంచా, పచ్చిమిర్చి: మూడు, ఉప్పు: తగినంత, దాల్చినచెక్క: ఒక ముక్క, లవంగాలు: నాలుగు, యాలకులు: మూడు, బిర్యానీఆకులు: రెండు.
తయారీ విధానం: రొయ్యలపైన పసుపు, కొద్దిగా ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. పది నిమిషాలయ్యాక ఈ రొయ్యల్ని రెండు చెంచాల నూనెలో దోరగా వేయించుకుని తీసుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి మిగిలిన నూనె వేసి దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీఆకుల్ని వేయించుకోవాలి. ఇందులో ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి తరుగు, తగినంత ఉప్పు వేసి బాగా వేయించుకుని తరువాత అల్లం ముద్ద, కారం, వేడినీళ్లు పోయాలి. అయిదు నిమిషాలయ్యాక కొబ్బరిపాలు, రొయ్యలు, నెయ్యి, గరంమసాలా వేసి స్టౌని సిమ్‌లో పెట్టాలి. రొయ్యలు ఉడికి, కూర దగ్గరకు అయ్యాక దింపేయాలి.
మసాలా కర్రీ
కావలసినవి: రొయ్యలు: కేజీ, జీలకర్ర: రెండు చెంచాలు, వేయించిన మెంతులు: పావుచెంచా, దనియాలు: రెండు చెంచాలు, ఉల్లిపాయముక్కలు: అరకప్పు, వెల్లుల్లి రెబ్బలు: నాలుగు, అల్లం తరుగు: రెండు చెంచాలు, టొమాటోలు: ఆరు, నూనె: అరకప్పు, ఆవాలు: టేబుల్‌స్పూను, కరివేపాకు రెబ్బలు: నాలుగు, కారం: నాలుగుచెంచాలు, పసుపు: చెంచా, చింతపండు రసం: పావుకప్పు, ఎండుమిర్చి: రెండు, ఉప్పు: తగినంత, గరంమసాలా: చెంచా, కొత్తిమీర తరుగు: అరకప్పు.
తయారీ విధానం: ముందుగా కొత్తిమీర, ఉల్లిపాయముక్కలు, అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చి మిక్సీలో వేసుకుని నీళ్లు చల్లుకుంటూ మెత్తని పేస్టులా చేసుకుని తీసుకోవాలి. టొమాటో ముక్కల్ని కూడా మిక్సీలో వేసి మెత్తని గుజ్జులా చేసుకోవాలి. అదేవిధంగా జీలకర్ర, దనియాలు, మెంతుల్ని కూడా పొడిచేసుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి నూనె వేసి ఆవాలు వేయించి తరువాత కొత్తిమీర మిశ్రమం వేయాలి. అది పూర్తిగా వేగాక కరివేపాకు, కారం, తగినంత ఉప్పు, జీలకర్రపొడి, పసుపు, టొమాటో పేస్టు వేసుకుని స్టౌని మీడియంలో పెట్టి బాగా మగ్గనివ్వాలి. టొమాటో గుజ్జు ఉడికిందనుకున్నాక చింతపండు రసం, రొయ్యలు, గరంమసాలా వేసి కలిపి మూత పెట్టాలి. అన్నీ ఉడికి.. కూర దగ్గరకు అయ్యాక దింపేయాలి.