తెలంగాణ

telangana

ETV Bharat / priya

దేనికైనా జత.. రుచుల రైతా!

నాన్​వెజ్​లకు సైడ్​ డిష్​గా చివర్లో రెండు ముద్దలు రైతాతో తింటే ఆ టేస్టే వేరు. మరి రైతాను ఎన్ని రకాలుగానో చేసుకోవచ్చు. కీరాతో, మామిడిపండుతో, బీట్​రూట్​తో ఇలా ఎన్నో రకాల వెరైటీల రైతా ఎలా చేయాలో తెలుసుకుందాం..

This dish is a must have at weddings and parties
దేనికైనా జత.. రుచుల రైతా

By

Published : Jun 26, 2021, 2:16 PM IST

పెళ్లిళ్లు, పార్టీలు.. దావత్‌ ఏదైనా.. చివరలో రైతాతో రెండు ముద్దలు తింటే ఆ రుచే వేరు. ఘుమఘుమలాడే వెజ్‌ బిర్యానీకి జతగా.. నాన్‌వెజ్‌లకు సైడ్‌ డిష్‌గా ఇది ఉండాల్సిందే.. ఎండలు మండుతున్న వేళ.. కడుపులో చల్లగా ఉండాలంటే ఓ కప్పు రైతా తింటే సరి.

కీరాతో..

కీరా రైతా

కావాల్సినవి: కీరా ముక్కలు-అరకప్పు, పెరుగు-రెండు కప్పులు, ఉప్పు-తగినంత, మిరియాల పొడి, జీలకర్ర పొడి-అర చెంచా చొప్పున, కొత్తిమీర తరుగు-కొద్దిగా.

తయారీ: ఓ పెద్ద గిన్నెలో పెరుగు తీసుకుని బాగా గిలకొట్టాలి. దీంట్లో మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమంలో కీర ముక్కలు వేసి కలియబెట్టాలి. తర్వాత కొత్తిమీరతో అలంకరించుకుంటే సరిపోతుంది. అంతే రుచికరమైన కీరా రైతా సిద్ధం.

మామిడిపండుతో..

మామిడిపండు రైతా

కావాల్సినవి.. మామిడిపండు ముక్కలు-కప్పు, పెరుగు-పెద్ద కప్పు, ఆవాలు, మెంతులు-అరచెంచా చొప్పున, కొత్తిమీర తరుగు-కొద్దిగా, ఉప్పు-తగినంత, చక్కెర-అరచెంచా, నెయ్యి-రెండు చెంచాలు, పండుమిర్చి-రెండు (నిలువుగా కోసినవి).

తయారీ: మామిడిపండును శుభ్రంగా కడిగి పొట్టుతీసి ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. పొయ్యి మీద బాణలీ పెట్టి నెయ్యి వేసుకోవాలి. అది వేడయ్యాక ఆవాలు వేసి కాస్త చిటపటలాడాక మెంతులు, పండుమిర్చి ముక్కలు వేసి కలపాలి. ఇప్పుడు మరో గిన్నెలో పెరుగు, చక్కెర వేసి బాగా గిలకొట్టాలి. ఈ మిశ్రమంలో మామిడి ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. పోపు వేసి మరోసారి కలియబెట్టాలి. చివరగా కొన్ని మామిడి ముక్కలు, కొత్తిమీర తరుగుతో గార్నిష్‌ చేసుకుంటే సరి.

బీట్‌రూట్‌తో..

బీట్​రూట్​తో రైతా

కావాల్సినవి: బీట్‌రూట్‌ తురుము-అరకప్పు, పెరుగు-కప్పు, నీళ్లు-కొన్ని, ఉప్పు-తగినంత, తాలింపు కోసం... నూనె-చెంచా, ఆవాలు-పావు చెంచా, పచ్చిమిర్చి ముక్కలు-చెంచా, కరివేపాకు-కొద్దిగా.

తయారీ: స్టవ్‌ వెలిగించి బాణలీ పెట్టి బీట్‌రూట్‌ తురుము, కాస్త ఉప్పు వేసి ఉడికించాలి. కాసిన్ని నీళ్లు చల్లితే త్వరగా ఉడుకుతుంది. ఇప్పుడీ మిశ్రమాన్ని పెరుగులో వేసి బాగా కలపాలి. మరో స్టవ్‌పై కడాయి పెట్టి నూనె పోయాలి. ఇందులో ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఈ పోపును బీట్‌రూట్‌ పెరుగు మిశ్రమంలో కలిపేస్తే సరి.

పాలకూరతో..

పాలకూరతో రైతా

కావాల్సినవి: పాలకూర-పావుకప్పు, పెరుగు-కప్పు, పుదీనా-కొద్దిగా, అల్లంవెల్లుల్లి తురుము-చెంచా, కరివేపాకు-రెండు రెమ్మలు, నూనె, ఉప్పు-తగినంత, కొత్తిమీర-కొద్దిగా.

తయారీ: స్టవ్‌ వెలిగించి బాణలీ పెట్టాలి. ఇది వేడయ్యాక నూనె పోసి కాగిన తర్వాత పాలకూర, కరివేపాకు, పుదీనా, అల్లంవెల్లుల్లి తురుములను వేర్వేరుగా వేయించి పక్కన పెట్టుకోవాలి. బరువు తగ్గాలనుకునేవారు బాణలీలో కొద్దిగా నూనె పోసి వీటన్నింటిని ఒక్కోటిగా వేస్తూ కొంచెం నూనెలో కూడా వేయించుకోవచ్చు. ఇప్పుడు మరో గిన్నెలో పెరుగు, ఉప్పు వేసి బాగా గిలకొట్టాలి. ఇందులో వేయించి పెట్టుకున్న పాలకూర, పుదీనా, కరివేపాకు, అల్లంవెల్లుల్లి తురుములను వేసి బాగా కలపాలి. పైన కాస్తంత కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకుంటే చాలు.

బూందీతో..

బూందీ రైతా

కావాల్సినవి: గట్టి పెరుగు-కప్పు, బూందీ-కప్పు, జీలకర్ర పొడి-పావుచెంచా, కారం-పావుచెంచా, ఉప్పు-రుచికి సరిపడా, కొత్తిమీర తరుగు-కొద్దిగా.

తయారీ:పెరుగులో కారం, ఉప్పు, జీలకర్ర పొడి వేసి బాగా గిలకొట్టాలి. ఇప్పుడు బూందీ వేసి కలపాలి. చివరగా కొత్తిమీర తరుగు, కొద్దిగా బూందీతో అలంకరించుకుంటే రుచికరమైన బూందీ రైతా తినేయొచ్చు.

ఇవీ చదవండి: ఆహా: నోరూరించే వంటలతో 'వేగన్​ ఫెస్ట్​​'

ఈ ఎండల్లో.. మ్యాంగో మస్తానితో ఆహా!

ఆహా: సొరకాయ హల్వా.. తయారీ ఇలా

ABOUT THE AUTHOR

...view details