భోజన ప్రియులకే కాక ప్రతి ఒక్కరికీ ఇష్టమైన వంటకం బిర్యానీ. తెలుగు రాష్ట్రాల్లో దీనికి అంతలా డిమాండ్ ఉంది. అయితే ఈ వంటకంతో పాటు పులావ్‌ను ఎక్కువగానే ఇష్టపడతారు కొందరు. కానీ బిర్యానీ, పులావ్‌ను ఒకటే అనుకుంటారు. చూడటానికి ఈ రెండూ ఒకేలా కనిపించినా.. రుచితో పాటు చేసే విధానాన్ని గమనిస్తే ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోవచ్చు.
ముందుగా పులావ్ గురించి తెలుసుకుందాం. పులావ్ తయారీ చాలా తేలిక. ఏ బియ్యంతో అయినా దీన్ని తయారుచేసుకోవచ్చు. ఒన్షాట్ అంటారే ఆ తరహాలో పులావ్‌ని తయారుచేసుకోవచ్చు. కావల్సినంత బియ్యం, కాయగూరలు, వేయాలనుకుంటే మాంసాహారం వేసి కుక్కర్ మూతపెట్టి ఉడికించేస్తే అది పులావ్. దీనికి పెద్దగా నైపుణ్యాలు అవసరం లేదు. పిలాఫ్ అనే పదం నుంచి పులావ్ అనే పదం వచ్చింది. ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో ఈ పులావ్‌ని తయారు చేసుకుంటారు. కానీ బిర్యానీ అలా కాదు.