ఆనందం పంచుకోవాలంటే కావాలి లడ్డూ. అనురాగాలు పెనవేసుకునేప్పుడు తప్పక ఉంటుంది లడ్డూ. సందర్భాలు వేరైనా ఈ మధుర పదార్థం ఉండి తీరాల్సిందే! మామూలుగా పంచదారపాకంతో తయారయ్యే లడ్డూలను.. రుచితో పాటు ఆరోగ్యాన్నీ ప్రసాదించాలంటే మరో పద్ధతిలో చేసుకోవాలి. తాటి బెల్లంతో చుట్టుకోవాలి. డ్రైఫ్రూట్స్‌తో కట్టుకోవాలి. అవెలా చేసుకోవాలో మీ కోసం..
తాటి బెల్లం, కొబ్బరి లడ్డూలు
తాటి బెల్లం, కొబ్బరి లడ్డూలు కావాల్సినవి: తాటి బెల్లం-కప్పు, పచ్చి కొబ్బరి తురుము-రెండు కప్పులు, నీళ్లు-రెండు టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి-టీస్పూన్.
తయారీ: గిన్నెలో తాటి బెల్లం, నీళ్లు తీసుకుని, స్టవ్ మీద పెట్టి బెల్లం కరిగించాలి. ఈ మిశ్రమాన్ని అయిదు నిమిషాల పాటు ఎక్కువ మంట మీద చిక్కటి పాకం వచ్చేంతవరకూ ఉంచాలి. దీంట్లో పచ్చి కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి పది నుంచి పదిహేను నిమిషాలపాటు తక్కువ మంట మీద ఉడికించాలి. మిశ్రమం గట్టిపడే వరకూ కలుపుతూ ఉండాలి. కాస్త చల్లారిన తర్వాత లడ్డూలు చుట్టుకోవాలి.
ఖర్జూర్ కాజూనట్ బాల్స్
ఖర్జూర్ కాజూనట్ బాల్స్ కావాల్సినవి:గింజలు తీసిన ఖర్జూరాలు-500 గ్రా, జీడిపప్పు పలుకులు-200 గ్రా, ఎండు కొబ్బరి పొడి-అరకప్పు, నెయ్యి-50 గ్రా.
తయారీ: ఖర్జూరాల్లో సగం నెయ్యి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక పాత్ర తీసుకుని దాంట్లో మిగిలిన నెయ్యి, ఖర్జూరాల పేస్ట్ వేసి రెండు నుంచి మూడు నిమిషాలపాటు ఉడికించుకోవాలి. మంట మరీ ఎక్కువ, తక్కువ కాకుండా చూసుకుని మిశ్రమాన్ని కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి జీడిపప్పు, కొబ్బరి పొడి వేసి బాగా కలపాలి. కొంచెం చల్లారాక లడ్డూల్లా చుట్టుకోవాలి.
అంజీర్ బర్ఫీ
కావాల్సినవి:ఎండు అంజీరాలు-250 గ్రా, నెయ్యి-రెండు టేబుల్ స్పూన్లు, గసాలు-టేబుల్ స్పూన్, నువ్వులు-టేబుల్ స్పూన్, ఎండుకొబ్బరి పొడి-పావుకప్పు, జీడిపప్పు పలుకులు-పావుకప్పు, బాదం పలుకులు-పావుకప్పు, కిస్‌మిస్-25 గ్రా, యాలకులపొడి-టీస్పూన్.
తయారీ: అంజీరాలను మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. గిన్నెలో నెయ్యి వేసి వేడెక్కాక గసాలు, నువ్వులు గోధుమ రంగులోకి వచ్చేలా వేయించుకోవాలి. దాంట్లోనే కొబ్బరిపొడి వేసి నిమిషంపాటు వేయించాలి. తర్వాత జీడిపప్పు, బాదం, కిస్‌మిస్ వేసి మూడు నిమిషాల పాటు వేయించాలి. ఇప్పుడు అంజీరాల పేస్ట్ వేసి అయిదు నిమిషాలపాటు సన్నని మంట మీద కలుపుతూ ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి యాలకుల పొడి వేసి చల్లారాక ఈ మిశ్రమాన్ని రోల్ చేసుకుని చతురస్రాకారంలో కట్ చేసుకోవాలి.
గ్రనోలా బార్
కావాల్సినవి:ఓట్స్-కప్పు, జీడిపప్పు పలుకులు -పావుకప్పు, బాదం పలుకులు-పావుకప్పు, వేయించిన నువ్వులు-రెండు టేబుల్‌స్పూన్లు, దాల్చినచెక్క పొడి-అరటీస్పూన్, తేనె-పావుకప్పు, గింజలు తీసిన ఖర్జూరాలు-పావుకప్పు.
తయారీ: ఖర్జూరాలను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో ఓట్స్, జీడిపప్పు, బాదం, నువ్వులు, దాల్చినచెక్క పొడి, తేనె, మిక్సీ పట్టిన ఖర్జూరాల పేస్ట్‌ను వేసి అన్నీ కలిసేట్టుగా బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నాలుగు అంగుళాల పొడవు, రెండు అంగుళాల వెడల్పు ఉండే బార్‌లా కట్ చేయాలి. దీన్ని ఇరవై నిమిషాల పాటు ఫ్రిజ్‌లో పెడితే తక్షణ శక్తిని అందించే గ్రనోలా బార్ రెడీ అవుతుంది.