తెలంగాణ

telangana

ETV Bharat / priya

పరాఠా కొత్త రుచులను ఆస్వాదిద్దామా? - పుదీనా

కూరగాయలతో కలిసిపోతుంది.. పప్పులతో చేరి పోషకాలను అందిస్తుంది. చీజ్‌తో కలిసి కొంగొత్త రుచులను పరిచయం చేస్తుంది. ఆకుకూరలపైనా అభిమానమే! అదేనండి పోషకాల పరాఠా.. మరి ఆహా అనిపించే ఆ రుచులను మనమూ ఆస్వాదిద్దామా!

parata recipe
పరాఠా

By

Published : Aug 2, 2021, 11:52 AM IST

పరాఠా అనగానే నోరూరిపోతుంది కదూ!. అనేక పోషకాలను కలిగిన ఈ ఆహార పదార్థం.. కూరగాయలతో కలిసి పప్పులతో చేరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మరి ఈ పరాఠాను ఎన్ని రకాలుగా చెయ్యెచ్చో చూద్దామా!.

నోరూరించే దాల్​ పరాఠా..

దాల్ పరాఠా

కావాల్సినవి:

పెసరపప్పు- పావు కప్పు, నీళ్లు- తగినన్ని, ఉప్పు- రుచికి సరిపడా, పసుపు, గరంమసాలా- పావు చెంచా చొప్పున, కారం, జీలకర్ర పొడి- అర చెంచా చొప్పున, తరిగిన పచ్చిమిర్చి- ఒకటి, తరిగిన అల్లం ముక్క- ఒకటి, కొత్తిమీర తరుగు- కొద్దిగా, నెయ్యి- రెండు పెద్ద చెంచాలు, గోధుమపిండి ముద్ద- కావాల్సినంత,

తయారీ:

పెసరపప్పును పదిహేను నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత కొన్ని నీళ్లు పోసి ఉడికించాలి. ఇందులో ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, గరంమసాలా, పచ్చిమిర్చి తురుము, కొత్తిమీర తురుము, అల్లం తరుగు, నెయ్యి వేసి బాగా కలపాలి. ఇది దగ్గర పడిన తర్వాత పక్కన పెట్టి చల్లార్చుకోవాలి.

పప్పు ముద్దను చపాతీ మధ్యలో పెట్టి అన్ని వైపుల నుంచి మూసేయాలి. దీన్ని పరాఠాలా చేసుకుని రెండువైపులా చక్కగా కాల్చుకోవాలి. నెయ్యి వేయడం మరిచిపోవద్దు.

ముల్లంగితో.. సరికొత్తగా..

ముల్లంగితో.. సరికొత్తగా..

కావాల్సినవి:

తరిగిన ముల్లంగి- నాలుగు, నూనె, ఉప్పు- తగినంత, ఇంగువ- పావు చెంచా, అల్లం తురుము- చెంచా, తరిగిన పచ్చిమిర్చి- రెండు, కారం- చెంచా, గరంమసాలా, ఆమ్‌చూర్‌ పొడి- అర చెంచా చొప్పున, కొత్తిమీర కొద్దిగా.

తయారీ:

ముల్లంగి తురుములో తగినంత ఉప్పు కలిపి పక్కన పెట్టాలి. పావుగంట తర్వాత తురుమును గట్టిగా పిండేసి దాంట్లోని నీళ్లను తీసేయాలి. పాన్‌లో నూనె వేసి వేడయ్యాక ఇంగువ, అల్లం, పచ్చిమిర్చి తరుము వేసి కలపాలి. దీంట్లో ముల్లంగి తురుము, కారం, గరంమసాలా, ఆమ్‌చూర్‌ పొడి వేసి అయిదు నిమిషాలపాటు బాగా కలపాలి. రుచి చూసి ఉప్పు వేసుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లార్చాలి.

చపాతీ పిండిని తీసుకుని...ముద్దలా చేసి ముందుగా చిన్నగా పూరీల్లా ఒత్తాలి. ముల్లంగి మిశ్రమాన్ని చపాతీ మధ్యలో పెట్టి అన్ని వైపుల నుంచి మూసేయాలి. ఆ తర్వాత కాస్త మందంగానే చపాతీలా చేసుకోవాలి. ఇలా చేసిన ముల్లంగి పరాఠాను పెనంపై వేసి నెయ్యి రాస్తూ రెండువైపులా చక్కగా కాల్చుకోవాలి. దీన్ని రైతాతో తీసుకుంటే చాలా బాగుంటుంది.

పుదీనాతో.. టేస్టీగా..

కావాల్సినవి

గోధుమ పిండి- రెండు కప్పులు, పుదీనా ఆకుల తురుము- గుప్పెడు, వాము, ఉప్పు- తగినంత, పసుపు- పావు చెంచా, కారం, చాట్‌ మసాలా పొడి, ఆమ్‌చూర్‌ పొడి, జీలకర్ర- అర చెంచా చొప్పున, నెయ్యి- రెండు చెంచాలు.

తయారీ:

గిన్నెలో పిండితోపాటు అన్ని పదార్థాలు ఒకదాని తర్వాత మరొకటి వేసుకుంటూ తగినన్ని నీళ్లూ పోస్తూ చపాతీ పిండిలా తడపాలి. కాస్తంత నూనె వేసి పది నిమిషాలపాటు కలపాలి. ఈ చపాతీ ముద్దపై నూనె రాసి అరగంట మూతపెట్టి పక్కన పెట్టాలి. ఆ తర్వాత కాస్త మందంగా చపాతీల్లా చేసుకుని పెనంపై నెయ్యి వేస్తూ రెండువైపులా చక్కగా కాల్చుకోవాలి. అంతే రుచికరమైన పుదీనా పరాఠా రెడీ.

సూచన..

ఏ రకం పరాఠా చేసినా దానికి వాడే చపాతీ పిండి తయారీ విధానం ఒకేలా ఉంటుంది.

కావాల్సినవి:

గోధుమ పిండి- రెండు కప్పులు, వాము- పావు చెంచా, నూనె- చెంచా, నీళ్లు- తగినన్ని.

తయారీ:

గిన్నెలో పిండి, వాము, నూనె వేసుకోవాలి. తగినన్ని నీళ్లు పోస్తూ మెత్తగా చపాతీ పిండిలా కలిపి ముద్దపై నూనె రాసి పదిహేను నిమిషాల నుంచి అరగంట వరకు పక్కన పెట్టుకోవాలి.

చిల్లీ చీజ్‌తో.. స్పైసీగా..

చిల్లీ చీజ్‌తో.. స్పైసీగా..

కావాల్సినవి:

మోజెల్లా చీజ్‌ తురుము- కప్పు, చెద్దర్‌ చీజ్‌ తురుము- అర కప్పు, ఉల్లిపాయ- ఒకటి( సన్నగా తరగాలి), పచ్చిమిర్చి- నాలుగు (తరగాలి), అల్లంముక్క- ఒకటి, వెల్లుల్లి రెబ్బలు-మూడు (తరగాలి), పుదీనా ఆకులు- గుప్పెడు (సన్నగా తరగాలి), మిరియాల పొడి, జీలకర్ర పొడి- చెంచా చొప్పన, ఉప్పు, నెయ్యి- తగినంత.

తయారీ:

గిన్నెలో చీజ్‌లతో మొదలుపెట్టి ఉప్పు వరకు అన్ని పదార్థాలను ఒకదాని తర్వాత మరొకటి వేసుకుంటూ బాగా కలపాలి. అంతే పరాఠాలోకి చీజ్‌ మిక్చర్‌ రెడీ. ఇప్పుడు చపాతీ చేసుకుని దాని మధ్యలో చీజ్‌ మిశ్రమం పెట్టి అంచులు మూసేయాలి. మందంగా చపాతీలా చేసుకుని పెనంపై రెండువైపులా నెయ్యితో బాగా కాల్చుకోవాలి.

మరో విధంగా... చపాతీ చేసి దాని మధ్యలో చీజ్‌ మిశ్రమం సమంగా వేయాలి. మరో చపాతీతో దాన్ని మూసి అంచులు కలిపేయాలి. దీన్ని చిన్న మంటపై నెయ్యి వేస్తూ బాగా కాల్చుకోవాలి.

గోబీతో.. కమ్మగా..

గోబీతో.. కమ్మగా..

కావాల్సినవి:

నూనె- తగినంత, జీలకర్ర- పావు చెంచా, అల్లంతరుగు- అర చెంచా, పసుపు- పావు చెంచా, కాలీఫ్లవర్‌ తురుము- కప్పు, కొత్తిమీర తురుము- కొద్దిగా, తరిగిన పచ్చిమిర్చి- ఒకటి, తరిగిన ఉల్లిపాయ- ఒకటి, ధనియాల పొడి, కారం, గరంమసాలా, జీలకర్ర పొడి, ఆమ్‌చూర్‌ పొడి- అర చెంచా చొప్పున, ఉప్పు- తగినంత, నిమ్మరసం- చెంచా, నెయ్యి- సరిపడా.

తయారీ:

పాన్‌లో నూనె వేసి వేేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం తరుగు వేసి వేయించాలి. కాలీఫ్లవర్‌ తురుము, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆమ్‌చూర్‌ పొడి వేసి కలిపి మూత పెట్టాలి. చిన్న మంటపై ఈ మిశ్రమాన్ని కాసేపు ఉడకనివ్వాలి. నిమ్మరసం, కొత్తిమీర తురుము వేసి చల్లార్చాలి. కాలీఫ్లవర్‌ మిశ్రమాన్ని చపాతీ మధ్యలో పెట్టి అంచులు మూసేయాలి. దీన్ని చపాతీలా చేసి రెండు వైపులా నెయ్యి వేసి బాగా కాల్చాలి.

ఇదీ చదవండి:Paneer recipes: పసందైన పనీర్‌ విందు!

ABOUT THE AUTHOR

...view details