ప్రపంచం కొవిడ్ కోరల్లో చిక్కి విలవిలలాడుతున్న ప్రస్తుత తరుణంలో... వైరస్ బారిన పడిన రోగులకు ముందు వరసలో నిలబడి నిరుపమాన సేవలందిస్తున్న వైద్య సిబ్బంది పాత్ర ఎంతో ప్రశంసనీయం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఈ సంవత్సరాన్ని నర్సులు, ప్రసూతి ఆయాల (నర్సింగ్, మిడ్ వైఫ్స్)కు అంకితం చేసింది. సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ, మాతాశిశు రక్షణ, మానసిక ఆరోగ్యం, అత్యవసర సేవలకు సంసిద్ధత, రోగి భద్రత, సమగ్రమైన కేంద్రీకృత ప్రజా వైద్య సేవల వంటి అంశాలతోపాటు, అంటువ్యాధులు, సాంక్రామికేతర వ్యాధుల కట్టడి లక్ష్యాలను సాధించడంలో వైద్య సిబ్బంది పాత్ర కీలకం. వీరిని ఆరోగ్య సంరక్షణలో ప్రధాన శక్తిగా గుర్తించాల్సిన అవసరం ఉంది.
వైద్య సిబ్బంది కృషి ప్రశంసనీయం 80 శాతం మేర నివారణ..
భారత్‌లో ప్రసూతి, నవజాత శిశు మరణాలను 80శాతం మేర నివారించడంలో నర్సులు, ప్రసూతి ఆయాల పాత్ర ఎనలేనిదని డబ్ల్యూహెచ్‌ఓ గుర్తించింది. నెలలు నిండకుండా జరిగే కాన్పుల్ని దాదాపు నాలుగింట ఒక వంతు తగ్గించడంలోనూ వీరి పాత్ర ఎంతో ఉన్నట్లు పేర్కొంటోంది. ఈ సిబ్బందికి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా శిక్షణ ఇవ్వడం ఆర్థికపరంగానూ లాభదాయకమని, అనవసరమైన శస్త్ర చికిత్సలను తగ్గించి, వనరులను ఆదా చేయొచ్చని డబ్ల్యూహెచ్‌ఓ స్పష్టం చేస్తోంది. వీరు క్షేత్రస్థాయిలో ఎలాంటి దుర్విచక్షణకు గురికాకుండా, సురక్షిత రీతిలో, గౌరవప్రదంగా విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
విభిన్న ఆరోగ్య సంరక్షణ పథకాల్లోనూ..
విభిన్న ఆరోగ్య సంరక్షణ పథకాల్లోనూ వీరిదే ముఖ్యపాత్ర అని కొనియాడింది డబ్ల్యూహెచ్‌ఓ. నర్సులు, ప్రసూతి ఆయాలు వృత్తి పరమైన, సామాజిక, సాంస్కృతిక, ఆర్థికపరమైన అనేక అడ్డంకులను అధిగమించాల్సిన అవసరం ఉంది. మన దేశంలో ప్రసూతి ఆయాలపై ఒక తెలియని అపనమ్మకం ఉంది. వీరికి శాస్త్రీయ విధానాల్లో శిక్షణ ఉండదన్న దురభిప్రాయం నెలకొంది. సుశిక్షితులైన ఈ సిబ్బంది గర్భిణులను జాగ్రత్తగా చూసుకోవడంలో, సంక్లిష్టమైన కాన్పులను పర్యవేక్షించడంలో వైద్యుల మాదిరిగానే నైపుణ్యం ప్రదర్శిస్తారనేందుకు అనేక ఆధారాలున్నాయి. బ్రిటన్‌లో ‘ప్రతి మహిళకీ ప్రసూతి ఆయా అవసరం- కొందరికి మాత్రం డాక్టర్ కూడా అవసరం’ అని నానుడి. మన దేశంలో వైద్యులు మాత్రమే గర్భిణులకు సరైన చికిత్సను అందించగలరనే విశ్వాసముంది.
సుశిక్షితులైన ప్రసూతి సిబ్బందిగా తీర్చిదిద్దాలి..
అయితే, స్త్రీ, శిశు సంరక్షణలో వైద్య సిబ్బంది గణనీయ స్థాయిలో సేవలు అందించగలరని శాస్త్రీయ అధ్యయనాలు సైతం చెబుతున్నాయి. ప్రభుత్వం కఠినమైన అంతర్జాతీయ ప్రమాణాలతో మరింత సుశిక్షితులైన ప్రసూతి సిబ్బందిగా వీరిని తీర్చిదిద్దే దిశగా అడుగులేయాలి. బ్రిటన్ తదితర దేశాల్లో ప్రసూతి ఆయాలను ప్రత్యేక వృత్తికి చెందినవారిగా పౌర సమాజాలు, వైద్య, రాజకీయ వ్యవస్థలు గుర్తించాయి. బ్రిటన్ రాజ కుటుంబంలో యువరాణి ఒకరు ప్రసూతి ఆయాల సమక్షంలో ప్రసవించడమే ఇందుకు తార్కాణం. ఆరోగ్య సంరక్షణలో నర్సులు అత్యంత విశ్వసనీయమైన వారని ఒక అమెరికా సర్వే సైతం వెల్లడించింది. మామూలుగా, ప్రసవాలు సాధారణమైనవైతే ప్రసూతి ఆయాలు, సంక్లిష్టమైనవైతే వైద్యులు పర్యవేక్షించాలి.
మిడ్ వైఫరీ..
మన దేశంలో ఏటా 17.2 శాతం కాన్పులు శస్త్రచికిత్స ద్వారా జరుగుతాయి. 2016లో ఇవి పేద వర్గాల్లో 4.4 శాతం, సంపన్న వర్గాల్లో 40 శాతం జరిగాయి. ప్రభుత్వ రంగంలో 11.9 శాతం, ప్రైవేటు రంగంలో 40.8 శాతం ఇలాంటి కాన్పులు నమోదయ్యాయి. ఆరోగ్యకరమైన తల్లులు, చిన్నారుల కోసం శస్త్రచికిత్సతో చేపట్టే కాన్పు సరైన మార్గం కాదని డబ్ల్యూహెచ్‌ఓ స్పష్టం చేసింది. ఆస్పత్రుల్లో జరిగే ప్రసవాల సంఖ్యను పెంచాలని సూచించింది. ఈ నేపథ్యంలో ప్రసూతి గది నాణ్యతను మెరుగుపరిచేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2018లో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. 'అంతర్జాతీయ ప్రసూతి ఆయాల సమాఖ్య' ప్రమాణాలకు అనుగుణంగా 'మిడ్ వైఫరీ'పై కొత్త మార్గదర్శకాలను 2018 డిసెంబరులో విడుదల చేసింది. ఇందులో ‘మిడ్ వైఫరీ’లో 18 నెలల అదనపు శిక్షణ ఉంది. దేశంలోనే మొట్టమొదటగా తెలంగాణ ప్రభుత్వం ‘మిడ్ వైఫరీ కోర్సు’ను ‘యునిసెఫ్’ సహకారంతో ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యంలో కరీంనగర్ జిల్లాలో 2017 అక్టోబర్‌లో ప్రారంభించి ఆదర్శంగా నిలిచింది. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ వంటి ఉదంతాలతో వైద్య సిబ్బందికి కొరత ఏర్పడే ముప్పున్న నేపథ్యంలో దేశంలో నర్సింగ్ వ్యవస్థపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉంది. అంతేకాదు, నర్సులు గౌరవప్రదమైన వాతావరణంలో వైద్యులతో కలిసి పనిచేసేలా వ్యవస్థలను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది.
- డాక్టర్ శ్రీభూషన్ రాజు, రచయిత- హైదరాబాద్ నిమ్స్‌లో నెఫ్రాలజీ విభాగాధిపతి
ఇదీ చదవండి:'రోగ నిరోధక శక్తిని పెంచే మహారాజ పోషకాలు ఇవే'