భారత్‌లో సుదీర్ఘ తీరప్రాంతం దాదాపు రెండు కోట్ల మంది మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తోంది. చేపల ఉత్పత్తిలో భారత్ మూడో స్థానంలో ఉండటం ఈ రంగానికి ఉన్న ప్రాధాన్యాన్ని చాటిచెబుతోంది. అయితే కొన్ని తరాలుగా చేపల వేటతోనే జీవితం సాగిస్తున్న సంప్రదాయ మత్స్యకార కుటుంబాలు కష్టాలకు ఎదురీదుతున్నాయి. కాలానుగుణంగా మార్పును స్వీకరించకపోవడం, ఆధునిక వేట పద్ధతులను అందిపుచ్చుకోలేకపోవడం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, దళారుల దందా, ప్రభుత్వ పథకాల లబ్ధిని అందుకోవడంలో ఇబ్బందులు వెరసి మత్స్యకారుల జీవితాలు ఒడుదొడుకుల మధ్యే సాగుతున్నాయి.
పెరుగుతున్న డీజిలు ధరలు వేట ఖర్చును భారీగా పెంచేస్తున్నాయి. రేపు (నవంబరు 21న) ప్రపంచ మత్స్య దినోత్సవం(World Fisheries Day) సందర్భంగా దేశీయ మత్స్యకారుల సమస్యలపై చర్చ జరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని పథకాలు అమలు చేస్తున్నా మత్స్యకారుల జీవితాల్లో ఆశించినంత మెరుగుదల కనిపించడం లేదు. వీరి పెట్టుబడి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ సౌకర్యాన్ని కల్పించింది. చేపల పెంపకం, విక్రయంలో మత్స్యకారులను సంఘటిత పరచేందుకు దేశవ్యాప్తంగా మత్స్యకార సంఘాలు ఏర్పాటయ్యాయి. ఇందులో అనర్హుల చొరబాటు, స్థానిక రాజకీయ నాయకుల ప్రాబల్యంవల్ల అసలైన లబ్ధిదారులకు చాలాచోట్ల న్యాయం జరగడంలేదు.
నిరుడు కేంద్రం ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన పేరిట ప్రకటించిన కార్యక్రమం- ఇప్పటిదాకా మత్స్యరంగంలో తీసుకొచ్చిన అతి పెద్ద పథకం. ఇందులో రూ.12,340 కోట్లు మత్స్యకారుల సంక్షేమ పథకాలకు, మరో రూ.7,710 కోట్లు ఈ రంగంలో మౌలిక వసతుల అభివృద్ధికి కేటాయించారు. పథకం వచ్చి ఏడాదిన్నరయినా మత్స్యకారులకు లబ్ధి చేకూర్చే విషయంలో వడివడిగా అడుగులు పడటం లేదు.
వలసల చిక్కులు
సుదూర సముద్ర తీరమున్నా ఫిషింగ్ హార్బర్లు, పట్టి తెచ్చిన చేపల్ని నిల్వ చేసే సౌకర్యాలు లేక వందల కొద్దీ మత్స్యకార గ్రామాల నుంచి ప్రజలు సుదూర తీరాలకు వలసపోతున్నారు. వేట తప్ప వేరే జీవనోపాధి తెలియని గంగపుత్రులు కుటుంబాన్ని పోషించేందుకు వెట్టిచాకిరీ పాలవుతున్నారు.
ఉదాహరణకు 193 కి.మీ. తీరప్రాంతమున్న ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో 57 వేల కుటుంబాలు చేపల వేటపై ఆధారపడి బతుకుబండిని నెట్టుకొస్తున్నాయి. జిల్లాలో ఫిషింగ్ హార్బర్లు, వేటకు సరకు నిల్వకు మౌలిక వసతులు లేక 25 వేలకుపైగా మత్స్యకారులు తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, గోవా, కేరళ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ వంటి తీరప్రాంతాలకు వలస వెళ్లారు. అక్కడ తక్కువ కూలీకే పని చేయాల్సిన దుస్థితిలో మగ్గుతున్నారు. వేట సాగిస్తూ పొరపాటున పొరుగు దేశాల జలాల్లోకి వెళ్ళి పట్టుబడితే, స్వస్థలాలకు తిరిగివచ్చి కుటుంబ సభ్యులను కలుసుకొనేందుకు కొన్నేళ్లు పడుతోంది. కొంతమంది అక్కడే ప్రాణాలూ కోల్పోతున్నారు. ఆటుపోట్ల ఆనుపానులు తెలుసుకుని ప్రాణాలు పణంగా పెట్టి సముద్రంపై వేటకెళ్లే గంగపుత్రులను దళారులు దోచుకుంటున్నారు.
దళారులంతా కూటమి కట్టి, వచ్చిన సరకు ధర అడ్డంగా తగ్గించేస్తున్నారన్న మత్స్యకారుల వేదన దశాబ్దాలుగా తీరని చింతే. వేటకు పెట్టుబడి కోసమే అప్పులు తెచ్చే మత్స్యకారులు, చేపలు పట్టిన తరవాత వాటిని నిల్వ చేసే సదుపాయాలు అంతంతమాత్రమే. ప్రభుత్వపరంగా నిల్వకు చాలినన్ని సౌకర్యాల్లేక దళారులు అడిగినకాడికే సరకు ఇచ్చేసి అరకొర డబ్బులతో ఇంటిముఖం పట్టే పరిస్థితి అత్యధిక ప్రాంతాల్లో కనిపిస్తోంది. చేపలు, రొయ్యలు తక్కువగా దొరుకుతున్నప్పుడో లేదా అరుదైన మత్స్యసంపద లభించినప్పుడో తప్ప చేతినిండా డబ్బులు చూసే సందర్భాలు తక్కువే.