తెలంగాణ

telangana

ETV Bharat / opinion

మహిళలకు పేదరికం కాటు- కరోనాతో దిగజారిన పరిస్థితి - gender inequlities

కొవిడ్‌ మహమ్మారితో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉద్యోగాల్ని, ఉపాధి అవకాశాల్ని నష్టపోయారు. దీనివల్ల రాబోయే రోజుల్లో పరిస్థితులు లింగపరమైన అసమానతలకు దారితీస్తూ, మహిళలు మరింత పేదరికంలోకి జారుకునే ప్రమాదం ఉందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం, ఐరాస అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) 2021 నాటికి దాదాపు 4.7 కోట్ల మంది మహిళలు, బాలికలు తీవ్ర పేదరికంలోకి జారే అవకాశం ఉందని నివేదించింది.

women-deteriorating-condition-to-pandemic-impact
మహిళలకు పేదరికం కాటు- మహమ్మారితో దిగజారిన పరిస్థితి

By

Published : Jan 29, 2021, 6:49 AM IST

ఆధునిక ప్రపంచంలో అవకాశాలను అందిపుచ్చుకోవడంలో సగటుజీవికి పేదరికం అడుగడుగునా అడ్డుపడుతోంది. 2030 నాటికి పేదరికాన్ని అంతం చేయాలని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో కొద్దికాలంగా ప్రపంచ దేశాలు చేస్తున్న కృషి కొంతమేర ఫలించింది. అంతలోనే మహమ్మారిలా చుట్టుముట్టిన కొవిడ్‌ సమస్య కోట్లమందిని కనీస అవసరాలకూ దూరం చేసింది. ఫలితంగా, మరింత మంది పేదరికంలోకి జారారు. ఈ ప్రభావం పురుషులతో పోలిస్తే మహిళలపై అధికంగా ఉందని అనేక అధ్యయనాలు చాటుతున్నాయి.

కొవిడ్‌ మహమ్మారితో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉద్యోగాల్ని, ఉపాధి అవకాశాల్ని నష్టపోయారు. దీనివల్ల రాబోయే రోజుల్లో పరిస్థితులు లింగపరమైన అసమానతలకు దారితీస్తూ, మహిళలు మరింత పేదరికంలోకి జారుకునే ప్రమాదం ఉందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం, ఐరాస అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) 2021 నాటికి దాదాపు 4.7 కోట్ల మంది మహిళలు, బాలికలు తీవ్ర పేదరికంలోకి జారే అవకాశం ఉందని నివేదించింది. ఫలితంగా మహిళల విషయంలో కొన్ని దశాబ్దాలుగా సాధించిన పురోగతి పూర్తిగా తిరోగమనంలోకి వెళ్ళే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా దక్షిణాసియా ప్రాంతంలో ఈ పేదరిక వ్యత్యాసం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని యూఎన్‌డీపీ అభిప్రాయపడింది. 25 నుంచి 34 ఏళ్ల వయస్సు కలిగిన మహిళలు, బాలికలు దుర్భర పరిస్థితిని ఎదుర్కోవచ్చని తెలపడంతోపాటు రానున్న దశాబ్దకాలంలో పురుషుల కంటే మహిళలు ఆర్థికంగా వెనకంజ వేస్తారని నివేదిక స్పష్టం చేసింది.

ఉద్యోగాలు కోల్పోయింది మహిళలే..

కొవిడ్‌ మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన సంగతి విదితమే. ఇది పురుషులతో పోలిస్తే మహిళల ఉద్యోగ అవకాశాలపై భారీ ప్రభావాన్నే కనబరచింది. ఇటీవల అమెరికాలో పురుషులతో పోలిస్తే ఉపాధిని కోల్పోయిన వారిలో మహిళలే ఎక్కువ ఉన్నారని అక్కడి జాతీయ మహిళా న్యాయ కేంద్రం (ఎన్‌డబ్ల్యూఎల్‌సీ) విశ్లేషణ స్పష్టం చేసింది. ఈ అధ్యయనం ప్రకారం డిసెంబరు నెలలో అమెరికాలో పెద్దసంఖ్యలో ఉద్యోగాలు పోయాయి. అవన్నీ మహిళలకు సంబంధించినవే కావడం గమనార్హం. లింగ సమానత్వంలో మెరుగ్గా ఉన్న అమెరికాలోనే ఈ స్థాయిలో మహిళలు ఉపాధిని కోల్పోతే మధ్యస్థ, అల్పాదాయ దేశాల పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. అనాదిగా లింగపరమైన అసమానతలు వేళ్లూనుకొని ఉన్న వర్ధమాన భారత్‌లో మహిళల పరిస్థితి చెప్పనక్కర్లేదు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అదుపు చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌ సమయంలో మహిళలపై వివిధ రకాల హింస పెరిగినట్లు మహిళా కమిషన్‌కు అందిన ఫిర్యాదులే స్పష్టం చేస్తున్నాయి. అందుకే ప్రభుత్వాలు ముందుజాగ్రత్తగా మేల్కొని లింగసమానత్వం దిశగా అడుగులేస్తూ ఉద్యోగ, ఉపాధి కల్పనల్లో మహిళలకు తగిన అవకాశాలు కల్పించాలని యూఎన్‌డీపీ సూచించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

రాజకీయ అభివృద్ధి సాధించాలి

దేశాభివృద్ధిలో పురుషులతో పాటు మహిళల పాత్ర కీలకం. పురుషులతో సమానంగా మహిళలు సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధి సాధించినప్పుడే పేదరికం అంతమవుతుంది. నేటి సంక్షోభంలో మహిళలకు ఆర్థిక రక్షణ కల్పించి స్వావలంబన దిశగా అడుగులు వేయడానికి ప్రపంచ దేశాలు విభిన్న రీతుల్లో అవకాశాలను అన్వేషించాల్సిన అవసరం ఉంది. ప్రపంచాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు మొదటగా చేయాల్సిన పని స్త్రీలలోని పేదరికాన్ని నిర్మూలించాలన్న సంగతిని ప్రభుత్వాలు గుర్తించాలి. లింగ సమానత్వం కోసం కృషి చేయాలి. ఇది కుటుంబం నుంచే ప్రారంభం కావాలి. బాలికలకు ప్రత్యేక విద్య, వైద్య సౌకర్యాలను అందించాలి. మహిళలు భాగస్వాములయ్యే రంగాలపై ప్రభుత్వాలు పెద్దయెత్తున వ్యయం చేయాలి. లింగ భేదం లేకుండా మహిళలకు ఆర్థిక రక్షణ కల్పించడానికి ప్రత్యేక విధానాలను, పథకాలను రూపొందించాలి. మహిళలపై పెచ్చరిల్లుతున్న హింసను నిరోధించడానికి చట్టాలను పటిష్ఠంగా అమలు చేయాలి. బాల్య వివాహాలు, వరకట్నం, వెట్టిచాకిరి, బాల కార్మిక వ్యవస్థ వంటి సాంఘిక దురాచారాలను అంతమొందించేందుకు చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలి. మహిళల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు అమలు చేసి, ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలి. ఐరాసతో పాటు ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి వంటి సంస్థలు అమలు చేస్తున్న పేదరిక నిర్మూలన కార్యక్రమాలు మహిళలు అధికంగా లబ్ధి పొందే విధంగా ఉండాలి. గ్రామాల్లో మహిళా స్వయం సహాయక బృందాలకు తక్కువ వడ్డీతో సూక్ష్మ రుణాలు అందించాలి. కుటీర పరిశ్రమలను ప్రోత్సహించాలి. గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో మహిళలకు పని దినాలు పెంచాలి. ఇలాంటి చర్యలు స్త్రీలలో పేదరికాన్ని అంతం చేసేందుకు దోహదపడతాయి.

- జి.శ్యామల

ABOUT THE AUTHOR

...view details