తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ప్రకృతిని పరిరక్షిస్తేనే మనిషికి భవిత

వాతావరణ మార్పులు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. ప్రకృతి విలయం సృష్టిస్తోంది. వరదలు, మరోవైపు ఉష్ణోగ్రతలు పెరిగి ఎండలు మండిపోవడం సహా పలు దేశాల్లో కార్చిచ్చు ప్రకృతి ప్రకోపానికి అద్దం పడుతోంది. ఈ క్రమంలో ప్రపంచదేశాలన్నీ యుద్ధప్రాతిపదికన స్పందించి పర్యావరణ సమస్యలకు పరిష్కారాలను సాధించాల్సి ఉందని ఐక్యరాజ్య సమితి నొక్కి చెబుతోంది. రానున్న పదేళ్లలో ఆచరణాత్మక, పరిమాణాత్మక చర్యలు అవసరమని, ముఖ్యంగా హరిత ఉద్గారాలను తగ్గించాలని ఐరాస ఇటీవల ప్రపంచ దేశాలకు పిలుపిచ్చింది.

climate change
వాతావరణ మార్పులు

By

Published : Aug 14, 2021, 5:55 AM IST

ఏటికేడు పెరిగిపోతున్న భూతాపం, కర్బన ఉద్గారాలు కలవరపెడుతున్నాయి. ఇప్పటికే వాతావరణ మార్పుల పర్యవసానాలను ప్రపంచమంతా చవిచూస్తోంది. ప్రపంచదేశాలన్నీ యుద్ధప్రాతిపదికన స్పందించి పర్యావరణ సమస్యలకు పరిష్కారాలను సాధించాల్సి ఉందని ఐక్యరాజ్య సమితి నొక్కి చెబుతోంది. రానున్న పదేళ్లలో ఆచరణాత్మక, పరిమాణాత్మక చర్యలు అవసరమని, ముఖ్యంగా హరిత ఉద్గారాలను తగ్గించాలని సమితి ఇటీవల ప్రపంచ దేశాలకు పిలుపిచ్చింది. ప్రజారోగ్యం పచ్చటి ప్రకృతిపైనే ఆధారపడి ఉందని పునరుద్ఘాటించింది. అటవీ విస్తీర్ణం పెంచి, పచ్చదనాన్ని పరిరక్షించుకోవాలని స్పష్టంచేసింది. అటవీ విధ్వంసం పతాక స్థాయిలో ఉండటంతో ఏటా 47 లక్షల హెక్టార్ల అరణ్యాలు మాయమైపోతున్నాయని, ప్రతి మూడు సెకన్లకు ఒక ఫుట్‌బాల్‌ స్టేడియమంత అడవి తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు పారిశ్రామిక విప్లవ కాలానికి ముందున్న పరిస్థితితో పోలిస్తే సగటు ఉష్ణోగ్రత 1.2 డిగ్రీలు పెరిగింది. మంచుకొండలు మైనపు ముద్దల్లా కరిగిపోతున్నాయి. బొగ్గు, ఇసుక, ఇనుము, బాక్సైట్‌వంటి ఖనిజాల తవ్వకం ముమ్మరించింది.

విచ్చలవిడిగా వనరుల వినియోగం

పర్యావరణ పరిరక్షణకోసం అయిదు దశాబ్దాలుగా ఐక్యరాజ్యసమితి, దాని అనుబంధ సంస్థలు అనేక కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాయి. ప్యారిస్‌ ఒప్పందం, క్యోటో ప్రొటోకాల్‌ ఒడంబడికలు వంటివి ఎన్నో జరిగాయి. కానీ ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. కాలుష్యం, కర్బన ఉద్గారాల కట్టడి, వాతావరణ మార్పులకు సంబంధించి ఐక్యరాజ్యసమితిది ప్రేక్షకపాత్రగానే మిగిలిపోతోంది. ప్రపంచంలో ఒకసారి వాడి పారేసే (సింగిల్‌ యూజ్‌) ప్లాస్టిక్‌ ఉత్పత్తులు ఏటా 44 కోట్ల టన్నుల మేర ఉత్పత్తవుతున్నాయి. ఏటా 80 లక్షల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు సముద్ర జలాల్లో కలుస్తున్నాయి. మానవ చర్యల కారణంగా ఎన్నో జీవరాశుల ఆవాసాలు చెదిరి కొన్ని జాతులు అంతరించిపోతున్నాయి. గడచిన శతాబ్దంలో సగభాగం చిత్తడి నేలలు కనుమరుగయ్యాయి. మానవజాతి పరిమితికి మించి ప్రకృతి వనరులను వినియోగిస్తూ వాతావరణ విపరిణామాలకు కారణమవుతోంది. నేడు ప్రపంచంలో తరచూ పలు దేశాల్లో కరవులు, వరదలు కాటేస్తున్నాయి. పర్యావరణం, జీవవైవిధ్యం దెబ్బతిని ప్రకృతి విపత్తులు విరుచుకుపడుతున్నాయి. సహజ వనరుల దోపిడి ఇదే స్థాయిలో కొనసాగితే, రానున్న కాలంలో మానవాళి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రకృతికి పునరుజ్జీవం కల్పించేలా పర్యావరణ వ్యవస్థలను కాపాడుకోవడానికి ఈ దశాబ్దమే కీలకమని, అలసత్వం వీడి అందరూ సుస్థిర ధరిత్రికోసం కదిలిరావాలని పిలుపిస్తున్నారు.

ఐరాస నివేదికలు, పరిశోధనల ప్రకారం వచ్చే దశాబ్ద కాలం ప్రపంచ దేశాలకు చాలా కీలకం. అందరికీ ఆహారం, ఆరోగ్యం, పరిశుభ్రమైన నీరు, ఉద్యోగం వంటివి అందాలంటే ముందు పర్యావరణ పునరుజ్జీవ ప్రక్రియ కీలకం. జీవ వైవిధ్య సదస్సు సూచనల మేరకు 2030 నాటికి జీవ వైవిధ్య సంక్షోభ నివారణకు, 2050 నాటికి దెబ్బతిన్న పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించడానికి ప్రతి దేశంలోని 30శాతం నేల, సముద్ర జలాలను పరిరక్షించాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు ఒప్పందంపై సంతకం చేసిన భారత్‌- ప్రపంచంలో విస్తార జీవ వైవిధ్యం కలిగిన దేశంగా గుర్తింపు పొందింది. దేశంలో కొత్త జీవ వైవిధ్య ప్రాంతాలను గుర్తించి పరిరక్షణకోసం నడుం బిగించాలి. వైజ్ఞానికంగా ముందడుగు ద్వారానే ఇది సాధ్యమని ప్రభుత్వాలు గుర్తించాలి.

పచ్చదనమే జవం, జీవం

ప్రస్తుత పరిస్థితుల్లో మానవాళిని, ప్రకృతిని రక్షించేవి ఆవిష్కరణలు, పెట్టుబడులే. పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణ ప్రజలకు పరోక్ష లబ్ధిని కలిగిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హరిత వ్యాప్తికోసం నిధుల కేటాయింపును పెంచాలి. కార్పొరేట్‌ సంస్థల సామాజిక బాధ్యత నిధులను మొక్కల పెంపకం, సామాజిక వనాల విస్తరణకు ఖర్చు పెట్టేలా నిబంధనల్ని పరిపుష్టీకరించాలి. తరిగిపోయిన అడవుల పునరుద్ధరణకు తెలుగు రాష్ట్రాలు పోటీ పడాలి. దేశంలో సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరినీ భాగస్వాములను చేస్తున్న గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌ హరిత సంకల్ప సాకారానికి ఆలంబన! పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణ, ఆరోగ్యజీవనం, నిలకడైన వాతావరణం సాధనలో ప్రభుత్వాల చర్యలకంటే పౌర భాగస్వామ్యం అతి ముఖ్యం.

ప్రకృతి హితకరమైన విధానాలు ప్రతి ఇంటి నుంచి మొదలు కావాలి. ప్రతి ఒక్కరూ చెట్లు నాటి, హరిత సాంద్రత పెంచి తద్వారా అడవుల విస్తీర్ణం రెట్టింపు చేయాలి. డాక్టర్‌ అబ్దుల్‌ కలాం ఉద్బోధించినట్లు- ప్రతి మనిషి తన జీవనానికి కావాల్సిన ఆక్సిజన్‌ పొందడానికి కనీసం మూడు మొక్కలు నాటి సంరక్షించాలి. నగరవాసులు తమ ఇంటిని మిద్దె తోటగా మార్చి కూరగాయల ఉత్పత్తికి శ్రీకారం చుట్టాలి. వ్యవసాయ రంగంలో రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం తగ్గించి- సేంద్రియ పద్ధతులను ప్రోత్సహించాలి. వాన నీటిని ఎక్కడికక్కడే సంరక్షించాలి. నదులు, తీరాలను శుద్ధి చేయాలి. గనుల తవ్వకాలను నియంత్రించాలి. ప్రజలు ఆహార అలవాట్లను మార్చుకోవాలి. పచ్చదనం పరిఢవిల్లి, జీవ వైవిధ్యం విరాజిల్లిన నాడు భూగోళం మానవాళి మనుగడకు అవసరమైన భరోసా ఇస్తుంది.

రచయిత- ఎం.కరుణాకర్‌ రెడ్డి, వాక్‌ ఫర్‌ వాటర్‌ వ్యవస్థాపకులు

ఇదీ చూడండి:వాతావరణ మార్పులపై మేలుకోకుంటే తప్పదు విపత్తు

ABOUT THE AUTHOR

...view details