కిటకిటలాడే బస్టాప్‌లు... బస్సు ఆగక ముందే ఎక్కేందుకు సాహసాలు... కనీసం నిల్చునేందుకైనా సరిపడా స్థలం లేక ఇబ్బందులు... ప్రధాన నగరాల్లో నిత్యం కనిపించే దృశ్యాలివి. కానీ... ఇవన్నీ గతం. ఇప్పుడు లెక్క మారింది.
ఇప్పుడు అన్ని విషయాలను కరోనాకు ముందు, తర్వాత అని విభజించుకోవాల్సి వస్తోంది. భౌతిక దూరాన్నే ప్రధానాంశంగా చేసుకుని ప్రతి రంగంలోనూ మార్పులు చేయాల్సి వస్తోంది. ప్రజా రవాణా విషయంలోనూ అంతే.
కానీ... భౌతిక దూరం పాటించడం అనుకున్నంత సులువా? సాధారణ రోజుల్లో(కరోనాకు ముందు) కిక్కిరిసి ప్రయాణిస్తేనే బస్సులు సరిపోవడం లేదు. మరి ఇప్పుడెలా? ఒక్కసారిగా బస్సుల సంఖ్య పెంచడం సాధ్యమేనా? అందుబాటులో ఉన్న ప్రజా రవాణా సాధనాలతోనే భౌతిక దూరం నిబంధన అమలు చేస్తూ... ప్రజల అవసరాలు తీర్చడం సాధ్యమేనా?
ప్రభుత్వ బస్సులేవి?
దేశంలో ప్రభుత్వం కంటే ప్రైవేటు సంస్థలే ఎక్కువగా ప్రయాణికుల అవసరాలు తీరుస్తున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. 'రోడ్ ట్రాన్స్పోర్ట్ ఇయర్ బుక్ 2016-17' ప్రకారం 1,49,100 బస్సులను ప్రభుత్వం నడుపుతోంది. దేశంలో మొత్తం నడిచే బస్సుల్లో వీటి వాటా 8 శాతం మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్టీసీ బస్సుల్లో భౌతిక దూరానికి ప్రభుత్వం భరోసా కల్పించడం గగనమే అవుతుంది.
ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ డెవలప్మెంట్ పాలసీ ప్రకారం దిల్లీ, ముంబయి వంటి ప్రాంతాల్లోని 20 శాతం మంది ప్రయాణికులు ప్రభుత్వ రవాణాపైనే ఆధారపడి ఉన్నారు. దిల్లీలో సగటున 43 లక్షల మంది ప్రయాణికులకు కనీసం 14,300 బస్సులు అవసరం అవుతాయని అంచనా. కానీ నగరంలో ఉన్నవి 5,576 బస్సులే.
మహారాష్ట్రలో 2,865 బస్సులు 22 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో 10,460 బస్సులు నడుస్తున్నాయి. సాధారణ రోజుల్లో కోటి మంది ప్రయాణికులు ఈ సేవలను ఉపయోగించుకుంటున్నారు.