భూగోళం అధికంగా నీటితో నిండి ఉన్నప్పటికీ అందులో మంచినీటి లభ్యత 2.5 శాతమే. మంచినీటిని పొదుపుగా వినియోగించుకొనేందుకు జల సంరక్షణ అత్యంత ఆవశ్యకం. సురక్షితమైన తాగునీటిని ప్రోది చేసుకుని, పంపిణీ చేస్తూ, తగినంతగా వాడుకొనేందుకు ప్రణాళిక అవసరం. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛ భారత్, గ్రామీణ ఆవాస్ యోజన, ఉజ్జ్వల యోజన, సౌభాగ్య యోజన లాంటి పథకాలు విజయవంతంగా అమలవుతూ, గ్రామీణ ప్రజలకు మెరుగైన జీవనం అందించడానికి తోడ్పడుతున్నాయి. మానవాళికి నిరంతర అవసరమైన సురక్షితమైన తాగునీరు అందక, తగిన జీవన ప్రమాణాలు లభించడం లేదని భావించిన ప్రభుత్వం- ప్రజలకు ఇంటి ఆవరణలో గొట్టాల ద్వారా తాగునీటిని అందించాలని, జల్ జీవన్ మిషన్(జేజేఎమ్)కు శ్రీకారం చుట్టింది. తద్వారా 2024 నాటికి దేశంలోని ప్రతి గ్రామీణ కుటుంబానికి కుళాయి కనెక్షన్ అందించి- గ్రామీణ ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలని నిశ్చయించి, చర్యలకు ఉపక్రమించింది.
జల్ జీవన్ మిషన్తో..
దేశంలో తలసరి వార్షిక నీటిలభ్యత వేగంగా తగ్గిపోతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అపరిమిత వాడకం, నీటి సంరక్షణపై దృష్టి పెట్టకపోవడం దీనికి ప్రధాన కారణాలు. గ్రామీణ జనాభాకు సురక్షిత తాగునీరు అందించడానికి తొలుత 1972లో కనీస అవసరాల కార్యక్రమంలో భాగంగా- గ్రామీణ నీటి సరఫరా కార్యక్రమం (ఏఆర్‌డబ్ల్యూఎస్‌పీ) ద్వారా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలకు ఆర్థిక మద్దతు ఇవ్వడం ప్రారంభించింది. జాతీయ గ్రామీణ తాగునీటి కార్యక్రమం (ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ) 2017 ద్వారా సాధ్యమైనంత వరకు ప్రతి ఇంటి ఆవరణలో సురక్షితమైన తాగునీటి లభ్యత ఉండేలా చేయడమనే ధ్యేయంతో కార్యాచరణను వేగవంతం చేసింది. అయినా దేశంలో 3.23 కోట్ల గ్రామీణ కుటుంబాలకు మాత్రమే కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. ఇంకా 15.81 కోట్ల కుటుంబాలకు కుళాయి కనెక్షన్ ఇచ్చి, తాగునీరు అందించాలని కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకాన్ని 2019 ఆగస్టులో ప్రారంభించింది. రాష్ట్రాల సమన్వయంతో ఈ పథకాన్ని అమలు చేస్తోంది. నీటి సరఫరా ఏ మాత్రం సంతృప్తికరంగా లేని గ్రామాలకు, సురక్షిత నీరు అందని గ్రామాలకు, జిల్లాలకు, ఎస్సీ, ఎస్టీ జనాభా ఎక్కువగా ఉన్న గ్రామాలకు, సంసద్ ఆదర్శ గ్రామ యోజన గ్రామాలకు, అత్యంత వెనకబడిన గిరిజన గ్రామాలకు, మెదడు వాపు ప్రభావిత జిల్లాలకు అధిక ప్రాధాన్యమిస్తారు.