ఒకపక్క కొవిడ్ మూడో విజృంభణ పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను హెచ్చరిస్తోంది. మూడో ముప్పును సమర్థంగా ఎదుర్కోవాలన్నా, కేసులు పెరగకుండా అడ్డుకోవాలన్నా- టీకాయే సమర్థమైన ఆయుధం. వ్యాక్సిన్ వేసుకొని కళాశాలల్లో అడుగు పెట్టేందుకు యువత వేచిచూస్తుండగా- మొదటి డోసు వేసుకొని, రెండో విడత కోసం ఎంతోమంది వయోజనులు పలు వారాలుగా ఎదురు చూస్తున్నారు. వీరందరికీ సత్వరమే టీకాలు వేయాల్సి ఉంది. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదు. ఇటీవలిదాకా సూపర్‌స్ప్రెడర్ల పేరిట వివిధ వర్గాలకు ప్రత్యేక డ్రైవ్‌లంటూ హడావుడి కనిపించినా, ప్రస్తుతం పరిస్థితి ఒక్కసారిగా చల్లబడింది. మొదటి విడతవారికే అధిక ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా సమాజంలో ఎక్కువ మందికి టీకాలు వేసి, సమూహ నిరోధకత(హెర్డ్ ఇమ్యూనిటీ) సాధించాలని ప్రభుత్వం సంకల్పించినా, ఆచరణలో అదీ పకడ్బందీగా అమలవుతున్నట్లు కనిపించడం లేదు.
రాష్ట్రాల్లో కొరత
జనవరి 16న ప్రారంభించిన టీకా కార్యక్రమం పలు అవాంతరాల మధ్య సాగుతోంది. 45 సంవత్సరాలకు పైబడిన వారందరికీ అవకాశం కల్పించడంతో ఏప్రిల్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకున్నా, సంఖ్యాపరంగా పెద్దగా ముందడుగు పడలేదు. మే నెలలో 18 సంవత్సరాలకు పైబడిన వారికీ ఇవ్వడం మొదలుపెట్టినా, కొద్ది వారాల నుంచి మళ్ళీ నెమ్మదించింది. తీవ్రస్థాయి టీకాల కొరత ఎదుర్కొంటున్నట్లు రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. మహారాష్ట్ర, దిల్లీ పశ్చిమ్‌బంగ, రాజస్థాన్, ఒడిశా, తమిళనాడు వంటి రాష్ట్రాలు తమకు టీకాల సరఫరా తగ్గిపోయినట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పలు కేంద్రాల్ని మూసివేశారు. పంపిణీ కార్యక్రమం ఒక్కసారిగా మందగించింది. భారీ వరసలు, తోపులాటలు, నిల్వలు లేవనే సమాధానాలు పరిపాటిగా మారాయి. రెండో విడత టీకా వేసుకోవాల్సిన వారు నిరాశగా ఎదురుచూస్తున్నారు.
గుజరాత్‌లోనూ కొరత
ప్రధానమంత్రి సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోనూ కొరత నెలకొన్నట్లు వార్తా కథనాలు సూచిస్తున్నాయి. గతంలో గుజరాత్‌కు రోజుకు తొమ్మిది లక్షల డోసులదాకా రాగా, ఇటీవలి కాలంలో మూడు నుంచి నాలుగు లక్షల వరకే వస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి నితిన్ పటేల్ వెల్లడించడం గమనార్హం. తమ రాష్ట్రంలో రోజుకు 15 లక్షల డోసులు వేయగలిగే సామర్థ్యం ఉన్నా- మూడు లక్షల వరకే వేస్తున్నట్లు మహారాష్ట్ర ఆరోగ్యమంత్రి రాజేశ్‌తోపే చెబుతున్నారు. దేశ రాజధాని దిల్లీలోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. టీకా పంపిణీ కార్యక్రమం మొదలై ఇంతకాలం గడిచినా ఇప్పటికీ గందరగోళం తొలగలేదని దిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియా ఇటీవల చేసిన ట్వీట్ పరిస్థితి తీవ్రతను కళ్లకు కడుతోంది. తాజాగా కరోనా నియంత్రణపై రాజ్యసభలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో వ్యాక్సిన్ కొరతను తగ్గించడమే లక్ష్యంగా కంపెనీలు ఉత్పత్తిని పెంచుతాయని చెప్పారు.
జులైలో టీకాల లభ్యత 12 కోట్ల నుంచి 13.5 కోట్ల డోసులకు పెరిగిందన్నారు. డోసుల షెడ్యూలు, సంఖ్యకు సంబంధించిన వివరాలన్నీ రాష్ట్రాలకు ముందుగానే తెలుసునని, అయినా సరఫరా కొరత వంటి పరిస్థితి తలెత్తితే, అది రాష్ట్రాల స్థాయిలో నిర్వహణ లోపమేనని ఇటీవల ఆయన ఆరోపించారు. ఇలా ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకోవడం వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదు. తాజాగా టీకాల పంపిణీ కార్యక్రమం మళ్ళీ మందగించడానికి- సరఫరా తక్కువగా ఉండటం, కొత్త వ్యాక్సిన్లకు అనుమతుల ప్రక్రియ నెమ్మదించడమే కారణమని నిపుణులు చెబుతున్నారు. ‘కొవాక్స్’ కార్యక్రమం ద్వారా 75 లక్షల మోడెర్నా టీకా డోసులు భారత్‌కు అందనున్నట్లు చెబుతున్నా- అమెరికాతో నష్టపరిహార నిబంధనపై ఏకాభిప్రాయం కుదరనందువల్ల ఆ టీకా మనదేశంలో ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తుందనే దానిపై స్పష్టత రాలేదు.